సూపర్ బాస్ | Sakshi
Sakshi News home page

సూపర్ బాస్

Published Tue, Sep 8 2015 11:39 PM

సూపర్ బాస్ - Sakshi

పోలీస్ కమిషనరేట్‌లో ఆయనో మధ్యస్థాయి ఉద్యోగి... కానీ అక్కడ ఆయనే ‘సూపర్ పవర్’. ఉన్నతాధికారికి కళ్లూ చెవులూ అంతా ఆయనే. కీలక నిర్ణయాలన్నింటినీ ప్రభావితం చేస్తున్నారు. ఎంతగా అంటే కమిషనరేట్ పరిధిలోని ఇటీవల బదిలీల్లో ఆయనే చక్రం తిప్పారు. ప్రజాప్రతినిధుల మాట కూడా చెల్లుబాటు కాని సందర్భంగా ఆయన మాత్రం అనుకున్నది  చేయగలిగారు. తన వర్గీయులైన ఏడుగురికి  కీలక పోస్టింగులు దక్కేలా చేయగలిగారు.
 
- కమిషనరేట్‌లో చక్రం తిప్పుతున్న ఉద్యోగి
- ఆయన చెప్పిందే అక్కడ వేదం
- తన ‘వర్గీయులకే’ కీలక పోస్టింగులు
- విస్తుపోతున్న పోలీసు అధికారులు


కమిషనరేట్‌లో ఓ మధ్యస్థాయి ఉద్యోగి సర్వం తానై చక్రం తిప్పుతున్నారు. ప్రజాప్రతినిధుల ద్వారా కాని పనులు కూడా ఆయనే చిటికెలో చేయించేస్తుండటం గమనార్హం. ఎవరి మాట వినరు అని పేరుపడ్డ ఉన్నతాధికారి కూడా ఆయన ఎంత చెబితే అంత అన్నట్లుగా వ్యవహరిస్తుండటం గమనార్హం.  ఆయనే ‘సరైన ఛానల్’ అనేది నిర్ధారణ అయిపోయింది.

దాంతో ఏకంగా ఆయన తనకు సన్నిహితులైన అధికారులతో ఓ ‘వర్గాన్ని’ కూడగట్టారు. అందుకు హైదరాబాద్‌స్థాయిలోని ఇద్దరు ప్రముఖ రిటైర్డ్ పోలీస్ ఉన్నతాధికారుల పేర్లను అనుకూలంగా మలచుకుంటున్నారు. తమ ప్రాంతానికి చెందిన ఆ ఇద్దరు ఉన్నతాధికారులకు హైదరాబాద్‌స్థాయిలో తిరుగులేని పరపతి ఉంది. తద్వారా తమ ‘వర్గానికి’ నగరంలోని పోలీస్ ఉన్నతాధికారి ఆశీస్సులు లభించేలా చేయగలిగారు. తాజా బదిలీల్లో  తన ‘వర్గ’ అధికారులకు కీలక పోస్టింగులు దక్కేలా చక్రం తిప్పారు. తార్కాణాలివిగో...

- ఇటీవల రేంజ్ నుంచి వచ్చిన ఓ అధికారిని శివారులోని  కేంద్ర పరిశ్రమలు ఉన్న ప్రాంతానికి బదిలీ చేశారు. ఆయన అక్కడ రెండునెలలు చేశారో లేదో ఆయనకు మరింత ముఖ్యమైన పోలీస్ స్టేషన్‌కు మార్చారు. నగరం మధ్యలోని అత్యంత  కీలకమైన పోలీస్ స్టేషన్‌లో పోస్గింగిచ్చారు.
- అంతవరకు ఆ కీలకమైన పోలీస్ స్టేషన్‌లో ఉన్న అధికారి కూడా ‘సూపర్ పవర్’వర్గీయుడే. అందుకే ఆయనకు కూడా ఇబ్బంది లేకుండా దక్షిణ నియోజకవర్గ పరిధిలో పోస్టింగు ఇప్పించారు.
- సూపర్ పవర్ వర్గీయుడైన ఓ అధికారి తూర్పు నియోకజవర్గంలోని కీలక విభాగంలోనే దీర్ఘకాలంగా కొనసాగుతున్నారు. ఇటీవల పలు ముఖ్యమైన దాడులు, కేసులు ఈ విభాగమే పర్యవేక్షిస్తోంది. అందుకే ఆ అధికారిని బదిలీ చేయకుండా అదే స్థానంలో కొనసాగేలా చక్రం తిప్పారు.
- అదేవర్గానికి చెందిన మరో సన్నిహిత అధికారిని దక్షిణ నియోజకవర్గంలోని పారిశ్రామిక వ్యవహారాలను పర్యవేక్షించే కీలక పోస్టింగు ఇచ్చేలా చేశారు.
- ‘సూపర్ పవర్’కు సన్నిహితుడైన నాలుగో పట్టణ పరిధిలోని ఓ అధికారిని పశ్చిమ నియోజకవర్గంలో అత్యంత ముఖ్యమైన స్థానానికి బదిలీ చేశారు.
- తమ సన్నిహితుడైన మరో అధికారికి ఏకంగా విజయనగరం జిల్లా నుంచి నగర పరిధికి బదిలీ చేయించారు. ఆయనకు భీమలి నియోజకవర్గ పరిధిలోని గ్రామీణ ప్రాంతంలో పోస్టింగు ఇప్పించారు.  ఆ ‘సూపర్ పవర్ ’ సత్తాకు కమిషనరేట్ పరిధిలోని పోలీసు అధికారులు అందరూ విస్మయం చెందుతున్నారు.

Advertisement
Advertisement