సుజల స్రవంతికి సన్నాహాలు | Sakshi
Sakshi News home page

సుజల స్రవంతికి సన్నాహాలు

Published Tue, Sep 2 2014 1:02 AM

Sujala mainstream preparations

  •      226 గ్రామాల్లో ఏర్పాటుకు చర్యలు
  •      రూ.2కే 20 లీటర్లు తాగునీరు
  •      యూనిట్ ధర రూ.4.5 నుంచి రూ.10 లక్షలు
  • విశాఖ రూరల్ : ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం ద్వారా రక్షిత తాగునీటి సరఫరాకు జిల్లా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. తొలి దశలో 226 గ్రామాల్లో దీని అమలుకు చర్యలు చేపట్టారు. ఈ యూనిట్ల ఏర్పాటుకు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలు ముందుకు వస్తున్నాయి. అక్టోబర్ 2వ తేదీ నుంచి ఈ పథకాన్ని ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ.. అంతకు ముందే పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని గ్రామాల్లో రూ.2కే 20 లీటర్లు తాగునీటిని సరఫరా చేయాలని అధికారులు యోచిస్తున్నారు.

    ఎన్టీఆర్ సుజల స్రవంతి పేరుతో అందరికీ రక్షిత తాగునీటిని సరఫరా చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే దీనికి నిధులు ఇవ్వలేదు. ఈ బాధ్యతలను కార్పొరేట్, స్వచ్ఛంద సంస్థలకు అప్పగించాలని నిర్ణయించి ఆ దిశగా ఏర్పాట్లు చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. దీంతో ఎక్కువగా నీటి ఎద్దడిని ఎదుర్కొనే గ్రామాలను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
     
    226 గ్రామాల్లో పథకం అమలు
     
    జిల్లాలో 376 గ్రామాల్లో తాగునీటి సరఫరా యూనిట్లు ఏర్పాటుకు అధికారులు నిర్ణయిం చారు. ఈ యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వ పరిశ్రమలు, కార్పొరేట్ కంపెనీలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ ఇటీవల కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పాటు కొన్ని ప్రైవేటు కంపెనీల ప్రతినిధులతో ప్రత్యే క సమావేశం నిర్వహించారు.

    ఈ పథకం తీరుతెన్నులను వివరించి సామాజిక బాధ్యతతో ఏర్పాటు చేయాలని సూచించారు. 156 పరిశ్రమలు, సంస్థలు ఇందుకు ముందుకు వచ్చాయి. జిల్లాలో తొలి దశలో 226 గ్రామా ల్లో ఈ పథకాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏజెన్సీలో 50 గ్రామాల్లో ఈ యూనిట్లు ఏర్పాటు చేసి రూ.2కే 20 లీటర్ల తాగునీటి సరఫరా చేయనున్నారు.
     
    యూనిట్లకు రాయితీలు
     
    సరఫరా సామర్థ్యం మేరకు యూనిట్ ధర రూ.4.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉంటుంది. ఈ యూనిట్ ఏర్పాటుకు అయ్యే ఖర్చుతో పాటు నిర్వహణ బాధ్యత ఆయా కంపెనీలదే. అయితే కొన్ని చోట్ల నిర్వహణను పంచాయతీలకు అప్పగించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ యూనిట్ల నిర్వహణకు ప్రధాన ఖర్చు విద్యుత్. ఈ విద్యుత్ వినియోగ ఖర్చులో 50 శాతం ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వనుంది. అలాగే ఈ యూనిట్లను ప్రభుత్వ కార్యాలయాలు, భవనాల్లో ఏర్పాటు చేయాలని అధికారులు ఆలోచన చేస్తున్నారు.

    ప్రధానంగా పాఠశాలల్లోను, వసతి గృహాల్లో వీటిని ఏర్పాటు చేయడం వల్ల ఆయా పాఠశాలకు మంచి నీటి సరఫరా ఇబ్బందులు ఉండవని కలెక్టర్ భావిస్తున్నారు. త్వరలోనే గ్రామాల్లో యూనిట్ల ఏర్పాటుకు స్థలాలను ఖరారు చేసి అక్టోబర్ రెండో తేదీ లోగా పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని గ్రామాల్లో ఈ పథకాన్ని ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు.
     

Advertisement
Advertisement