‘పది’లో ప్రక్షాళన | Sakshi
Sakshi News home page

‘పది’లో ప్రక్షాళన

Published Tue, May 27 2014 12:42 AM

syllabus changes and exam method changed in tenth class

కర్నూలు(విద్య), న్యూస్‌లైన్ : పదో తరగతి విద్యావిధానాన్ని ఈ ఏడాది విద్యాశాఖ పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తోంది. అందులో భాగంగా పాఠ్యాంశాల మార్పుతోపాటు విద్యాబోధన, పరీక్ష విధానంలోనూ మార్పులు తెస్తోంది. జాతీయ పాఠ్యప్రణాళిక ప్రకారం రాష్ట్ర విద్య పరిశోధన మండలి 2012-13 విద్యాసంవత్సరంలో 1, 2, 3, 6, 7 తరగతుల పాఠ్యపుస్తకాలను మార్చింది. 2013-14లో 4, 5, 8, 9 తరగతులకు, ఈ విద్యాసంవత్సరం నుంచి 10వ తరగతికి సిలబస్‌ను మార్పు చేసింది. మారిన సిలబస్‌లో కృత్యాధార బోధనకు ప్రాధాన్యం లభిచింది.

 పాఠ్యపుస్తకాలు బట్టీకొట్టేవిగా కాకుండా విషయ అవగాహన కల్పించాలనే ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది. పాఠ్యాంశాలను విద్యార్థులు చదవడంతో పాటు ఆలోచించడం, నేర్చుకున్న విషయాన్ని వ్యక్తీకరించడం, విశ్లేషణ చేసే విధంగా, వ్యక్తిత్వాన్ని పెంచే విధంగా ఈ పుస్తకాలను రూపొందించారు. విద్యార్థుల్లో నైతిక విలువలు పెంచడం, మహిళలను గౌరవించడం, స్త్రీ సాధికారికత తదితర విషయాలకు ప్రాధాన్యనిచ్చారు.

 పరీక్ష విధానంలో సంస్కరణలు
 పాఠశాల విద్యాశాఖ దాదాపు 15 ఏళ్ల తర్వాత పదో తరగతి పరీక్షా విధానంలో మార్పు చేసింది. ఇప్పటి వరకు హిందీ పరీక్షకు మాత్రమే ఒక్క పేపర్ ఉండేది. మిగిలిన ఐదు పరీక్షలకు రెండేసి పరీక్షలు రాయాల్సి వచ్చేది. అయితే ఈ ఏడాది నుంచి తెలుగు, హిందీ, ఇంగ్లిష్ సబ్జెక్టులకు కూడా ఒక్క పేపర్ మాత్రమే ఉంటుంది. మిగిలిన సైన్స్, సోషియల్, లెక్కలు సబ్జెక్టులకు రెండు పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ప్రతి సబ్జెక్టుకు 80 మార్కుల రాత పరీక్ష ఉంటుంది. 20 మార్కులకు ఇంటర్నల్ మార్కులు ఉంటాయి. రాత పరీక్ష, ఇంటర్నల్ మార్కులు కలిపి 35 మార్కులు తెచ్చుకుంటేనే ఆ విద్యార్థి ఆ సబ్జెక్టులో ఉత్తీర్ణుడైనట్లు పరిగణలోకి తీసుకుంటారు. గతంలో హిందీ సబ్జెక్టులో 20 మార్కులు తెచ్చుకుంటే చాలు పాస్ చేసేవారు. ప్రస్తుత విధానంలో ఈ సబ్జెక్టులోనూ 35 మార్కులు తెచ్చుకోవాల్సిందే.

Advertisement
Advertisement