తప్పెవరిది? | Sakshi
Sakshi News home page

`తప్పెవరిది?

Published Tue, Nov 11 2014 3:24 AM

తప్పెవరిది? - Sakshi

స్కాలర్‌షిప్పు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి 2014-15 విద్యా సంవత్సరం రెన్యూవల్ చేయించుకునేందుకు దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 10 (సోమవారం)తో గడువు ముగిసింది. ఇప్పటిదాకా కేవలం 40 శాతం మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా 60 శాతం మంది  విద్యార్థులు దరఖాస్తు చేసుకోలేదు.

అక్టోబరు 30 నుంచి నవంబరు 10 దాకా ప్రభుత్వం గడువు విధించింది, ఇదే విషయం పదేపదే చెప్పినా గడువు ముగిసే నాటికి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ మొత్తం విద్యార్థులు 56,870 మంది దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా కేవలం 23,105 మంది (40 శాతం) దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ వైఫల్యం వెనుక ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్ల, అధికారుల అలసత్వంతో పాటు సాంకేతిక సమస్యలు ఉన్నట్లు స్పష్టమవుతోంది.
     - అనంతపురం ఎడ్యుకేషన్
 
 
 పనిచేయని సర్వర్:  స్కాలర్‌షిప్పులు, ఫీజు రీయింబర్‌‌సమెంట్‌కు సంబంధించి విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఇందుకు సంబంధించి తగిన దాఖాలలతో ఇంటర్‌నెట్ సెంటర్లకు విద్యార్థులు బారులు తీరుతున్నారు. అయితే సకాలంలో సర్వర్ పనిచేయకపోవడంతో విద్యార్థులు తమ వివరాలను అప్‌లోడ్ చేయలేకపోతున్నారు. రాష్ర్ట వ్యాప్తంగా ఒకే సమయంలో అందరూ దరఖాస్తు చేసుకునేందుకు ప్రయత్నిస్తుండడంతో ఈ సమస్య ఉత్పన్నమవుతోందని ఇంటర్‌నెట్ నిర్వాహకులు పేర్కొంటున్నారు.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న తర్వాత ఆయా కళాశాలల్లో హార్‌‌డ కాపీలను విద్యార్థులు అందజేయాల్సి ఉంటుంది. వాటిని పరిశీలించిన అనంతరం సంబంధిత శాఖలకు కళాశాలలు సిఫారసు చేయాల్సి ఉంది. అయితే ఈ తంతు మొత్తం అస్తవ్యస్థంగా సాగుతున్నట్లు విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. చాలా కళాశాలల ప్రిన్సిపాళ్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో విద్యార్థులు నష్టపోయే ప్రమాదం నెలకొంది.

 ఈబీసీ విద్యార్థులకు స్థానికత ధ్రువీకరణ సమస్య
 నేటివిటీ సర్టిఫికెట్ (స్థానిక ధ్రువీకరణ) జత చేయాలనే నిబంధన ఈబీసీ విద్యార్థులకు కొత్త చిక్కు తెచ్చిపెడుతోంది. అందులోనూ మీసేవా ద్వారా పొందిన సర్టిఫికెట్ జమ చేస్తేనే అర్హులకింద పరిగణిస్తామని చెప్పడంతో తలలు పట్టుకుంటున్నారు. స్థానికత ధ్రువీకరణ పత్రం కోసం మీసేవాలో దరఖాస్తు చేసుకుంటే నెలరోజులు గడువు పెడుతున్నారని, స్కాలర్‌షిప్పు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు పదిరోజులు గడువు పెట్టి దరఖాస్తు చేసుకోవాలంటే ఎలా అని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.

నేటివిటీ సర్టిఫికెట్లు రాకపోతే ఎలా దరఖాస్తు చేసుకోవాలని వాపోతున్నారు. ఈ విషయంలో కలెక్టరు స్పందించినా  క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తోంది.

 నూతన స్కాలర్‌షిప్పు, రాజీవ్ విద్యా దీవెన పథకాలదీ అదే పరిస్థితి
 మరోవైపు సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న నూతన స్కాలర్‌షిప్పు, రాజీవ్ విద్యా దీవెన పథకాల దరఖాస్తులో కూడా ఇంతే నిర్లక్ష్యం కనబడుతోంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం అమలవుతున్న ఈ పథకాల దరఖాస్తునకు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు చొరవ చూపడం లేదు.

నూతన స్కాలర్‌షిప్పు పథకం కింద  5-8 తరగతులు విద్యార్థులు జిల్లాలో 12 వేలమంది, అలాగే రాజీవ్ విద్యా దీవెన పథకం కింద 9,10 తరగతులు విద్యార్థులు 6 వేలమంది దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఈనెల 15తో గడువు ముగియనుంది. ఇప్పటిదాకా కనీసం 45 శాతం కూడా దరఖాస్తులు చేసుకోలేదని ఆయా శాఖల అధికారులు చెబుతున్నారు.

 17వరకు దరఖాస్తు గడువు పొడిగింపు
 స్కాలర్‌షిప్పు, ఫీజు రీయింబర్స్‌మెంట్ రెన్యూవల్స్ దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 17 వరకు గడువు పొడిగించారు. వాస్తవానికి సోమవారం నాటికి గడువు పూర్తయింది. మళ్లీ 17వరకు పొడిగిస్తూ చర్యలు తీసుకున్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయా శాఖల అధికారులు కోరుతున్నారు. కాగా, కొత్తగా దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు ఈ నెల 30 వరకు గడువు ఉంది.
 
 ఇప్పటిదాకా స్కాలర్‌షిప్పు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అందిన దరఖాస్తులు...

 
 శాఖ        మొత్తం        అందినవి        అందాల్సినవి
 బీసీ             30,089        13,445        16644
 ఈబీసీ        10,118          2787         7331
 ఎస్సీ           8607           3234            5373
 ఎస్టీ               2499          1030         1469
 మైనార్టీ           5557          2609         2948
 మొత్తం        56,870        23,105        33765

Advertisement

తప్పక చదవండి

Advertisement