వామ్మో.. స్వైన్‌ఫ్లూ! | Sakshi
Sakshi News home page

వామ్మో.. స్వైన్‌ఫ్లూ!

Published Mon, Nov 18 2013 5:13 AM

swine flu disease spreads

దౌల్తాబాద్, న్యూస్‌లైన్:  ప్రాణాంతక స్వైన్‌ఫ్లూ వ్యాధి పేరు వింటేనే మండలంలోని మాటూరు వాసులు హడలిపోతున్నారు. గ్రామానికి చెందిన ఓ మహిళ వ్యాధిబారినపడి హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. గ్రామానికి చెందిన శెట్టి వీరమణి (45) గత 15 రోజులుగా దగ్గు, జ్వరం, తలనొప్పితో బాధపడుతుంది. అయితే ఆమె తన కుటుంబసభ్యులతో కలిసి 20 రోజుల క్రితం వివిధ రాష్ట్రాలకు విహారయాత్రలకు వెళ్లారు. ఆ సమయంలో అస్వస్థతకు గురికాగా, కుటుంబసభ్యులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్సచేయించారు. ఆరోగ్యం కుదుటపడకపోవడంతో ఈనెల 14న హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్సలు నిర్వహించిన అక్కడి వైద్యులు వీరమణికి స్వైన్‌ఫ్లూ వ్యాధి సోకిందని నిర్ధారించారు. అయితే వెంటనే అక్కడి వైద్యులు జిల్లా వైధ్యాధికారులకు సమాచారమిచ్చారు.
 గ్రామాన్ని సందర్శించి జిల్లా వైద్యాధికారులు
  మాటూరు గ్రామంలో స్వైన్‌ఫ్లూ వ్యాధి సోకి ఓ మహిళ అస్వస్థతకు గురికావడంతో జిల్లా వైద్యాధికారి(డీఎంహెచ్‌ఓ) రుక్మిణమ్మతో పాటు, జిల్లా వైద్యసిబ్బంది గ్రామాన్ని సందర్శించి వీరమణి కుటుంబసభ్యులకు మందులు పంపిణీచేశారు. ఈ వ్యాధి ఇతరులకు సోకకుండా ఆదివారం నుంచి గ్రామంలో క్యాంపుఏర్పాటు ఏర్పాటుచేయాలని స్థానిక వైద్యాధికారులకు ఆదేశించారు. డీఐఓ వెంకట రంగారావు, ఎస్‌పీహెచ్‌ఓ లలిత గ్రామాన్ని సందర్శించా రు. వ్యాధిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వైద్యసిబ్బంది ఇంటింటికి తిరిగి జ్వరం, దగ్గు, తలనొప్పితో బాధపడేవారి వివరాలను సేకరించింది.

Advertisement
Advertisement