తిరుపతి @ 40.6 | Sakshi
Sakshi News home page

తిరుపతి @ 40.6

Published Fri, Mar 8 2019 12:54 PM

Summer Temperature Hikes in Tirupati - Sakshi

తిరుపతి తుడా: భానుడు భగభగలాడుతున్నాడు. నాలుగు రోజులుగా సూర్యడు సెగలు కక్కుతుండడంతో జిల్లా నిప్పులు కొలిమిలా మారింది.  తిరుపతిలో గురువారం 40.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో గురువారం నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఇదే కావడం గమనార్హం. మార్చి మొదటి వారంలోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటడంతో జనం ఆందోళనకు గురవుతున్నారు. ఏప్రిల్‌తో పాటు అసలైన మేలో భానుడి ప్రతాపం ఏ స్థాయిలో ఉంటుందో తలుచుకుని భయపడుతున్నారు. ఎండ వేడిమికి,  వేడి గాలులు కూడా తోడుకావడంతో జిల్లా ప్రజలు బయటకు అడుగుపెట్టలేని పరిస్థితి.  ఇదిలా ఉంటే సాయంత్రం 6 నుంచి రాత్రి 12 గంటల వరకు ఉక్కపోత అదే స్థాయిలో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

విద్యార్థుల అగచాట్లు
పరీక్షల కాలం కావడంతో విద్యార్థులు వేసవికి తల్లడిల్లిపోతున్నారు. ఇంటర్‌ విద్యార్థుల మండుటెండలోనే రాకపోకలు సాగిస్తున్నారు.  పది పరీక్షల ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. విద్యార్థులు రాకపోకలు సాగించే ఉదయం సాయంత్రం వేళల్లో ఎండ ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. ఎండ తీవ్రత కారణంగా మధ్యాహ్నవేళల్లో వ్యాపారాలు పూర్తిగా పడిపోయాయి. మధ్యాహ్నం ఎండ ప్రభావం ఎక్కువగా ఉండటంతో రోడ్లు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి.

మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు...
ప్రస్తుత పరిస్థితులు గమనిస్తుంటే వాతావరణంలో భారీగా మార్పులు చోటుచేసుకుని రాబోయే రోజుల్లో ఎండ తీవ్రత మరింతగా పెరిగే అవకాశముంది. మార్చి చివరి నుంచి మే నెల వరకు భానుడు తన విశ్వరూపాన్ని చూపించే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement