హోదా డీజీపీ..పోస్టేమో కొత్వాల్! | Sakshi
Sakshi News home page

హోదా డీజీపీ..పోస్టేమో కొత్వాల్!

Published Wed, Apr 2 2014 12:23 AM

హోదా డీజీపీ..పోస్టేమో కొత్వాల్! - Sakshi

నాడు రాములు, నేడు అనురాగ్ శర్మ  
 ‘గ్రేటర్’ ఏర్పాట్లలో భాగమేనా ?
 
 సాక్షి, హైదరాబాద్: నగర పోలీసు కమిషనరేట్ చరిత్రలో మరోసారి అరుదైన సందర్భం ఇది. డీజీపీ హోదాలో ఉన్న అధికారి నగరపోలీస్ కమిషనర్‌గా ఉండడం. పదమూడేళ్ల క్రితం కూడా ఇలాగే జరిగింది. ఇప్పుడు మరోసారి ఆవిష్కృతమైంది. నగర పోలీసు కమిషనరేట్‌కు అదనపు డెరైక్టర్ జనరల్ (ఏడీజీ) హోదాలో ఉన్న అధికారి కమిషనర్‌గా ఉంటా రు. ఇప్పటి వరకు పని చేసిన అందరూ ఆ  హోదాలోని వారే. ఎవరికైనా పదోన్నతి వస్తే వారిని వెంటనే ఈ పోస్టు నుంచి బదిలీ చేయడం ఆనవాయితీ. అందుకే సాధారణంగా బదిలీలతో కూడిన పదోన్నతులనే ఇస్తుం టారు. అయితే 2000 డిసెంబర్ 15 నుంచి 2002 ఫిబ్రవరి 24 వరకు నగర పోలీసు కమిషనర్‌గా పని చేసిన పేర్వారం రాములుకు 2002 జనవరిలో డీజీపీగా పదోన్నతి వచ్చింది.


 
 అప్పట్లో నగరంలో నెలకొన్న పరిణామాల కారణంగా ఆ ఏడాది ఫిబ్రవరి 25 వరకు ఆయననే కొత్వాల్‌గా కొనసాగించింది. ప్రస్తుత కమిషనర్ అనురాగ్ శర్మ విషయంలోనూ అదే జరిగింది. అదనపు డీజీగా ఉన్న ఈయనకు డీజీపీగా పదోన్నతి ఇస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిణామాల నేపథ్యంలో తదుపరి పోస్టింగ్ వచ్చే వరకు నగర కొత్వాల్‌గానే కొనసాగించాలని నిర్ణయించింది.  మరోపక్క ఇది గ్రేటర్ పోలీసు కమిషనరేట్ ఏర్పాటులో భాగమే అనే వాదనా వినిపిస్తోంది. రెండు రాష్ట్రాల అపాయింటెడ్ డే అయిన జూన్ 2 నుంచి హైదరాబాద్ గరిష్టంగా పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగనుంది. దీంతో జీహెచ్‌ఎంసీ పరిధిలో శాంతిభద్రత అంశం గవర్నర్ పరిధిలోకి వెళ్లిపోతుంది.
 
 అయితే ప్రస్తుతం భౌగోళికంగా ఉన్న ఇబ్బందుల నేపథ్యంలో దీనికోసం హైదరాబాద్‌తో పాటు సైబరాబాద్‌లోని మెజారిటీ ప్రాంతాన్ని కలుపుతూ గ్రేటర్ హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ ఏర్పాటు అనివార్యమైంది. ఇతర మెట్రోల్లో అనుసరిస్తున్నట్లే దీనికీ కచ్చితంగా జూనియర్ డీజీపీ స్థాయి అధికారి నేతృత్వం వహించాలి. అయితే ప్రస్తుతం రెండు కమిషనరేట్లకూ వేర్వేరు చట్టాలు ఉండటంతో వీటిని కలిపేయాలన్నా... రద్దు చేసి కొత్తగా ‘గ్రేటర్’ చట్టం తీసుకురావాలన్నా అసెంబ్లీ తీర్మానం తప్పనిసరి. హైదరాబాద్ మహానగరం భౌగోళికంగా తెలంగాణ రాష్ట్రంలో భాగం కావడంతో ఈ బిల్లును ఆ రాష్ట్ర శాసనసభ ఆమోదించాల్సి ఉంటుంది. దీనికి కొన్ని నెలలు పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు అనురాగ్ శర్మను డీజీపీ హోదాలో హైదరాబాద్ కమిషనర్‌గా కొనసాగిస్తున్నారు. ‘గ్రేటర్’ ఆవిర్భావం తరవాత ఆయననే  కొత్త కమిషనర్‌గా నియమిస్తారని తెలుస్తోంది.
 
 
 కిషోర్‌కుమార్‌కు పదోన్నతి
 
 ఆంధ్రప్రదేశ్ పోలీసు అకాడమీ(అప్పా) అదనపు డెరైక్టర్ కిషోర్‌కుమార్‌కు ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అదనపు డీజీపీగా ప్రమోషన్ కల్పిస్తూ అప్పా స్పెషల్ డెరైక్టర్‌గా నియమిస్తున్నట్టు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement