అందరికీ న్యాయం కోసం.. | Sakshi
Sakshi News home page

అందరికీ న్యాయం కోసం..

Published Sat, Nov 8 2014 3:16 AM

అందరికీ న్యాయం కోసం..

న్యాయానికి గొప్ప, పేద అన్న తేడా లేదు. ఏ పౌరుడూ ఆర్థిక, మరే ఇతర కారణాల వల్ల న్యాయం పొందే అవకాశాలు కోల్పోరాదన్న ఉద్దేశంతో.. పౌరులకు ఉచిత న్యాయ సహాయం అందించాలని భారత అత్యున్నత న్యాయస్థానం భావించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక చట్టం రూపొందించింది. దీని ప్రకారం సుప్రీంకోర్టు 1987 నవంబర్ 9న న్యాయసేవా సంస్థను ఏర్పాటు చేసింది. ఆ సంస్థ దినోత్సవం ఆదివారం జరుగుతున్న సందర్భంగా ప్రత్యేక కథనం.
 
రేపు న్యాయ సేవాధికార సంస్థ దినోత్సవం
 
కాకినాడ లీగల్ : ప్రజల ముంగిట సత్వర న్యాయం అందించేందుకు న్యాయ సేవాధికార సంస్థ ద్వారా లోక్ అదాలత్‌లు నిర్వహిస్తున్నా రు. అలాగే, ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించేందుకు న్యా య విజ్ఞాన సదస్సులు నిర్వహిస్తున్నారు. కోర్టుల్లో ఏళ్ల తరబడి అధిక సంఖ్యలో కేసులు పెండింగ్‌లో ఉండిపోతూండడంతో కక్షిదారులకు సకాలంలో న్యాయం అందని పరిస్థితి. ఈ కేసుల తక్ష ణ పరిష్కారం కోసం న్యాయ సేవాధికార సంస్థ పని చేస్తుంది.
 
ఉచిత న్యాయ సహాయానికి ఎవరు అర్హులంటే..

ఎస్సీ, ఎస్టీలు; మానవ అక్రమ రవాణా బాధితులు, భిక్షాటన చేసేవారు; మహిళలు, పిల్లలు, మతిస్థిమితం లేనివారు, వికలాంగులు; సామూహిక విపత్తు, హింసాకాండ, కుల వైషమ్యాలు, అతివృష్టి, అనావృష్టి, భూకంపాలు, పారిశ్రామిక విపత్తులవంటివాటిల్లో చిక్కుకున్నవారు; పారిశ్రామిక కార్మికులు; ఇమ్మోరల్ ట్రాఫిక్ (ప్రివెన్షన్) చట్టం-1956 సెక్షన్-2(జి)లో తెలిపిన నిర్బంధం, సంరక్షణ నిర్బంధం సహా; బాల నేరస్తుల న్యాయచట్టం-1986 సెక్షన్-2(జె)లో తెలిపిన నిర్బందం లేదా మెంటల్ హెల్త్ చట్టం-1987 సెక్షన్(జి)లో తెలిపిన మానసిక వైద్యశాల, మానసిక చికిత్సాలయంలో తెలిపిన నిర్బంధంలో ఉన్నవారు; వార్షిక ఆదాయం రూ.లక్ష మించనివారు ఉచిత న్యాయ సహాయం పొందడానికి  అర్హులు. ప్రజా సమస్యలపై అధికారులు స్పందించకపోయినా,  అప్పుతీసుకుని తిరిగి చెల్లించని పరిస్థితి ఉన్నా, సివిల్ తగాదా ఏర్పడినా న్యాయ సేవాధికార సంస్థలో ఫిర్యాదు చేయవచ్చు. వీటిని ఫ్రీ లిటిగేషన్ కేసులుగా నమోదు చేసి, సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తారు.

దరఖాస్తు ఎవరికి, ఎలా చేయాలంటే..
ఉచిత న్యాయ సహాయం కోరుకునేవారు తమ కేసు పూర్వాపరాలు, కావలసిన పరిష్కారం వివరిస్తూ సంబంధిత డాక్యుమెంట్లు జత చేస్తూ దరఖాస్తు చేసుకోవాలి. రాజమండ్రి కోర్టు ఆవరణలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు లేదా కాకినాడ, రామచంద్రపురం, పెద్దాపురం, పిఠాపురం, అమలాపురం, రాజోలు, తుని కోర్టుల్లోని మండల న్యాయ సేవా కమిటీలకు దరఖాస్తు చేయవచ్చు.
 
జిల్లా జడ్జి చైర్మన్‌గా..
జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు జిల్లా జడ్జి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. మండల న్యాయ సేవా కమిటీకి ఆ మండలంలోని న్యాయమూర్తే చైర్మన్‌గా ఉంటారు. వీరితోపాటు ఇద్దరు సభ్యులుంటారు.

ఎన్నో సేవలు..
రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థలో భాగంగా సుప్రీంకోర్టు లోక్ అదాలత్ ఏర్పాటు చేసింది. దీని ద్వారా కోర్టుల్లో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కేసులను కక్షిదారులు పరిష్కరించుకునే అవకాశం ఉంది. దీనివల్ల సమయం, డబ్బు ఆదా అవడమే కాకుండా మానసిక ఒత్తిడి నుంచి బయటపడవచ్చు. లోక్ అదాలత్‌లో ఇచ్చే తీర్పే అంతిమ తీర్పు అవుతుంది. లోక్ అదాలత్ ద్వారా సివిల్ కేసులు పరిష్కరించుకుంటే కోర్టు ఫీజు తిరిగి ఇస్తారు.

ప్రజల వద్దకు వెళ్లి, వారికి చట్టాలపై అవగాహన కల్పించేందుకు న్యాయమూర్తులు న్యాయవిజ్ఞాన సదస్సులు నిర్వహిస్తున్నారు. సమాజంలో వివిధ రంగాలకు చెందిన వ్యక్తులను, న్యాయవాదులను పారాలీగల్ వలంటీర్లుగా నియమించారు. వీరికి చట్టాలు, వివిధ వ్యవస్థలపై న్యాయమూర్తులు, వైద్యులు, పోలీసు అధికారులు అవగాహన కల్పిస్తారు. ఈ వలంటీర్లు ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని, న్యాయం అందించేందుకు కృషి చేస్తారు.

Advertisement
Advertisement