మరుగున పడ్డపనులు | Sakshi
Sakshi News home page

మరుగున పడ్డపనులు

Published Sat, Jan 25 2014 2:08 AM

మరుగున పడ్డపనులు

మేడారం, న్యూస్‌లైన్ : మేడారం సమ్మక్క-సారలమ్మ... తెలంగాణ కుంభమేళాను తలపించే అతి పెద్ద గిరిజన జాతర... కోటిమందికి పైగా భక్తులు తరలివచ్చే మహాజాతర... అలాంటి ప్రతిష్టాత్మకమైన జనజాతరలో కనీస ఏర్పాట్లపై ఆర్‌డబ్ల్యూఎస్ నిర్లక్ష్యం పరాకాష్టకు చేరింది. కలెక్టర్ కిషన్ విధించిన డెడ్‌లైన్ జనవరి 31 ముంచుకొస్తున్నా.. మరుగుదొడ్ల నిర్మాణ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పనులు నత్తనడకన కొనసా...గుతూనే ఉన్నారుు. మేడారంలో ఆర్‌డబ్ల్యూఎస్  శాఖ ఆధ్వర్యంలో సుమారు రూ.2.50 కోట్లతో 10 వేల మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు.

వచ్చే నెల 12 నుంచి 15వ తేదీ వరకు జరగనున్న జాతరలో భక్తుల సౌకర్యార్థం ములుగు శివారు గట్టమ్మ ఆలయం మొదలుకుని మేడారం పరిసరాల వరకు బిట్లు బిట్లుగా చేసి నిర్మాణాలు చేస్తున్నారు. జాతరలో అభివృద్ధి పనులను దక్కించుకునే సమయంలో పలు దఫాలుగా చర్చలు జరుపుకుని వాటాలు పంచుకున్న పార్టీలు పనుల పురోగతిపై మాత్రం ఊసెత్తడం లేదు. దీనిపై అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంతో పరిస్థితి అధ్వానంగా మారింది.
 
అనుభవం నేర్వని అధికారులు


గత జాతరలో మరుగుదొడ్ల నిర్మాణం అస్తవ్యస్తంగా సాగింది. దీంతో భక్తులు అష్టకష్టాలు పడినా అధికారులు
అనుభవ పాఠాలు నేర్వలేదు. దీనికి ఈ జాతరలో చేపడుతున్న మరుగుదొడ్ల నిర్మాణ పనులే తార్కాణంగా చెప్పొచ్చు. గత జాతరలో 8,800 మరుగుదొడ్లు నిర్మించారు. అయితే ఈసారి భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావించిన అధికారులు వాటిని 10వేలకు పెంచారు. పనుల వద్ద ఎటువంటి ఆరోపణలు రాకుండా ఉండేందుకు ఆయా పార్టీలకు ముందుగానే అధికార యంత్రాంగం సంకేతాలు ఇవ్వగా చర్చోపచర్చలు జరుపుకున్నారు. ఎట్టకేలకు కాంగ్రెస్ 40, టీడీపీ 30, టీఆర్‌ఎస్ 30 శాతం పనుల ‘కంపు’ను పంచుకున్నాయి.

ఇది జరిగి నెల రోజులు దాటినా పనుల్లో మాత్రం చురుకుదనం కారావడంలేదు. గతంలో జాతర రేపుమాపు అనే వరకూ పనులు చేయడంతో తొలిరోజే కంపు..కంపు అయిన పరిస్థితి తెలిసిందే. ముందస్తుగా పనుల పూర్తిపై వెంటబడని అధికార యంత్రాంగం డెడ్‌లైన్ దగ్గరపడ్డాక పరుగులు పెట్టించడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో పనులు దక్కించుకున్న వారు అడ్డదిడ్డంగా చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. పలుచోట్ల కనీసం వాడకముందే మరుగుదొడ్లు కూలిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఈ అనుభవంతోనైనా ముందస్తు చర్యలు చేపడుతారనుకుంటే ఇప్పుడూ అదే పరిస్థితి నెలకొంది.
 
బేస్‌మెంట్ దశలో...
 
ములుగు గట్టమ్మ ఆలయం శివారు నుంచి మేడారం జంపన్నవాగు, కన్నెపల్లి, ఊరట్టం, నార్లాపూర్, రెడ్డిగూడెం, కాల్వపల్లి పరిసరాల్లో చేపడుతున్న మరుగుదొడ్ల నిర్మాణ పనులు మందకొడిగా సాగుతున్నాయి. పలుచోట్ల పనులు ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నాయి. ఊరట్టం, మేడారం ఇంగ్లిష్ మీడియం, చిలకలగుట్ట తదితర చోట్ల బేస్‌మెంట్ దశకు వచ్చాయి. తూతూమంత్రంగా చేపడుతున్న పనుల కు సరిగా క్యూరింగ్ చేయడం లేదనే ఆరోపణలు సైతం ఉన్నాయి. దీంతో అవి కుంగిపోయి భక్తులకు నరకప్రాయంగా మారే అవకాశం ఉంది.

పెద్ద సంఖ్యలో నిర్మాణాలు చేపట్టడంతో అధికారుల పర్యవేక్షణ కూడా సరిగా లేని పరిస్థితి. పనులు త్వరగా పూర్తి చేస్తే మరుగుదొడ్ల బేసిన్‌లు ఎత్తుకుపోతారని నిర్మాణదారులు పేర్కొంటున్నారు. దీనిని సాకుగా చూపి పనుల్లో వేగం పూర్తిగా తగ్గించేశారు. అయితే పనులు దక్కించుకున్న వారు కూడా మమ అనిపించి నిధులు నొక్కేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే.. పేరుకే 10వేల మరుగుదొడ్ల సంఖ్య ఉందని, వీటిలో ఏడెనిమిది వేల మరుగుదొడ్లు చేపట్టి మిగతావి రికార్డుల్లో రాసుకుని పంపకాలు చేసుకుంటారన్న ఆరోపణలున్నాయి.

గత జాతరలో నాసిరకానికి తోడు ఇలాంటి తతంగం జరిగిందని అప్పట్లో పనుల సందర్శనకు వచ్చిన ఆయా పార్టీల బృందాలే బాహాటంగా ఆరోపించాయి. అయితే ఆ మూడు పార్టీలు పనుల కంపును పంచుకున్నందున ఇప్పుడు అక్రమాలు చోటుచేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. భక్తుల మేలుకోరే అధికారులు ఈసారైనా కక్కుర్తి పనులకు మంగళం పాడాల్సిన అవసముంది. ఇప్పటికే జాతర సందడి నెలకొన్న క్రమంలో మరుగుదొడ్ల పనుల్లో వేగం పెంచి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని భక్తులు కోరుతున్నారు.

Advertisement
Advertisement