లక్ష్యం.. సమైక్యం | Sakshi
Sakshi News home page

లక్ష్యం.. సమైక్యం

Published Fri, Sep 20 2013 2:43 AM

strike continues for the district. 51, the day on Thursday

సాక్షి, అనంతపురం :  సమైక్యాంధ్ర కోసం జిల్లాలో అలుపెరగని పోరు కొనసాగుతోంది. 51వ రోజైన గురువారం జేఏసీ పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆందోళన కార్యక్రమం విజయవంతమైంది. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు మూతపడ్డాయి. జిల్లా వ్యాప్తంగా మానవహారాలు, ర్యాలీలు, దీక్షలతో సమైక్యవాదులు హోరెత్తించారు. సమైక్యాంధ్ర పరిరక్షణే లక్ష్యంగా నినాదాలు మిన్నంటాయి. అన్ని వర్గాల ప్రజలు ఆందోళనల్లో భాగ స్వాములయ్యారు.
 
 అనంతపురం నగరంలో జేఏసీ నాయకులు, సమైక్యవాదులు ఉదయమే బైక్‌లపై నగరంలో కలియతిరిగారు. తెరిచి ఉన్న కార్యాలయాలను మూసి వేయించారు. జాక్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు రక్తదానం చేశారు. అనంతరం ఉల్లిపాయల దండలు వేసుకుని టీచర్లు నిరసన తెలిపారు. తహశీల్దార్ కార్యాలయం ఎదుట రెవెన్యూ ఉద్యోగులు దీక్షలు చేపట్టారు. పాతూరు పవరాఫీసులో విద్యుత్ కార్మికులు ఆట పాటలతో నిరసన తెలిపారు. నీటిపారుదల, పీఏసీఎస్, పంచాయతీ రాజ్, పశు సంవర్ధక, రెవెన్యూ, వాణిజ్య పన్నులశాఖ, జేఏసీలు, ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాల జేఏసీ ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. ఎస్కేయూలో బంద్ పాటించారు.
 
 ఊరూవాడ ఉద్యమ సెగ
 ధర్మవరంలో జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. జేఏసీ నాయకులు వ్యవసాయ పొలంలో కూలీ పనులు చేసి నిరసన తెలిపారు. తాడిమర్రిలో జేఏసీ నాయకులు ప్రభుత్వ కార్యాలయాలను బంద్ చేయించారు. బత్తలపల్లి, ముదిగుబ్బలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. గుంతకల్లులో జేఏసీ నాయకులు జోలె పట్టి భిక్షాటన చేశారు.
 
 ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్లు, క్లీనర్లు భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ శ్రేణుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. గుత్తిలో నిర్వహించిన విద్యార్థి గర్జనలో వేలాది మంది విద్యార్థులు పాల్గొని సమైక్య నినాదాలతో హోరెత్తించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ.. సర్పంచులు, గ్రామ కార్యదర్శులు తీర్మానం చేసి, దాన్ని ప్రభుత్వానికి కొరియర్ ద్వారా పంపించారు. పామిడిలో సమైక్యవాదుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. విద్యుత్ కార్మికులు జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. హిందూపురంలో విశాలాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కేంధ్ర ప్రభుత్వ పాలన ధృతరాష్ట్ర పాలనను తలపిస్తోందని ఆరోపిస్తూ.. కళ్లకు గంతలు కట్టుకుని ర్యాలీ నిర్వహించారు. ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు రోడ్లపైనే పాఠాలు బోధించారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు, టీచర్లు, సిబ్బంది నగరంలో ర్యాలీ నిర్వహించి పరిగి బస్టాండ్ కూడలిలో మానవహారం నిర్మించారు. చిలమత్తూరులో జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కదిరిలో జేఏసీ నాయకులు ప్రభుత్వ కార్యాలయాలను బంద్ చేయించారు. తలుపులలో వేలాది మంది సమైక్యవాదులతో పొలికేక సభ నిర్వహించారు. కదిరి, తలుపులలో జేఏసీ రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. కళ్యాణదుర్గంలో బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సోనియా గాంధీకి కనువిప్పు కలగాలని కోరుతూ.. జేఏసీ నాయకులు టీ సర్కిల్‌లో హోమం చేశారు.
 
