కోడి పందేలపై స్టేటస్ కో | Sakshi
Sakshi News home page

కోడి పందేలపై స్టేటస్ కో

Published Tue, Jan 13 2015 2:30 AM

కోడి పందేలపై స్టేటస్ కో - Sakshi

హైకోర్టు ఉత్తర్వులను నిలుపుదలచేసిన సుప్రీంకోర్టు

సాక్షి, హైదరాబాద్, న్యూఢిల్లీ: కోడి పందేల నిర్వహణ విషయంలో హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సోమవారం నిలుపుదల చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో యథాతథస్థితి (స్టేటస్ కో) కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసును తిరిగి విచారించాలని హైకోర్టుకు స్పష్టం చేసింది. అప్పటివరకు యథాతథస్థితి కొనసాగుతుందని తేల్చి చెప్తూ.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్.ఎల్.దత్తు, న్యాయమూర్తి జస్టిస్ ఎ.కె.సిక్రిల నేతృత్వంలోని ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

పశ్చిమగోదావరి జిలా ఏలూరుకు చెందిన నరహరి జగదీష్‌కుమార్ కోడి పందేలపై ఇటీవల హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. దాన్ని విచారించిన  ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం, కోడి పందేలు, జూదం, అక్రమ మద్యం అమ్మకాలు చేపట్టే వారిపై చర్యలు తీసుకోవాలని పశ్చిమగోదావరి జిల్లా ఎస్‌పీకి ప్రభుత్వం నుంచి సూచనలు ఉన్నందున, వాటిని అర్థవంతంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ బీజేపీ నాయకుడు రఘురామకృష్ణంరాజు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. 

యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా, పీపుల్స్ ఫర్ యానిమల్స్ సంస్థలు ఈ కేసులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశాయి. వాటన్నింటిపై ప్రధాన న్యాయమూర్తి హెచ్.ఎల్.దత్తు నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. సోమవారం పిటిషనర్ రఘురామకృష్ణంరాజు తరఫు న్యాయవాది అనూప్‌చౌదరి తమ  వాదనలు వినిపించారు. చివరికి ప్రధాన న్యాయమూర్తి హెచ్.ఎల్.దత్తు  గత నెల 29న హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును పక్కన పెడుతున్నామని ఆదేశాలు జారీచేశారు.

కోడి పందేలపై దాఖలైన పిల్‌పై తిరిగి విచారణ చేపట్టాలని హైకోర్టును ఆదేశించింది. హైకోర్టు తుది ఉత్తర్వు లు ఇచ్చే వరకూ యథాతథస్థితిని కొనసాగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇక యథాతథస్థితి విషయంలో ఎవరికి వారు తమ తోచిన భాష్యాలు చెప్పుకుంటున్నారు.  కోడి పందాలు జరపొద్దనే కోర్టు ఉద్దేశమని  పీపుల్స్ ఫర్ యానిమల్స్ సంస్థ ప్రతినిధిగౌరీములేఖీ చెప్పగా, పందేలకు తీర్పు అనుకూలమేనని రఘు రామకృష్ణంరాజు తరపు న్యాయవాదులు చెప్తున్నారు.

Advertisement
Advertisement