ధాన్యానికి ధరాఘాతం | Sakshi
Sakshi News home page

ధాన్యానికి ధరాఘాతం

Published Fri, Mar 23 2018 11:48 AM

Support prices Down Fall In Market - Sakshi

నెల్లూరు(సెంట్రల్‌): రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, రైతులకు అన్యాయం జరగకుండా చూస్తానని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చేసిన ప్రకటనలు నీటిమూటలు గానే మిగిలిపోతున్నాయి. పండించిన ధాన్యానికి మద్దతు ధర లభించకపోగా ధరలు రోజురోజుకూ దిగజారుతున్నాయిని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ఓవైపు కల్లాల్లో ఉన్న ధాన్యం ఎప్పుడు విక్రయించకుంటామోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.

ధరలు పతనం  
జిల్లాలో ధాన్యం ధరలు రోజురోజుకూ పతనమవుతున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం పుట్టి ధాన్యం ఏగ్రేడ్‌ రూ.13,515 వేలు, సాధారణ రకం రూ.13,175 కాగా దళారులు ధరలు తగ్గించి కొనుగోలు చేస్తూ రైతులను దోచుకుంటున్నారు. అలాగే తేమశాతం పేరుతో బస్తాకు(75 కిలోలు) రెండు నుంచి మూడు కిలోలు అదనంగా తీసుకుంటూ పుట్టి ధాన్యం రూ.12 వేల నుంచి రూ.11 వేల లోపు కొనుగోలు చేస్తున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో ధర మరింత తగ్గే అవకాశాలు ఉంటాయని, పుకార్లు సృష్టిస్తూ రైతులను ఆందోళనకు గురి చేస్తున్నారు. రైతులు ఏం చేయాలో అర్థంకాని స్థితిలో ఉంటున్నారు.

1.70 లక్షల మెట్రిక్‌ టన్నులు దిగుబడి వస్తుందని అంచనా
జిల్లాలో ఈ ఏడాది 2 లక్షల హెక్టార్లలో వరిసాగు చేశారు. మొత్తం 1.70 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కొంతవరకు కోతలు పూర్తయి దాదాపుగా 80 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చినట్లు అంచనా. ఇప్పటివరకు కేవలం 40 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం మాత్రమే విక్రయాలు చేసినట్లు తెలుస్తోంది. రైతులు మిగిలిన ధాన్యాన్ని విక్రయించకుండా చాలా వరకు కల్లాల్లో, ఇళ్లలో నిల్వ ఉంచి మద్దతు ధర రాకపోతుందా అని ఎదురుచూస్తున్నారు.

తెలంగాణను బూచిగా చూపుతూ..
మిల్లర్లు, దళారులు వారి ఆదాయాన్ని చూసుకుంటున్నారే తప్ప రైతుల కష్టాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏటా పురుగుమందులు, ఎరువులు, ఇతరత్రా సాగు ఖర్చులు పెరిగిపోతున్నాయి. కానీ గిట్టుబాటు ధర మాత్రం రైతులకు అందడం లేదు. పలువురు మిల్లర్లు, దళారులు మాత్రం పక్క రాష్ట్రం తెలంగాణలో ఈ ఏడాది ఎక్కువగా ధాన్యం పండిందని, అందువల్ల గిట్టుబాటు కావడం లేదనే పుకారును సృష్టిస్తున్నారు. దీంతో ధాన్యానికి మద్దతు ధర లభించక రైతులు నష్టపోతున్నారు. కొందరు మాత్రం దళారులు ధరలు తగ్గించి కొనుగోలు చేస్తున్నా విధిలేని పరిస్థితుల్లో విక్రయించి నష్టపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ధాన్యానికి మద్దతు ధర కల్పించి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.   

Advertisement

తప్పక చదవండి

Advertisement