 రిలే దీక్షలు కొనసాగాయి. మడకశిరంలో జేఏసీ నాయకులు ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. అమరాపురంలో ఆటోలు, ట్రాక్టర్లతో ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారు. రొళ్ల, గుడిబండలో ప్రభుత్వ కార్యాలయాలను జేఏసీ నాయకులు బంద్ చేయించారు. పుట్టపర్తిలో సమైక్యవాదులు ర్యాలీ నిర్వహించి ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులను మూసి వేయించారు. సమైక్యవాదుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఓడీచెరువులో సమైక్యాంధ్రపై గ్రామసభలు నిర్వహించారు. నల్లమాడలో రిలే దీక్షలకు ఉపాధ్యాయులు సంఘీభావం తెలిపారు.
 
 పెనుకొండలో జేఏసీ నాయకులు సెల్‌టవర్ ఎక్కి నిరసన తెలిపారు. గోనిపేట గ్రామస్తులు ర్యాలీ నిర్వహించి.. మానవహారం నిర్మించారు. శ్రమదానంతో రోడ్డు బాగు చేసి, నిరసన తెలిపారు. సోమందేపల్లిలో సమైక్యవాదులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. అనంతరం సెల్‌టవర్ ఎక్కి నిరసన తెలిపారు. రొద్దంలో ఉపాధ్యాయులు రోడ్లు ఊడి.. రోడ్లపై విద్యార్థులకు పాఠాలు చెప్పారు. గోరంట్లలో సమైక్యాంధ్ర భవిష్యత్తు కార్యాచరణపై సర్పంచులు, గ్రామ కార్యదర్శులు, వీఆర్‌ఓ, వీఆర్‌ఏలతో తహశీల్దార్లతో సమావేశమయ్యారు. పరిగిలో జేఏసీ ఆధ్వర్యంలో మానవహారం నిర్మించారు. ఉపాధ్యాయులు రోడ్డుపై విద్యా బోధన చేశారు. రాయదుర్గంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.
 
 పైవేటు విద్యా సంస్థల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కణేకల్లులో జేఏసీ నాయకులు ప్రభుత్వ కార్యాలయాలను బంద్ చేయించి నిరసన తెలిపారు. ఉపాధ్యాయలు ర్యాలీ చేపట్టారు. రాప్తాడులో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు మూతపడ్డాయి. ఉపాధ్యాయులు భారీ ర్యాలీ నిర్వహించారు. చెన్నేకొత్తపల్లిలో సమైక్యవాదులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించి నిరసన తెలిపారు. శింగనమలలో జేఏసీ నాయకులు ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయించారు. గార్లదిన్నెలో వైఎస్సార్‌సీపీ నాయకుడు పూజారి మాధవ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. నార్పలలో సమైక్యవాదులు ర్యాలీ చేపట్టారు. తాడిపత్రిలో ఆర్టీసీ జేఏసీ నాయకులు ఒంటికాలిపై నిలబడి నిరసన తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం, మునిసిపల్ ఉద్యోగులు, ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. యాడికిలో హమాలీలు చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఉరవకొండలో సమైక్య నిరసనలు హోరెత్తాయి.
 
 జేఏసీ నాయకులు ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులను బంద్ చేయించారు. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. యువకులు బైక్ ర్యాలీ చేపట్టారు. కూడేరులో సమైక్యవాదులు జలదీక్ష చేపట్టారు. వజ్రకరూరులో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో బ్యాంకులు ముట్టడించారు. కాగా ముదిగుబ్బకు చెందిన డ్రైవర్ మునీంద్ర(28) రాష్ట్ర విభజనపై పత్రికల్లో, టీవీల్లో వస్తున్న వార్తలు చూసి తీవ్ర మనోవేదనకు లోనయ్యాడు. గురువారం ఉదయం గుండె నొప్పి రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించుకుని ఇంటికి వచ్చాక, మరోమారు గుండె పోటు రావడంతో మృతి చెందాడు.
 
 

Advertisement
Advertisement