గుర్రప చెరువులో మునిగి తండ్రీకొడుకుల మృతి | Sakshi
Sakshi News home page

గుర్రప చెరువులో మునిగి తండ్రీకొడుకుల మృతి

Published Mon, Dec 9 2013 1:50 AM

Swimming in the pond in the horse learned

 =బంతి కోసం నీటిలో దిగి కుమారుడు..
 =కొడుకు ఆచూకీ కోసం చెరువులో దిగి తండ్రి కన్నుమూత
 =ఇద్దరి మృతదేహాలూ లభ్యం
 

అవనిగడ్డ, న్యూస్‌లైన్ : చెరువులో కొడుకు గల్లంతవగా, గాలింపు కోసం చెరువులోకి దిగిన తండ్రి కూడా మృతిచెందిన విషాద ఘటన అవనిగడ్డలో ఆదివారం జరిగింది. గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన బిట్ర శ్రీను (42) అల్యూమినియం పాత్రల వ్యాపారం చేసేందుకు మూడేళ్ల క్రితం అవనిగడ్డకు వచ్చాడు. చెరువు సమీపంలో నివాసం ఉంటున్నాడు. ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో కొంతమంది పిల్లలతో కలిసి శ్రీను కుమారుడు వెంకటేష్ (6) బంతి ఆట ఆడుతుండగా అది చెరువులో పడింది. దానిని తీసుకువచ్చేందుకు కొంతమంది యత్నించగా, పెద్దలు వారించటంతో వెనుదిరిగి వెళ్లిపోయారు.

అరగంట తర్వాత వెంకటేష్ బంతి తీసేందుకు చెరువులోకి దిగాడు. ఎంతసేపటికీ ఒడ్డుకు రాకపోవడాన్ని గమనించిన కొందరు పిల్లలు కేకలు వేసి స్థానికులకు విషయం వివరించారు. స్థానికులు వచ్చి గాలించినా వెంకటేష్ ఆచూకీ లభించలేదు. విషయం తెలుసుకున్న స్థానిక అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు చెరువు వద్దకు వచ్చి గాలింపు చర్యలు చేపట్టేందుకు ప్రయత్నించారు. అప్పటికే చీకటి పడటంతో ఆ ప్రయత్నాలు విరమించుకున్నారు.
 
కుమారుడి ఆచూకీ కోసం...


 ‘మా కుమారుడిని ఎవరూ కాపాడటం లేదు, నేనే రక్షించుకుంటా’ అంటూ తండ్రి శ్రీను చెరువులోకి దూకాడు. ఈ ప్రాంతానికి కొద్ది దూరంలో ఉన్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి చూడగా ఇద్దరి ఆచూకీ లభించలేదు. పులిగడ్డ నుంచి గజ ఈతగాళ్లను తీసుకువచ్చి వెదికించడంతో తండ్రి శ్రీను మృతదేహం, ఆ తర్వాత రాత్రి సమయంలో వెంకటేష్ మృతదేహం లభ్యమయ్యాయి.
 
మృతుడు శ్రీనుకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమార్తె యల్లమ్మ (11)కు గుండె సంబంధ వ్యాధి రావడంతో తల్లి వీరమ్మ వైద్య పరీక్షల కోసం ఐదు రోజుల కిందట విజయవాడ తీసుకువెళ్లింది. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సకాలంలో స్పందించి వెంకటేష్‌ను గాలించి ఉంటే తన తమ్ముడు నీట మునిగేవాడు కాదని శ్రీను అక్క నాంచారమ్మ భోరున విలపిస్తూ చెప్పింది. అవనిగడ్డ సీఐ రమణమూర్తి, ఎస్సై శ్రీనివాస్, తహశీల్దార్ వెన్నెల శ్రీను ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు.
 

Advertisement
Advertisement