చదువు.. స్టంపింగ్ అవుతుందా! | Sakshi
Sakshi News home page

చదువు.. స్టంపింగ్ అవుతుందా!

Published Sat, Feb 14 2015 2:55 AM

చదువు.. స్టంపింగ్ అవుతుందా!

మార్చి 15న ఇంటర్, 17న డిగ్రీ,26న టెన్త్ పరీక్షలు ప్రారంభం  
ఇప్పటికే ప్రారంభమైన ప్రాక్టికల్ ఎగ్జామ్స్
నేటి నుంచి ప్రపంచకప్ క్రికెట్ పోటీలు
36 రోజులు కొనసాగనున్న క్రీడాపర్వం
పిల్లలకు ఏకాగ్రత కొరవడే అవకాశం

 
‘ఇంగ్లీష్, సైన్స్, మ్యాథ్స్’ వంటి సబ్జెక్టులే బుర్రలో గిర్రున తిరిగే వేళ; ‘ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్’ ప్రశ్నల్ని మళ్లీమళ్లీ వల్లె వేయాల్సిన వేళ.. ‘సూపర్ సిక్సర్.. బిగ్ బౌండరీ.. టెరిఫిక్ షాట్..’ అంటూ ఉర్రూతలూగించే ‘క్రికెట్ పండగ’ వచ్చి పడింది. ఏకంగా 36 రోజులు జరిగే వరల్డ్‌కప్ పోటీల ప్రభావం పరీక్షలపై పడుతుందన్న ఆందోళన పలువురిలో వ్యక్తమవుతోంది.
 
అమలాపురం : క్రికెట్.. క్రికెట్.. క్రికెట్... జిల్లాలో ఇప్పుడు ఎక్కడ విన్నా వరల్డ్ కప్ క్రికెట్ గురించే. అందరూ ఉత్కంఠగా ఎదురుతెన్నులు చూస్తున్నది 14 జట్లు పాల్గొంటున్న ఆ మహా క్రీడా సంగ్రామాన్ని వీక్షించేందుకే. క్రీడాభిమానులు మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్న ప్రపంచకప్ భారతజట్టు కైవసం కావాలనే. మరో వైపు ఈ క్రీడోత్సాహమే విద్యార్థుల తల్లిదండ్రులకు మనశ్శాంతిని కరువు చేస్తోంది. ప్రైవేట్ స్కూళ్లు, కళాశాలల యజమానులను కలవరానికి గురి చేస్తోంది. పరీక్షల సమయంలో వచ్చి పడిన ప్రపంచ కప్ పోటీలు వారందరికీ విషమ పరీక్షగా అనిపిస్తున్నాయి.

ప్రపంచ కప్ క్రికెట్ పోటీలు శనివారం శ్రీలంక -న్యూజిల్యాండ్ మధ్య పోరుతో ఆరంభం కానున్నాయి. వివిధ దశల అనంతరం మార్చి 21న జరిగే ఫైనల్ పోరుతో ఈ క్రీడా సంగ్రామం ముగుస్తుంది. సుమారు 36 రోజుల పాటు జరిగే ప్రపంచకప్ పోటీలను వీక్షించేందుకు అన్నివర్గాల ప్రజలు సిద్ధమవుతున్నారు. జిల్లాలో ఇప్పటికే క్రికెట్ ఫీవర్ మొదలైంది. చిన్నా.. పెద్దా తేడా లేదు.. ముసలీ ముతకా వ్యత్యాసం లేదు. విద్యార్థి.. ఉపాధ్యాయుడనే భేదం లేదు. అందరి చూపూ వరల్డ్ కప్ వైపే. క్రికెట్  అభిమానులకే కాదు.. సామాన్యులకు సైతం  వ్యసనమైంది. వారందరికీ పెద్ద పండగలా ఉండే ప్రపంచ కప్ క్రికెట్ ఇప్పుడు తల్లిదండ్రులకు, విద్యాసంస్థలకు పెద్ద గండంగా అనిపిస్తోంది.

చదువు మాని టీవీలకు అతుక్కుపోతారేమో..

మార్చి 15 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ఆరంభమై 20 రోజులు జరగనున్నాయి. ఇప్పటికే సైన్స్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు ఆరంభమయ్యాయి. భవిష్యత్ ఇంజనీర్లు, వైద్యులు, శాస్త్రవేత్తలకు బలమైన పునాది ఇంటర్మీడియట్ పరీక్షలలో వచ్చే మార్కులు, ఇంటర్ పరీక్షలు పూర్తికాగానే జరిగే ఎంసెట్‌లో వచ్చే ర్యాంకులే. తమ పిల్లల బంగారు భవిష్యత్ కోసం చాలా మంది తల్లిదండ్రులు వారికి ఇంటర్‌తోపాటు ఎంసెట్ లాంగ్‌టెర్మ్ కోచింగ్ ఇప్పిస్తున్నారు.

వీరే కాకుండా కార్పొరేట్ కళాశాలలు, పట్టణాల్లో ఉండే ప్రైవేట్ జూనియర్ కాలేజీల యాజమాన్యాలు, అధ్యాపకులు తమ సంస్థ విద్యార్థులు సాధించే ర్యాంకులపై ఆశలు పెట్టుకున్నారు. ఈ సమయంలో ప్రపంచకప్ క్రికెట్ మొదలు కావడం అటు తల్లిదండ్రులను, ఇటు కళాశాలల యాజమాన్యాలను ఆందోళనకు లోను చేస్తోంది. కాగా మార్చి 17 నుంచి డిగ్రీ పరీక్షలు ఆరంభం కానున్నాయి. వీటికి సంబంధించి కూడా ప్రాక్టికల్స్ ఇప్పటికే ఆరంభమయ్యాయి.

ఇవి నెల రోజుల పాటు సాగనున్నాయి. ఇక మార్చి 26 నుంచి విద్యార్థికి అతికీలకమైన పదవ తరగతి పరీక్షలు మొదలు కానున్నాయి. అప్పటికే ప్రపంచకప్ పోటీలు పూర్తయినా ఏకాగ్రతతో చదువుకోవలసిన సమయంలో క్రికెట్ పోటీలు జరగడం తల్లిదండ్రులను కలవరపాటుకు గురి చేస్తోంది. ‘చదువును వదిలి క్రికెట్‌పై ఆపలేని మక్కువతో పిల్లలు టీవీలకు అతుక్కుపోతే ఎలా?’ అనే ఆందోళన వారిని పట్టి పీడిస్తోంది. క్రికెట్ యావలో పడి చదువును నిర్లక్ష్యం చేస్తారేమో, వారి భవిష్యత్తుకు ఇది ఆటంకం అవుతుందేమో, ఉన్నత విద్యాభ్యాసానికి అవరోధం అవుతుందేమో’ అని వారు భయపడుతున్నారు. ‘మాయదారి క్రికెట్..సరిగ్గా పిల్లలకు కీలకమైన పరీక్షల సమయంలోనే రావాలా?’ అని నిట్టూరుస్తున్నారు.

Advertisement
Advertisement