పుష్కరాలకు వచ్చే సిబ్బందికి విస్తృతంగా ఏర్పాట్లు | Sakshi
Sakshi News home page

పుష్కరాలకు వచ్చే సిబ్బందికి విస్తృతంగా ఏర్పాట్లు

Published Wed, May 27 2015 1:48 AM

staff can arrange a wide range puskaralalu

సబ్ కలెక్టర్ విజయరామరాజు
 కోటగుమ్మం (రాజమండ్రి) : పుష్కరాల్లో యాత్రికులకు సేవలందించేందుకు సుమారు వచ్చే 33 వేల నుంచి 40 వేల మంది సిబ్బంది వచ్చే అవకాశముందని ఏర్పాట్ల కమిటీ చైర్మన్, సబ్ కలెక్టర్ వి.విజయరామరాజు తెలిపారు. తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సిబ్బందికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. పోలీసులు 16 వేలు, పారిశుధ్య సిబ్బంది 7 వేలు, రైల్వే సిబ్బంది 2 వేలు, దేవాదాయ, ధర్మాదాయ శాఖ సిబ్బంది 2 వేలు, రెవెన్యూ సిబ్బంది 800, ఆర్టీసీ నుంచి 600, ఈపీడీసీఎల్ నుంచి 600, టీటీడీ నుంచి 2500, మత్య శాఖ నుంచి 400 మంది సిబ్బంది వస్తారని తెలిపారు.
 
 అగ్నిమాపక, వైద్య, ఆరోగ్య శాఖల నుంచి ఎంతమంది సిబ్బంది వస్తారనేది ఇంకా అంచనా రాలేదన్నారు. సిబ్బందికి 12 రోజులపాటు నివాసం, భోజన వసతి కల్పించడానికి నగరంలోని 294 స్కూల్స్, కాలేజీలు, ఇతర బిల్డింగ్స్ స్వాధీనం చేసుకుంటామన్నారు. అలాగే బొమ్మురు, రాజానగరం, కోరుకొండ, సీతానగరం ప్రాంతాల్లోని స్కూల్స్, కళాశాలల్లో కూడా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. వీటితోపాటు 57 కల్యాణ మండపాలు, 32 కమ్యూనిటీ హాళ్లు కూడా వినియోగిస్తున్నామని చెప్పారు. పీఠాధిపతులు, మత పెద్దలు వస్తే వారికి దేవాదాయ శాఖ ద్వారా ఏర్పాట్లు చేస్తామన్నారు.
 
 మూడు ప్రాంతాల్లో పుష్కర నగర్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆర్టీసీ రూట్ మ్యాప్‌లు కూడా సిద్ధం చేశామన్నారు. గోదావరి రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు ఒకవైపు నుంచి లోపలకు వెళ్లేందుకు, మరోవైపు నుంచి బయటకు వచ్చేందుకు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇలాగే టౌన్ స్టేషన్‌లో కూడా ఏర్పాటు చేస్తామని సబ్ కలెక్టర్ చెప్పారు. పుష్కర స్నానానికి వచ్చే యాత్రికులు తప్పనిసరిగా రెండు కిలోమీటర్లు నడవాల్సిందేనని తెలిపారు. వికలాంగులకు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేస్తామన్నారు. పుష్కరాల సమయంలో దేవస్థానాలు, ఇతర సంస్థలు ప్రత్యేకంగా కేటాయించిన ప్రాంతాల్లోనే అన్నదానాలు చేసేలా చర్యలు చేపడతామని విజయరామరాజు చెప్పారు.
 

Advertisement
Advertisement