చెరకు రైతులను ఆదుకోవాలి | Sakshi
Sakshi News home page

చెరకు రైతులను ఆదుకోవాలి

Published Fri, Nov 16 2018 6:57 AM

Sugar Farmers Meet YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

విజయనగరం , ప్రజా సంకల్పయాత్ర బృందం: పార్వతీపురం నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన చెరకు రైతులు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారని వారిని ఆదుకోవాలని పలువురు ప్రజాప్రతినిధులు, రైతులు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా సీతానగరం మండలంలోని చినరాయుడుపేట వద్ద పాదయాత్ర  చేపడుతున్న జగన్‌మోహన్‌రెడ్డిని జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌ వాకాడ నాగేశ్వరరావు, ఆర్‌వీ పార్థసారథి, బలగ శ్రీరాములు, తదితరులు గురువారం ఉదయం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,  రైతులకు ఎన్‌సీఎస్‌ చక్కెర పరిశ్రమ రూ.11 కోట్లకు పైగా బకాయి పడిందన్నారు. ఆ డబ్బుల కోసం రైతులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారని తెలిపారు.

నియోజకవర్గ పరిధిలో 3.5 లక్షల టన్నుల చెరకు గానుగు ఆడేందుకు సిద్ధంగా ఉందని.. అయితే చెరకును ఎన్‌సీఎస్‌ పరిశ్రమకు ఇవ్వాలా..? వద్దా..? అని రైతులు సందిగ్ధంలో ఉన్నారని జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. రైతులు కష్టాల్లో ఉంటే ఆదుకోవాల్సిన మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు కనీసం పట్టించుకోవడం లేదన్నారు. పరిశ్రమకు మేలు చేసే విధంగా ఆయన చర్యలు ఉన్నాయే తప్ప రైతులను ఆదుకునే విధంగా లేవని ఆరోపించారు.  వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే చెరకు రైతులను ఆదుకోవాలని కోరారు. అంతేకాకుండా జంఝావతి సాగునీటి ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందడం లేదని.. తోటపల్లి సాగునీటి ప్రాజెక్టు బ్రాంచి కెనాల్‌ పనులు పూర్తవ్వలేదని ప్రతిపక్ష నేత దృష్టికి తీసుకువచ్చారు. సాగునీటి ప్రాజెక్ట్‌లను పూర్తి చేసి ఆయకట్టుకు నీరు అందించాలని కోరారు. సమస్యలనీ సావదానంగా విన్న జగన్‌మోహన్‌రెడ్డి సానుకూలంగా స్పందించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement