పోలీస్ స్టేషన్ లో విద్యార్థి ఆత్మహత్యాయత్నం | Sakshi
Sakshi News home page

పోలీస్ స్టేషన్ లో విద్యార్థి ఆత్మహత్యాయత్నం

Published Sat, Dec 24 2016 2:54 AM

పోలీస్ స్టేషన్ లో విద్యార్థి ఆత్మహత్యాయత్నం - Sakshi

రాయచోటి: స్థానిక అర్బన్  పోలీస్ స్టేషన్ లో ఓ విద్యార్థి శుక్రవారం విషద్రావణం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. బాధితుని తల్లిదండ్రులు, పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సంబేపల్లె మండలం దేవపట్ల గ్రామంలో నివాసం ఉంటూ రాయచోటి బీఎస్‌ఎన్ లో ఉద్యోగిగా పని చేస్తున్న పుల్లయ్య కుమారుడు రవితేజ(20) రాయచోటిలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. ఇటీవల రాయచోటిలో క్రికెట్‌ బెట్టింగ్‌ దారులు డబ్బుల పంపిణీలో గొడవల కారణంగా ఒకరిపై దాడికి పాల్పడగా.. పోలీసులు 307 సెక్షన్  కింద కేసు నమోదు చేశారు.

ఈ కేసుతో సంబంధం ఉందంటూ రవితేజను నాలుగు రోజుల క్రితం స్టేషన్ కు తీసుకొచ్చారు. ఆ రోజు నుంచి అతని తల్లిదండ్రులు స్టేషన్ వద్దకు వెళ్లి తమ కుమారుడిని పంపాలంటూ కోరారు. మరుసటి రోజు రావాలంటూ వారికి పోలీసులు సమాధానం ఇచ్చే వారు. కనీసం తమ కుమారుడిని ఒకసారి చూపాలంటూ కోరినా.. వారికి చూపించలేదు. రూ.15 వేలు లంచం ఇస్తే ఎటువంటి కేసు లేకుండా పంపిస్తామంటూ పోలీస్‌ సిబ్బంది తమకు చెప్పారని వారు ఆరోపిస్తున్నారు.

పోలీసుల వేధింపుల వల్లే అంటున్న బాధితుడి తండ్రి:
ఈ పరిస్థితుల్లో శుక్రవారం ఉదయం రవితేజ విషద్రావణం సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతనిని పోలీసులు గుట్టుగా ఓ ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు కవరేజ్‌కు వెళ్లడంతో అక్కడి నుంచి పోలీసులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై ఆ విద్యార్ధి తండ్రి పుల్లయ్య మాట్లాడుతూ ఆ దాడిలో తన కుమారుడు లేడని, అనవసరంగా ఇరికించారని వాపోయాడు. పోలీసుల వేధింపులకు తాళలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడితే.. తిరిగి తన కుమారుడి పైన మరో కేసు నమోదు చేయడం ఎంత వరకు న్యాయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.

తప్పించుకునేందుకే: ఎస్‌ఐ
ఈ విషయంపై అర్బన్ ఎస్‌ఐ రమేష్‌బాబును వివరణ కోరగా.. హత్యాయత్నం కేసులో రవితేజ 5వ నిందితుడన్నారు. అతనిని విచారణ నిమిత్తం శుక్రవారం ఉదయం తీసుకొచ్చామని, అయితే ఈ కేసు నుంచి తప్పించుకునేందుకే తన వెంట తెచ్చుకొన్న విషద్రావణం తాగాడని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలోనే చికిత్స చేయించామన్నారు. అతను ఆత్యహత్యాయత్నానికి పాల్పడటంపై కూడా 309 సెక్షన్ కింద కేసు నమోదు చేశామని చెప్పారు.

Advertisement
Advertisement