తవ్వకాల్లో రాతి విగ్రహాలు లభ్యం | Sakshi
Sakshi News home page

తవ్వకాల్లో రాతి విగ్రహాలు లభ్యం

Published Wed, Dec 19 2018 12:15 PM

Stone Statues Find In Tressures YSR Kadapa - Sakshi

వైఎస్‌ఆర్‌ జిల్లా , మంగంపేట(ఓబులవారిపల్లె) : ఏపీఎండీసీ తవ్వకాల్లో కొండపై సోమవారం భారీమిషన్‌లతో కొండలను తొలగిస్తుండగా పురాతన కాలం నాటి కపిలేశ్వరస్వామికి సంబంధించిన మూలవిరాటు, రాతిశాసనాలు, గుప్తనిధులకు సంబంధించి గుర్తులు ఉన్న రాళ్లు బయటపడ్డాయి. వీటిని గ్రామస్తులు కట్టా పుట్టాలమ్మతల్లి గుడిలో భద్రపరిచి పూజలు నిర్వహిస్తున్నారు. మట్టిరాజుల కాలంలోనే కట్టాపుట్టాలమ్మ విగ్రహప్రతిష్ట జరిగినప్పుడు కొండపై కపిలేశ్వరస్వామి మూలవిరాటును కూడా ప్రతిష్టించినట్లు చరిత్ర చెబుతోంది. ఇక్కడ మట్లిరాజులకాలం నాటి గుప్తనిధులు ఉన్నాయని స్థానికంగా ప్రజలు ప్రచారం చేస్తున్నారు. పది సంవత్సరాల క్రితం కొండపై ప్రతిష్టించిన చారిత్రాక కపిలేశ్వరస్వామి శంఖు, చక్రం రాతివిగ్రహాలను మంగంపేట అగ్రహారంలోని ఓ ఇంటిలో ప్రతిష్టించి ప్రతినిత్యం పూజలు నిర్వహిస్తున్నారు. కొండపై అప్పట్లో ప్రతిష్టించిన రాతివిగ్రహాలతోపాటు ఐదు బురుజులు కూడా బయటపడ్డాయి. దీంతో ఏపీఎండీసీ గనుల విస్తరణకు సంబంధించిన తవ్వకాల్లో చరిత్రకు సంబంధించిన దేవాలయాల ఆనవాళ్లను లేకుండా చేస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ మంగంపేట గనుల విస్తరణలో భాగంగా సమీపంలోని కొండను తొలగించే పనులు ఏపీఎండీసీ నిర్వహిస్తోంది. కొండ కింద తూర్పున 1454 సంవత్సరంలో మహరాజ అచ్యుత్‌రాయులు వారు కట్టా పుట్టాలమ్మ తల్లి మూలవిరాటును ప్రతిష్టించారని ఇప్పటికీ కోరిన కోర్కెలు తీర్చేదేవతగా మహిమగల తల్లిగా గ్రామాల ప్రజలు పూజలు నిర్వహిస్తున్నారు. మండలంలోని ఎర్రగుంటకోట ప్రాంతాన్ని మట్టిరాజులు పాలించే కాలంనుంచి మంగంపేటలో సొరంగమార్గాలు ఉండేవని కట్టా పుట్టాలమ్మ కొండపై గుప్తనిధులు ఉన్నాయని పూర్వీకులు నుంచి చెబుతున్నారు.
సంపదను దాచిపెట్టేందుకు

రహస్యమార్గాలు
ఈ ఏడాది మార్చినెలలో ఏపీఎండీసీ గనుల్లో నిర్వహించిన తవ్వకాల్లో రహస్యమార్గం బయటపడింది. ఈ రహస్యమార్గంలో అప్పట్లో మట్లిరాజు అయిన వెంకటరామరాజు వంశస్థులు తమ సంపదను దాచిపెట్టేందుకు, శత్రువుల బారినుంచి తమ కుటుంబసభ్యులను రహస్యమార్గాల ద్వారా ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు వీలుగా ఏర్పాటు చేసుకున్నట్లు చరిత్ర చెబుతోంది. అయితే మంగంపేట ఏపీఎండీసీ గనుల్లో బయటపడ్డ రహస్యసొరంగ మార్గంగుండా మట్లిరాజుల వంశీయులు ఏర్పాటు చేసుకున్నదిగా భావిస్తున్నారు. ఉపరితల భూభాగం నుంచి 30 నుంచి 40 అడుగుల లోతులో ఈ రహస్యమార్గం ఏర్పాటు చేశారు. వైకోట నుంచి మంగంపేట మీదుగా బుడుగుంటపల్లె వరకు రహస్యమార్గం ఉన్నట్లు సమాచారం. ఈ రహస్యమార్గం ఏపీఎండీసీ అధికారులు పేళుళ్లలో సహజంగా ఏర్పడ్డాయని అప్పటికి అప్పుడే పూడ్చివేశామని చెబుతున్నారు.

చర్చనీయాంశంగా మారిన తవ్వకాలు
 ఏపీఎండీసీ నిర్వహించిన తవ్వకాల్లో బయటపడిన విగ్రహాలు, పురాతన కట్టడాలు, రాతి విగ్రహాలు, గుప్తనిధుల గురించి అంతటా చర్చనీయాంశంగా మారింది. ఏపీఎండీసీ గనుల విస్తరణకు ఆటంకం కలుగుతుందనే ఉద్దేశంతో అధికారులు బయటకు తెలియకుండా మిషన్‌లతో తొలగించి భూస్థాపితం చేస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇక్కడ తవ్వకాల్లో బయటపడ్డ రాతివిగ్రహాలు, రహస్యమార్గాలు ఇక్కడి చరిత్ర, గుడి, గుప్తనిధులుపై పురావస్తు అధికారులు అధ్యయనం చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement
Advertisement