శ్రీశైలం ప్రాజెక్టు ఖాళీ! | Sakshi
Sakshi News home page

శ్రీశైలం ప్రాజెక్టు ఖాళీ!

Published Fri, Mar 18 2016 1:55 AM

శ్రీశైలం ప్రాజెక్టు ఖాళీ! - Sakshi

లభ్యత నీటినంతా  పంచేసిన కృష్ణా బోర్డు
తెలంగాణకు 6.5, ఏపీకి 4.5 టీఎంసీల కేటాయింపు

 
హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టు ఖాళీ కానుంది. శ్రీశైలంలో వినియోగార్హమైన 11.24 టీఎంసీల నీటిని తక్షణ తాగునీటి అవసరాలకు ఇరు రాష్ట్రాలు వాడుకునేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు అంగీకరించింది. వినియోగార్హమైన 11.24 టీఎంసీలలో తెలంగాణ 6.5 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ 4.5 టీఎంసీలు కేటాయించింది. అందుబాటులో ఉన్న ఈ నీటితోనే వేసవిలో నెట్టుకురావాలని సూచించింది. ఈ మేరకు గురువారం ఇరు రాష్ట్రాలకు బోర్డు సభ్య కార్యదర్శి ఆర్‌కే గుప్తా లేఖలు రాశారు. ఈ ఆదేశాల ప్రకారం రాష్ట్రాలు నీటి వినియోగం మొదలుపెడితే ఏ క్షణమైనా ప్రాజెక్టు ఖాళీ కావడం ఖాయమని తెలుస్తోంది. నాగార్జున సాగర్ కుడి కాల్వ కింద తాగునీటి అవసరాలకు 4.5 టీఎం సీలు తక్షణమే విడుదల చేయాలని గత కొన్ని రోజులుగా ఏపీ సర్కారు బోర్డుకు మొరపెట్టుకుంటోంది. ఇదే విషయమై తెలంగాణ అధికారులతోనూ సంప్రదిస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సైతం నల్లగొండ జిల్లాలోని 14 తాగునీటి పథకాలు, హైదరాబాద్ జంట నగరాల తాగునీటి అవసరాలకు నీటి విడుదల అంశాన్ని తెరపైకి తెచ్చింది. తమకు 6.5 టీఎం సీల నీటిని కేటాయించాలని విజ్ఞప్తి చేసింది.

లభ్యత నీరంతా పంపిణీ..
ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో 812.3 అడుగుల వద్ద 35.63 టీఎంసీల నీరు లభ్యంగా ఉండగా ఇందులో కనీస నీటి మట్టం 790 అడుగుల వద్ద 11.24 టీఎంసీలు మాత్రమే వినియోగర్హమైనదిగా బోర్డు తేల్చింది. ఇక సాగర్‌లో కనీస నీటిమట్టం 510 అడుగులకు దిగువన, 508.4 అడుగుల వద్ద 128.97 టీఎంసీల అడుగుల నీరుందని గుర్తించింది. అయితే సాగర్ నీటిని వాడుకునేందుకు అవకాశం లేకపోవడంతో శ్రీశైలంలో ఉన్న నీటిలో తెలంగాణకు 6.5 టీఎంసీలు, ఏపీకి 4.5 టీఎంసీలు పంచింది. శ్రీశైలం, సాగర్‌లలో కనీస నీటిమట్టాలకు దిగువన నీటిని తీసుకోవాలంటే మాత్రం ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం జరగాలని తెలంగాణ ప్రభుత్వం చేసిన సూచనను ఈ సందర్భంగా బోర్డు ప్రశంసించింది.

వినియోగ లెక్కలపై భిన్న వాదనలు..
కృష్ణా బేసిన్‌లో నీటి వినియోగ లెక్కలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సమర్పించిన లెక్కలతో బోర్డు విభేదించింది. కృష్ణా జలాల్లో ఇరు రాష్ట్రాలకు ఉన్న వాటాలు, గతంలో జరిగిన ఒప్పందాలను దృష్టిలో పెట్టుకుంటే మొత్తంగా కృష్ణాలో 193 టీఎంసీల నీరు లభించగా అందులో తెలంగాణ 66 టీఎంసీలు, ఏపీ 127 టీఎంసీలు వినియోగించుకున్నాయని బోర్డు తెలిపింది. అలాగే సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల పరిధిలో తెలంగాణ, ఏపీలు సమర్పించిన లెక్కలకు విరుద్ధంగా వినియోగం జరిగిందని బోర్డు తేల్చి చెప్పింది.
 
 

Advertisement
Advertisement