రంగంలోకి సర్కారీ సైనికులు ! | Sakshi
Sakshi News home page

రంగంలోకి సర్కారీ సైనికులు !

Published Mon, Jun 17 2019 11:13 AM

Steps Towards Appointment Of Village Servants Ap Govt - Sakshi

సాక్షి, విజయవాడ : యువకులు, నిరుద్యోగులకు ప్రభుత్వ సేవకులుగా అవకాశం దక్కనుంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోయే సంక్షేమ పథకాలను నేరుగా లబ్ధిదారుల ఇంటికి చేర్చడంలో వీరు కీలక భూమిక పోషించనున్నారు. ప్రతి కుటుంబంలోని కష్టాలను స్వయంగా తెలుసుకుని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారు. ప్రస్తుతం ఈ గ్రామసేవకుల నియామకం దిశగా అడుగులు పడుతున్నాయి. మరికొద్ది రోజుల్లోనే గ్రామ వలంటీర్ల వ్యవస్థ రూపొందనుంది. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటన వెలువరించడం.. తాజాగా జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలోనూ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో పాటు గ్రామ వలంటీర్లకు ఉండాల్సిన అర్హతలు, ఎలా దరఖాస్తు చేయాలన్న విషయాలను తెలుసుకునేందుకు ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలు సైతం వెలువరించింది. సీఎం ప్రకటనతో జిల్లాలో 24,523 మందికి ఉద్యోగవకాశాలు లభించనున్నాయి. 

ఇదీ సంగతి.. 
రాష్ట్రంలో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే పాలన వ్యవహరాల్లో తమదైన రీతిలో మార్పులకు అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే ప్రస్తుతం గ్రామ వలంటీర్ల వ్యవస్థ ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. ఎన్నికల ముందు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రచార సభలోనే ఇదే అంశంపై ప్రస్తావించారు. సీఎం అయిన వెంటనే వ్యవస్థ ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన చేశారు. వీరు ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల అమల్లో కీలకం కానున్నారు. 

సంక్షేమ పథకాల అమలులో కీలకం
ప్రతి 50 కుటుంబాలకు ఓ వలంటీర్‌ను నియమించనున్నారు. పింఛన్లు, పౌరసరఫరాల సరుకులు పంపిణీ నుంచి డ్వాక్రా రుణాలు, ఇళ్ల పన్నులు.. ఇలా అన్ని రకాల సేవలను చేరువ చేయడంలోనూ కీలకంగా వ్యవహరించాల్సి ఉంది. 50 కుటుంబాల అవసరాలను తెలుసుకుని వారికి నిర్ణీత సమయంలోపే సేవలను అందించాల్సిన బాధ్యత సైతం ఆ వలంటీర్‌పై ఉంది. ఒక్కో గ్రామ వలంటీర్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 వేల గౌరవ వేతనం చెల్లించనుండగా.. వేతనం తక్కువైనప్పటికీ పలువురు నిరుద్యోగులు ఆశ పడుతున్నారు.  

జిల్లాలో 24,523 మందికి ఉపాధి..
జిల్లాలో మొత్తం 47,28,816 జనాభా ఉండగా.. 7,36,193 కుటుంబాలు నివశిస్తున్నాయి. ప్రతి 50 కుటుంబాలకు ఒక్కో వలంటీర్‌ చొప్పున జిల్లాలో 14,723 మంది, గ్రామ సచివాలయాల్లో మరో 9,800 మంది మొత్తం కలిపి 24,523 మందికి ఉపాధి లభించనుంది. వీరికి ప్రతి నెలా వేతనంగా రూ.73.61 కోట్లు చెల్లించాల్సి ఉంది. పట్టణాల్లో డిగ్రీ, గ్రామాల్లో ఇంటర్, ఏజెన్సీ ప్రాంతాల్లో పదో తరగతి చదివిన వారికి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ నేపథ్యంలో 18 నుంచి 39 ఏళ్ల వయసున్న వారికి అర్హులుగా దరఖాస్తు చేయడానికి అవకాశం ఇచ్చారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసేందుకు ఆధార్‌ కార్డు, విద్యార్హత ధ్రువపత్రంతో పాటు జనన, కుల, స్వస్థల ధ్రువపత్రాలు అవసరమవుతాయి. గ్రామ వలంటీర్ల నియామకాలు ఆగస్టు 15 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు అవసరమైన మార్గదర్శకాలు, నోటిఫికేషన్‌ సైతం ప్రభుత్వం వెలువరించడంతో దరఖాస్తుల ప్రక్రియ కోసం పార్టీలకు అతీతంగా యువత ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.   

Advertisement
Advertisement