సూపర్‌వైజర్ల రాత పరీక్ష: 305 పోస్టులకు 3887 మంది పోటీ | Sakshi
Sakshi News home page

సూపర్‌వైజర్ల రాత పరీక్ష: 305 పోస్టులకు 3887 మంది పోటీ

Published Sun, Oct 27 2013 6:37 AM

Supervisors Grade-2 post written exam today

ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఒంగోలులో ఆదివారం జరగనున్న ఐసీడీఎస్ గ్రేడ్-2 సూపర్‌వైజర్ పోస్టుల రాత పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాల పరిధిలో 305 పోస్టులకు గాను 3887 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రకాశం నుంచి 1214 మంది, గుంటూరు నుంచి 1891, నెల్లూరు నుంచి 782 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఏడు పరీక్ష కేంద్రాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరగనుంది. అంగన్‌వాడీ కార్యకర్తలు, కాంట్రాక్టు సూపర్‌వైజర్లు, గ్రేడ్-1, గ్రేడ్-2 అంగన్‌వాడీ శిక్షణ  కేంద్రాల్లో పనిచేసే కో ఆర్డినేటర్లు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
 
 రూ.3 నుంచి రూ.5 లక్షలు?
 రెగ్యులర్ సూపర్‌వైజర్ పోస్టులు ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉండడం.. ఇప్పుడు ఎంపిక ప్రక్రియ ప్రారంభం కావడంతో దళారులు రంగంలోకి దిగారు. ఒక్కో పోస్టుకు మూడు నుంచి ఐదు లక్షల రూపాయల వరకు బేరసారాలు సాగిస్తున్నట్లు తెలిసింది. వారి బుట్టలో పడిన కొంతమంది ముందుగా అడ్వాన్స్.. పోస్టింగ్ లభించాక మిగిలిన సొమ్ము ఇచ్చేందుకు అంగీకరిస్తున్నారట. కాంట్రాక్ట్ సూపర్ వైజర్లనైతే ఇంకా ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు. ఇక అధికారులను ప్రసన్నం చేసుకొనే పనిలో మరికొందరు బిజీగా ఉన్నారు.
 
 దళారుల మాటలు నమ్మొద్దు: ఆర్‌డీడీ
 సూపర్‌వైజర్ పోస్టులు ఇప్పిస్తామంటూ ప్రలోభాలు పెట్టేవారి మాటలను నమ్మి మోసపోవద్దని మహిళా శిశుసంక్షేమశాఖ రీజనల్ డిప్యూటీ డెరైక్టర్ కామేశ్వరమ్మ హెచ్చరించారు. ప్రతిభ, రోస్టర్ ఆధారంగా ఎంపిక జరుగుతుందన్నారు.
 
 పకడ్బందీగా నిర్వహించండి
 ఐసీడీఎస్ గ్రేడ్-2 సూపర్‌వైజర్ పోస్టుల రాత పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి జీ గంగాధర్‌గౌడ్ ఆదేశించారు. రాత పరీక్ష కోసం నియమించిన స్పెషల్ ఆఫీసర్లతో శనివారం సాయంత్రం స్థానిక సీపీఓ కార్యాలయ సమావేశపు హాలులో సమీక్షించారు. ప్రతి పరీక్ష కేంద్రానికి ఒక స్పెషల్ ఆఫీసర్‌తోపాటు ఇద్దరు డిప్యూటీ తహశీల్దార్లు, పంచాయతీరాజ్ ఏఈలను నియమించినట్లు తెలిపారు. అలాగే ఇద్దరు డిప్యూటీ తహశీల్దార్లను రూట్ ఆఫీసర్లుగా, మరో ఇద్దరు ఏఈలను ఫ్లయింగ్ స్క్వాడ్ కోసం కేటాయించామన్నారు. ఉదయం ఆరు గంటలకల్లా ట్రెజరీకి వెళ్లి ప్రశ్న, సమాధాన పత్రాలను తీసుకువెళ్లాలని చెప్పారు. పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని.. ఎక్కడైనా సమస్య తలెత్తితే వెంటనే సమాచారం అందించాలని కోరారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement