దారి కాచిన తమ్ముళ్లు | Sakshi
Sakshi News home page

దారి కాచిన తమ్ముళ్లు

Published Wed, Feb 11 2015 3:43 AM

దారి కాచిన తమ్ముళ్లు - Sakshi

అవినీతి బయటకుండా ఉండేందుకు పథకం
విజిలెన్స్ అధికారులను ప్రసన్నం చేసుకునే యత్నం
కాళంగి, స్వర్ణముఖి నదిలో పొర్లుకట్టల నిర్మాణాల్లో అవినీతి

 
సాక్షి ప్రతినిధి, నెల్లూరు :  స్వర్ణముఖి.. కాళంగి నదిలో ఏర్పాటు చేసిన పొర్లుకట్ట పనుల్లో భారీ ఎత్తున అవినీతి అక్రమాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. టీడీపీ నేతలు చేపట్టిన పొర్ల్లుకట్టల పనుల్లో నాణ్యతకు తిలోదకాలిచ్చి కోట్ల నిధులు దుర్వినియోగం చేశారానే ఆరోపణలపై విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు విచారణ చేపట్టారు.అందులోభాగంగా మంగళవారం సూళ్లూరుపేట నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు.

విజిలెన్స్ అధికారులు వస్తున్నారని తెలుసుకున్న తమ్ముళ్లు అవినీతి బాగోతం బయటపడకుండా ఉండేందుకు విజిలెన్స్ అధికారులను ప్రసన్నం చేసుకునే పనిలో పడినట్లు విశ్వసనీయ సమాచారం. జిల్లాలో నీటిపారుదలశాఖ ఆధ్వర్యంలో గతంలో రూ.కోట్ల నిధులతో భారీ ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టారు. పనులను ఎక్కువ శాతం టీడీపీకి చెందిన నేతలే బినామీ పేర్లతో చేపట్టినట్లు సమాచారం. ప్రపంచబ్యాంక్ నిధులతో స్వర్ణముఖి, కాళంగి, చెరువు పనులు చేపట్టారు. నదిలో చేపట్టిన పొర్లకట్టల పనుల్లో నాణ్యతకు తిలోదకాలిచ్చినట్లు అధికారుల ప్రాథమిక విచారణలో తేలినట్లు తెలిసింది. స్వర్ణముఖి, కాళంగి నది కుడి, ఎడమవైపున గ్రావెల్, మట్టితో కట్టలా పోసి లెవల్ చేయాల్సి ఉంది.

అయితే టీడీపీ నేతలు చేపట్టిన పొర్లకట్ట పనుల్లో నదిలోని ఇసుకనే తీసి కట్టలా ఏర్పాటు చేసినట్లు తెలిసింది. దానిపై మట్టిచల్లి భారీ ఎత్తున నిధులు స్వాహా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ జిల్లా కార్యదర్శి ఒకరు రూ.2 కోట్ల పనులు చేపడితే.. అందులో రూ.కోటి వరకు నిధులు స్వాహా చేసినట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయి. కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన ఓ ముఖ్యనాయకుడొకరు రూ.10 కోట్లు విలువచేసే వివిధ పనులు చేపట్టారు. అందులో భారీ ఎత్తున అవినీతి జరిగిందని స్థానికులు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. అదేవిధంగా జిల్లాలో చేపట్టిన 127 చెరువులకు ఖర్చుచేసిన రూ.90 కోట్ల నిధులు సైతం భారీఎత్తున దుర్వినియోగం అయినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి.

అధికారులను ప్రసన్నం చేసుకునే పనిలో తమ్ముళ్లు

పొర్లకట్టలు.. చెరువు పనుల్లో జరిగిన అవినీతి అక్రమాలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టర్ మనోహర్, అడిషనల్ డెరైక్టర్ శ్రీనివాస్, రీజినల్ ఏఎస్పీ రాంప్రసాద్, డీఈ సుధాకర్, నీటిపారుదలశాఖ ఎస్‌ఈ రెడ్డెప్ప తదితరులు మంగళవారం నాయుడుపేట పరిధిలోని గ్రద్దగుంట చెరువు, స్వర్ణముఖి నదిలో చేపట్టిన పొర్లకట్టల పనులు, ఓజిలి మండలపరిధిలోని చెరువు పనులను పరిశీలించారు. విజిలెన్స్ అధికారులు వస్తున్నారన్న సమాచారం అందుకున్న టీడీపీ నేతలకు చెందిన రెండు బృందాలు నాయుడుపేట పరిధిలో ఎదురుచూడటం కనిపించింది. అయితే అధికారులు వారు వేచి ఉన్న ప్రాంతం వైపు నుంచి కాకుండా వేరొకమార్గం నుంచి వెళ్లినట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న తమ్ముళ్ల బృందం వారు ఎక్కడ ఏ పనులు పరిశీలిస్తున్నారో తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు. కా గా విజిలెన్స్ అధికారులు పనులు నాశిరకంగా జరి గిన ప్రాంతంలో కాకుండా మెరు గ్గా ఉన్నచోట్ల పరి శీలించడం స్థాని కులను ఆశ్చర్యానికి గురిచేసింది.

Advertisement
Advertisement