Sakshi News home page

నిందితుడికి టీడీపీ నేతల అండ

Published Sun, Aug 26 2018 6:47 AM

Student Complaint To YS Jagan on Harassments In - Sakshi

సాక్షి, విశాఖపట్నం : నగరంలోని డాబాగార్డెన్స్‌కు చెందిన విశాఖ ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాల డైరెక్టర్‌ కుమార్‌ గత మంగళవారం తనను లైంగిక వేధింపులకు గురిచేసినట్టు బాధిత విద్యార్ధిని శనివారం రాంబిల్లి మండలం ధారభోగాపురం వద్ద వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి మొర పెట్టుకుంది. అతనికి కళాశాల కరస్పాండెంట్, కృష్ణా కళాశాలలో కాంటాక్ట్‌ లెక్చరర్‌గా పనిచేస్తున్న గ్లోరీ అలియాస్‌ గౌరి సహకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. వీరిపై కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసి తరువాత విద్యార్థి సంఘాలతో ఆందోళనలు నిర్వహించినా ఫలితం లేకుండా పోయిందని చెప్పింది. నిందితులకు మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ అనుచరుల అండదండలు పుష్కలంగా ఉన్నాయని, దీంతో నిందితులను వారిని పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించినా ఇప్పటి వరకు అరెస్ట్‌ చేయడం గాని, ఎఫ్‌ఐఆర్‌ నమోదు కాని చేయలేదని తెలిపింది.

కళాశాలకు ప్రభుత్వ గుర్తింపు కూడా లేకపోవడంతో అక్టోబరులో జరిగే జనరల్‌ నర్సింగ్‌ మిడ్‌వైఫ్‌ పరీక్షలకు హాజరు కావాల్సిన 250 మంది విద్యార్ధుల భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉందని తెలిపింది. నింధితులను కఠినంగా శిక్షించేలా చూడాలని విజ్ఞప్తి చేసింది. అనంతరం వైఎస్సార్‌సీపీ అనకాపల్లి పార్లమెంట్‌ సమన్వయకర్త వరుదు కల్యాణి మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలు, విద్యార్థినులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఇటీవల లైంగిక వేధింపులు కేసులు ఎక్కడికక్కడ నమోదవుతు న్నాయన్నారు. ఒకేషనల్‌ కళాశాల నిందితులపై చర్యలు తీసుకోకపోతే వైఎస్సార్‌సీపీ తరపున ఆందోళన చేస్తామని ఆమె హెచ్చరించారు.

నగర యూత్‌ అధ్యక్షుడు కొండా రాజీవ్‌గాంధీ మాట్లాడుతూ నిందితులపై నిర్భయ, ఫోక్స్‌ చట్టాలను ప్రయోగించి కఠినంగా శిక్షించాలన్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ అండతో నిందితుల వికృత చేష్టలకు అంతులేకుండా పోతుందన్నారు. బాధిత విద్యార్థినికి న్యాయం జరిగేలా రాజ్యసభ సభ్యుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి సోమవారం కలెక్టరును కలిసి ఫిర్యాదు చేస్తారని తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement