గాలిలో ‘ఆత్మ’హత్య కేసు! | Sakshi
Sakshi News home page

గాలిలో ‘ఆత్మ’హత్య కేసు!

Published Mon, Jan 6 2014 12:17 AM

suicide case from ongoing investigation

 నరసరావుపేట టౌన్, న్యూస్‌లైన్: ఆర్నెల్లుగా ఆత్మహత్య కేసు గాలిలో  చక్కర్లు కొడుతోంది.. రెండు పోలీసు శాఖల మధ్య సమన్వయలోపం కారణంగా ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి కుటుంబానికి న్యాయం జరగకపోగా అన్యాయం జరిగే ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఎప్పటికప్పుడు అధికారులు విచారణ పేరిట పిలిపించడం, తూతూమంత్రంగా కేసు వ్యవహారాన్ని నడిపించడం, ఆ తరువాత మర్చిపోవడం చేస్తున్నారు. దీంతో మృతుడి ఆత్మ శాంతించకపోగా అతని కుటుంబసభ్యులకు తీవ్ర మనోవేదన మిగులుతోంది. వివరాలిలా ఉన్నాయి... స్థానిక చంద్రబాబునాయుడు కాలనీకి చెందిన వజ్రగిరి మోజేష్ (25)కు ప్రకాశం జిల్లా దర్శి మండలం చందలూరు గ్రామానికి చెందిన విమలారాణితో 2011లో వివాహమైంది.

 భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో ఏడాది నుంచి విమలారాణి పుట్టింటిలో ఉంటోంది. గత జూలై 23న మోజేష్ చిలకలూరిపేట రోడ్డులోని క్రైస్తవ శ్మశాన వాటిక వద్ద గల రైలు పట్టాలపై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు భార్య విమలారాణి, ఆమె తరపు బంధువుల వేధింపులే కారణమంటూ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. సూసైడ్ నోట్ ఆధారంగా,  మృతుడి తండ్రి  జయరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆత్మహత్య కేసుగా రైల్వే ఎస్‌ఐ సత్యనారాయణ నమోదు చేశారు. అయితే నిందితులను పట్టుకునేందుకు రైల్వే పోలీస్‌స్టేషన్‌లో సిబ్బంది కొరత, స్టేషన్‌లో నెలకొన్న సాంకేతిక లోపాల కారణంగా మోజేష్ ఆత్మహత్య కేసును రైల్వే పోలీసుశాఖ ఉన్నతాధికారులు రూరల్ జిల్లా ఎస్పీ జె.సత్యనారాయణకు బదిలీచేశారు. అక్కడ రెండు నెలల పాటు కేసు ఫైలు పురోగతి లేకుండా ఉండిపోవడంతో మృతుడి తండ్రి జయరావు రూరల్ జిల్లా ఎస్పీని కలిసి న్యాయం చేయాలని వేడుకున్నాడు.

స్పందించిన ఆయన వెంటనే సంఘటన జరిగిన ప్రాంతం నరసరావుపేట  టూ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉండడంతో ఈ కేసును ఆ ఠాణాకు అక్టోబర్‌లో బదిలీచేశారు. టూ టౌన్ పోలీసు అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి పలుమార్లు మృతుడి బంధువులను విచారణ జరిపారు.  నేటివరకు  కేసు పురోగతి లేకపోవడంతో మృతుని బంధువులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. చిన్న చిన్న కేసుల్లో నిందితులను పట్టుకునేందుకు నానా హైరానా చేసే పోలీసులు ఆత్మహత్య కేసులో నిందితులను పట్టుకోవడంలో నిర్లక్ష్యం వహించడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికైనా జిల్లా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి నిందితులను అరెస్టు చేసి న్యాయం చేయాలని మృతుని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

Advertisement
Advertisement