చెవిరెడ్డి జోరు.. తమ్ముళ్ల బేజారు | Sakshi
Sakshi News home page

చెవిరెడ్డి జోరు.. తమ్ముళ్ల బేజారు

Published Fri, Jul 25 2014 2:45 AM

చెవిరెడ్డి జోరు.. తమ్ముళ్ల బేజారు - Sakshi

తిరుపతి రూరల్:  చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఎత్తుగడతో తెలుగుతమ్ముళ్లు నవ్వులపాలయ్యారు. రైతు, డ్వాక్రా రుణాల మాఫీపై ముఖ్యమంత్రి చంద్ర బాబు తీరుకు నిరసనగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ‘నరకాసుర వధ’ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ మేరకు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో దంద్రగిరి టవర్ క్లాక్ వద్ద గురువారం నిరసన చేపట్టారు. తప్పుడు హామీలు ఇచ్చిన చంద్రబాబు దిష్టిబొమ్మను తగులబెట్టేందుకు ప్రయత్నించారు. దీనిని తెలుగు తమ్ముళ్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోటీగా వ్యతిరేక నినాదాలు చేశారు.

తమ్ముళ్లతోపాటు పోలీసులు దిష్టిబొమ్మను తగలబెట్టకుండా అడ్డుకున్నారు. ఇక్కడే చెవిరెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. తాను ఎక్కడికి వెళితే అక్కడికి టీడీపీ నేతలు వస్తారని భావించిన ఎమ్మెల్యే రైతులు, మహిళలు, పార్టీ నాయకులతో కలిసి నిరసన ర్యాలీ చేపట్టారు.

ఈ విషయం తెలీని తమ్ముళ్లు వైఎస్‌ఆర్‌సీపీ నాయకుల వెనక టీడీపీ జెండాలు పట్టుకుని చంద్రగిరిలో వీధులన్నీ తిరిగారు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఎక్కడికి వెళుతున్నారు? ఎందుకు వెళుతున్నారో తెలీక సుమారు రెండు గంటలపాటు వీధుల్లో ఆయన వెంట తమ్ముళ్లు, పోలీసులు తిరిగారు. దీంతో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, టీడీపీ నేతలు కలిసి నిరసన తెలుపుతున్నారేమోనని స్థానికులు ఆసక్తిగా చూశారు. చివరకు టీడీపీలోని ఓవర్గం నాయకుడు చెవిరెడ్డి వ్యూహాన్ని గుర్తించాడు.

చెవిరెడ్డి మనచేత ర్యాలీ చేయిస్తున్నారంటూ ఆయన వెంట వెళ్లవద్దని చెప్పాడు. నువ్వెవడ్రా చెప్పేదని మరో వర్గం వీరిపై దాడికి దిగారు. దీంతో టీడీపీలోని రెండు వర్గాలు బాహాబాహీకి దిగాయి. చెవిరెడ్డి ఎత్తుగడలో పావులై నవ్వులపాలయ్యామని వారికి ఎప్పటికో అర్థమయింది. అప్పటికే సమయం మించిపోయింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement