రుచి లేని ‘మధ్యాహ్న’ భోజనం | Sakshi
Sakshi News home page

రుచి లేని ‘మధ్యాహ్న’ భోజనం

Published Sat, Dec 13 2014 3:52 AM

రుచి లేని ‘మధ్యాహ్న’ భోజనం

* కొండెక్కిన కూరగాయలు
* కానరాని కోడిగుడ్లు
* విద్యార్థులకు అందని పౌష్టికాహారం

విజయనగరం అర్బన్ : ఇటీవల సంభవించిన హుద్‌హుద్ తుపాను ప్రభావం పాఠశాలల మధ్యాహ్న భోజనం, వసతిగృహాలపై బాగా పడింది. కూరగాయల కొరత నేటికీ వెంటాడుతోంది. తుపాను ధాటికి కూరగాయల పంటలు నాశనమవడంతో ఉత్పత్తి బాగా తగ్గిపోయింది. దీంతో కూరగాయల ధరలు కొండెక్కాయి. తుపాను తర్వాత రెండు రోజుల పాటు దాతలిచ్చిన కూరగాయలు సరఫరా చేసిన అధికారులు తర్వాత మిన్నకుండిపోయారు. ఉత్పత్తి కొరత పూడ్చడం, ధరల నియంత్రణకు ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. దీంతో పాఠశాలల్లో, వసతిగృహాల్లో నాణ్యమైన భోజనం పెట్టలేని పరిస్థితి నెలకొంది. జిల్లాలోని 3,437 పాఠశాలల్లో సుమారు మూడు లక్షల మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేస్తున్నారు.

అదే విధంగా వివిధ సంక్షేమ వసతిగృహాల్లో సుమారు 8 వేల మంది వరకు విద్యార్థులున్నారు. ధరలు పెరిగిపోవడంతో వల్ల రుచికరమైన  విద్యార్ధులకు నాణ్యమైన భోజననం అందని పరిస్థితి నెలకొంది. విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్న ‘మధ్యాహ్న భోజన పథకం’లో నాణ్యత లోపిస్తోంది. బిల్లులు సక్రమంగా చెల్లించకపోవడం, వచ్చిన బిల్లులు గిట్టుబాటు కాకపోవడంతో నిర్వాహకులు కూడా నాణ్యత లేని భోజనం పెట్టి మమ అనిపిస్తున్నారు. వసతిగృహాల్లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది.

విద్యార్థులు పౌష్టికాహార లోపంతో బాధపడకుండా ఉండేందుకు గత ఏడాది వసతిగృహాల్లో మెనూ మార్చారు. అన్నం, సాంబారుతో పాటు ఆకుకూరలు, ఇతర కూరగాయలతో కూడిన వంటకాలను కూడా మెనూలో పొందుపర్చారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, అటు హాస్టళ్లలో ‘మెనూ’ చిక్కిపోయింది. పౌష్టికాహారం సంగతి పక్కనపెడితే పప్పన్నం కూడా సరిగా పెట్టలేని పరిస్థితి. ఏ కూరగాయలు తీసుకున్నా కిలో 30 రూపాయలకు తక్కువ లేకుండా ఉన్నాయి.

దీంతో రుచికరమైన ఆహారం అందించడం మధ్యాహ్నభోజన నిర్వాహకులకు, వార్టెన్లకు ఇబ్బందిగా మారింది. ధరల పెరుగుదల సాకుతో ఇంకొంతమంది వార్డెన్లు కోడిగుడ్లను ఇవ్వడం మానేశారు. స్కూళ్లలో వారానికి రెండు కోడిగుడ్లు అందించాల్సి ఉండగా చాలాచోట్ల ఒక్కటి కూడా ఇవ్వట్లేదు. ఈ మేరకు పలు ప్రాంతాల నుంచి కలెక్టర్ గ్రీవెన్స్‌సెల్‌కు ఫిర్యాదులు కూడా వస్తున్నాయి.
 
ధరలు తగ్గాలి... లేదా భత్యం పెంచాలి
- కూరగాయల ధరలు తగ్గడం లేదా ఏజెన్సీలకు ఇచ్చే భత్యం పెంచడం వంటి చర్యలు తీసుకున్నప్పుడే నాణ్యమైన భోజనం సాధ్యమని ఉపాధ్యాయవర్గాలు చెబుతున్నాయి. గత విద్యాసంవత్సరం ముగింపు దశలో ఉన్న కూరగాయల ధరలకు ఇప్పటికి 70 శాతం పెరిగింది.
- ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో చదివే విద్యార్థులకు రోజుకు రూ.4, ఉన్నత పాఠశాల విద్యార్థులకు  రూ.4.65 చొప్పున భోజనానికి ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ప్రస్తుతం ఐదు రూపాయలకు సింగిల్ టీ కూడా రాదు. కానీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం 100 గ్రాముల అన్నం(బియ్యం ప్రభుత్వం సరఫరా చేస్తుంది), 150 గ్రాముల కూరలను  ఏజెన్సీలు వడ్డించాలి. వారానికి రెండు సార్లు గుడ్డు పెట్టాలి.
- కోడిగుడ్డు ధర నాలుగు రూపాయలకు పైబడి ఉంది. మరి అలాంటప్పుడు నాలుగు రూపాయలకు భోజనం ఎలా పెట్టాలని నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు.
- భోజన పథకం అమలుకు వంట గ్యాస్ ఇవ్వాల్సి ఉండగా కొన్ని మండలాల్లో నేటికీ ఇవ్వలేదు.  
 
వసతిగృహాల్లోనూ ఇదే పరిస్థితి..
ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలకూ ధరల సెగ తగిలింది. జిల్లాలో 59 హాస్టళ్లు ఉన్నాయి. వీరందరికీ శనివారం మినహా తక్కిన అన్ని రోజుల్లోనూ గుడ్లు అందించాలి. అలాగే రోజూ కాయగూర, పప్పు, సాంబారు అందించాలి. పెరిగిన ధరలతో దాదాపు ఏ సంక్షేమ వసతి గృహంలో కూడా పూర్తిస్థాయి మెనూ అమలు కావడం లేదు.

Advertisement
Advertisement