బీజేపీ సభ్యత్వ నమోదు ప్రారంభం | Sakshi
Sakshi News home page

బీజేపీ సభ్యత్వ నమోదు ప్రారంభం

Published Mon, Dec 1 2014 1:31 AM

బీజేపీ సభ్యత్వ నమోదు ప్రారంభం - Sakshi

బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఆదివారం పోరంకిలో ప్రారంభమైంది. కేంద్ర మంత్రులు రాజీవ్
ప్రతాప్ రూడీ, ఎం.వెంకయ్య నాయుడు నుంచి సభ్యత్వం స్వీకరిస్తున్న కె.హరిబాబు

 
విజయవాడ బ్యూరో : త్వరలో జమ్మూ కాశ్మీర్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని, వచ్చేసారి ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లోనూ తమ సర్కార్లు వస్తాయని కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ సహాయ మంత్రి, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి రాజీవ్ ప్రతాప్ రూఢీ చెప్పారు. తాము కోరిన సీట్లు శివసేన ఇవ్వకపోవడంతో మహారాష్ట్రలో ఒంటరిగా పోటీ చేసి అధికారాన్ని చేజిక్కించుకున్నామని తెలిపారు. పోరంకిలో ఆదివారం జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడుతో కలసి ఆయన పాల్గొన్నారు.  ఈ సందర్భంగా రూడీ మాట్లాడుతూ.. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలపై తమకు అమితమైన గౌరవం ఉందని, అంతమాత్రాన ఆ రాష్ట్రాల్లో తమ పార్టీ బలపడడం ఆగదని స్పష్టం చేశారు. ఏపీలో ఈ ఏడాది పది లక్షల మందిని సభ్యులుగా చేర్పించాలని, ఐదేళ్లలో ఆ సంఖ్య 80 లక్షలకు చేరాలని సూచించారు.

పార్టీ అంటే జీవిత భాగస్వామి: వెంకయ్య

కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, తుళ్లూరులో పచ్చగా కనిపించే పొలాలు పోతున్నాయంటే బాధగానే ఉంటుందని, కానీ రాజధాని కోసం తప్పదని, కానీ లక్షల ఎకరాలు కావాలని తాను అనలేదని చెప్పారు. భూములు తీసుకుంటున్న రైతులకు న్యాయం జరగాలన్నారు. పార్టీని జీవిత భాగస్వామిగా భావించాలని, పార్టీ సభ్యత్వం ఒక పవిత్ర బంధమని నాయకులు, కార్యకర్తలకు ఉద్బోధించారు. బీజేపీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని, ఎవరైనా పార్టీలోకి రాావచ్చని చెప్పిన వెంకయ్య.. పదవుల కోసం వచ్చే వారిని మాత్రం తాను ఆహ్వానించబోనని స్పష్టం చేశారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వకూడదని, వ్యక్తిత్వం లేని నాయకులే కులం, మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తారని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు మాట్లాడుతూ.. ప్రతి మూడేళ్లకోసారి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. డిసెంబరు 6న అన్ని జిల్లాల్లోనూ ఒకేసారి సభ్యత్వ నమోదును ప్రారంభించాలని నాయకులకు సూచించారు. హరిబాబుకు కేంద్ర మంత్రి రూఢీ సభ్యత్వం ఇవ్వగా మంత్రులు కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావులకు హరిబాబు సభ్యత్వం ఇచ్చారు. ఈ సందర్భంగా లోక్‌సత్తా నేతలతో పాటు కాంగ్రెస్ పార్టీ నగర మాజీ అధ్యక్షుడు అడపా నాగేంద్ర సహా రాష్ట్రంలోని పలువురు నేతలు బీజేపీలో చేరారు.

కల్యాణ మండపాన్ని  ప్రారంభించిన మంత్రి
 
పెనమలూరు : యనమలకుదురులోని శ్రీరామలింగేశ్ర స్వామి ఆలయంలో దాత సంగా నరసింహారావు నిర్మించిన పలు నిర్మాణాలను కేంద్ర మంత్రి వెంకయ్య ప్రారంభించారు. కల్యాణ మండపం, హోమ మండపం, అన్నదాన సత్రాల ప్రారంభోత్సవంగా వైభవంగా నిర్వహించారు. వీరికి పూజారులు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమ, మాణిక్యాలరావు స్వామి వారికి పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ అనురాధ, ఎమ్మెల్యే బోడె ప్రసాద్, మేయర్ కోనేరు శ్రీధర్, ఎంపీపీ కనకదుర్గ, జెడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాసరావు, సర్పంచి మూడే సుభద్ర ఉన్నారు.
 
మంత్రులకు సన్మానం


మంత్రులు వెంకయ్య, ఉమ, మాణిక్యాలరావులను దాత నరసింహారావు సన్మానించారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ రీజినల్ డెరైక్టర్ చంద్రశేఖర్‌అజాద్, ఏసీ దుర్గాప్రసాద్, ఆలయ కార్యదర్శి ఎన్.భవాని, మాజీ కార్యదర్శి దూళిపాళ్ల సుబ్రమణ్యం, పూజారి సాగర్, పర్యవేక్షకుడు గంగాధర్ పాల్గొన్నారు.
 
 

Advertisement
Advertisement