బెండి తీశారు | Sakshi
Sakshi News home page

బెండి తీశారు

Published Wed, Nov 19 2014 2:32 AM

బెండి తీశారు - Sakshi

 శ్రీకాకుళం క్రైం: శ్రీకాకుళం సబ్ ట్రెజరీ కార్యాలయంలో ఓ అవినీతి చేప ఏసీబీకి చిక్కింది. ట్రెజరీ కార్యాలయంలో సీనియర్ అకౌంటెంట్ బెండి మోహనరావు లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీబీకి చిక్కాడు. వివరాల్లోకి వెళ్తే... విశాఖపట్నంలో నివాసముంటు న్న ఓ ఉద్యోగి శ్రీకాకుళం జిల్లాలో ఇరిగేషన్ శాఖలో పనిచేస్తూ పదవీ విరమణ పొందారు. అయితే అతనికి రావల్సిన గ్రాట్యుటీ సొమ్ము కోసం తను పని చేసిన ఇరిగేషన్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. అక్కడ్నుంచి ఆ ఫైల్ జిల్లా ట్రెజరీకి వెళ్లగా అక్కడ్నుంచి శ్రీకాకుళం సబ్ ట్రెజరీకి వచ్చింది. ఇక్కడ నుంచి ఫైల్ మంజూరై బదిలీ చేయటానికి సీనియర్ అకౌంటెంట్ మోహనరావు లంచం అడిగాడు. ఆ విశ్రాంతి ఉద్యోగికి సుమారు ఐదు నుంచి ఆరు లక్షల వరకు గ్రాట్యుటీ సొమ్ము అందాల్సి ఉంది. వచ్చే సొమ్ములో పది శాతం తనకు లంచంగా ఇవ్వాలని, అలా అయితేనే ఫైల్ బదిలీ జరుగుతుందని తేల్చిచెప్పాడు.
 
 అంటే రూ.50 వేల నుంచి 60 వేలు వరకు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అంత ఎక్కువ మొత్తం ఇచ్చుకోలేనని ఆ విశ్రాంతి ఉద్యోగి చెప్పగా ముందు రూ.పది వేలు ఇవ్వు తరువాత మాట్లాడుకుందామని మోహనరావు చెప్పాడు. దీంతో చేసేది లేక ఆ విశ్రాంతి ఉద్యోగి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి రసాయనాలు పూసిన రూ.500 నోట్లు పది వేల రూపాయలు ఆ విశ్రాంతి ఉద్యోగికిచ్చి పంపించారు. బెండి.. ఎంచక్కా ఆ నోట్లను తీసుకుని లెక్కపెట్టి జేబులో పెట్టుకున్నాడు. వెంటనే ఏసీబీ అధికారులు సబ్ ట్రెజరీ కార్యాలయంలోకి దూసుకెళ్లి మోహనరావును అదుపులోకి తీసుకున్నారు.
 
 దాడుల్లో ఏసీబీ డీఎస్పీ కె.రంగరాజు, విజయనగరం సీఐలు లకో్ష్మజీ, రమేష్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఓ విశ్రాంతి ఉద్యోగి గ్రాడ్యూటీకి సంబంధించిన ఫైల్‌ను మంజూరు చేసి జారీ చేయటానికి సబ్ ట్రెజరీలో సీనియర్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న మోహనరావు రూ.పది వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడన్నారు. విశ్రాంతి ఉద్యోగి తన వివరాలను గోప్యంగా ఉంచాలని చెప్పడంతో బయటకు చెప్పలేకపోతున్నామని వివరించారు. ఏ ప్రభుత్వ ఉద్యోగైనా అవినీతికి పాల్పడితే దాడులు తప్పవని హెచ్చరించారు.
 

Advertisement
Advertisement