నేటి నుంచి సమ్మర్‌ కోచింగ్‌ క్యాంపులు | Sakshi
Sakshi News home page

నేటి నుంచి సమ్మర్‌ కోచింగ్‌ క్యాంపులు

Published Wed, Apr 25 2018 12:35 PM

Summer coaching camps from today ∙ - Sakshi

శ్రీకాకుళం న్యూకాలనీ : వేసవి క్రీడా శిక్షణా శిబిరాల (సమ్మర్‌ కోచింగ్‌ క్యాంప్‌)కు వేళయింది. బుధవారం నుంచి జిల్లా వ్యాప్తంగా 50 కేంద్రాల వేదికలుగా శిక్షణా శిబిరాలను ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. ఏటా ఏప్రిల్‌ నెలాఖరు నుంచి మే నెలాఖరు వరకు 30 రోజులపాటు సమ్మర్‌ కోచింగ్‌ క్యాంప్‌ల పేరిట క్రీడాకారులు, ఔత్సాహిక విద్యార్థులకు శిక్షణ అందిస్తున్న విషయం తెలిసిందే.

సాక్షి ముందుగా చెప్పినట్టుగానే ఈ ఏడాది 50 కేంద్రాల్లో శిక్షణకు చర్యలు తీసుకున్నారు. అయితే ప్రతికూల వాతావరణంతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో అధికారులు, శిక్షకులు ఆందోళన చెందుతున్నారు.

14 ఏళ్లలోపు వారికే చాన్స్‌..

ఈ క్యాంప్‌లకు హాజరయ్యే క్రీడాకారులు, విద్యార్థులు 14 ఏళ్లు లోపు వారికే అధికారులు అవకాశం కల్పించడంపై క్రీడాసంఘాల ప్రతినిధులు మండిపడుతున్నారు. కనీసం 17 ఏళ్ల వరకు అవకాశం కల్పించాల్సిందని పీఈటీ సంఘ ప్రతినిధులు డిమాండ్‌ చేస్తున్నారు. ఒక్కొక్క కేంద్రానికి రూ.10 వేల చొప్పున కేటాయించనున్నారు. ఈ నిధులతో క్యాంప్‌ నిర్వహణకు అవసరమయ్యే క్రీడా పరికరాలు, సామగ్రి, మౌలిక సదుపాయాలు, తాగునీరు, శిక్షకునికి గౌరవ వేతనం చెల్లించనున్నారు. పీడీ, పీఈటీలు, సీనియర్‌ క్రీడాకారులను కోచ్‌గా నియమించారు. 

వాలీబాల్‌కే పెద్దపీట..

ఈ ఏడాది క్రీడాధికారులు దాదాపుగా అన్ని క్రీడాంశాలకు అవకాశం కల్పించారు. అత్యధికంగా ఆదరణ కలిగిన వాలీబాల్, ఇతర గ్రామీణ క్రీడలకు పెద్దపీట వేశారు. వాలీబాల్‌ 6, అథ్లెటిక్స్‌ 5, కబడ్డీ 4, హ్యాండ్‌బాల్‌ 4, ఖోఖో 3, షటిల్‌ బ్యాడ్మింటన్‌ 3, తైక్వాండో 3, సాఫ్ట్‌బాల్‌ 3, వెయిట్‌లిఫ్టింగ్‌ 2, ఫుట్‌బాల్‌ 2, హాకీ 2 కేటాయించారు. బాస్కెట్‌బాల్, బాక్సింగ్, సప్‌కతక్ర, ఆర్చరీ, బాల్‌ బ్యాడ్మింటన్, టేబుల్‌ టెన్నిస్, టెన్నీకాయిట్, లాన్‌టెన్నిస్, చెస్, స్కేటింగ్, జూడో, ఉషూ, రైఫిల్‌షూటింగ్‌ క్రీడాంశాలకు చెరో శిక్షణా శిబిరాన్ని కేటాయించారు. 

సక్సెస్‌ చేయాలని పిలుపు

వేసవి క్రీడా శిక్షణా శిబిరాలను విజయవంతం చేయాలని సెర్ఫ్‌ సీఈఓ బి.ప్రసాదరావు, చీఫ్‌ కోచ్‌ బి.శ్రీనివాస్‌కుమార్‌ పిలుపునిస్తున్నారు. శిక్షకులు తమ  బాధ్యతగా గుర్తించి క్రీడాకారులను ఉన్నతంగా తీర్చిదిద్దాలని, సమయపాలన పాటించాలని సూచిస్తున్నారు. వివరాలకు 98660 98642 నంబర్‌ను సంప్రదించాలని చెబుతున్నారు.      

Advertisement
Advertisement