అంతా పచ్చపాతం | Sakshi
Sakshi News home page

అంతా పచ్చపాతం

Published Sat, Jun 1 2019 1:24 PM

TDP Corruption in West Godavari - Sakshi

ఏలూరు (మెట్రో) : అంతా పచ్చపాతమే.. అధికార మదంతో.. అవినీతి దాహంతో జిల్లా పరిషత్‌ అంతా కూరుకుపోయింది. అంతా పచ్చపాతానికి జిల్లా పరిషత్‌ బలిపశువుగా మారింది. అందివచ్చిన కాడికి దండుకుని జిల్లా పరిషత్‌ కార్యాలయాన్ని తెలుగుదేశం కార్యాలయంగా మార్చేశారు. ప్రభుత్వ కార్యాలయానికి పసుపు రంగులు వేసి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు.

అసలే అరకొర నిధులు
జిల్లా పరిషత్‌కు అసలే అరకొర నిధులు రావడంతో జిల్లా పరిషత్‌ పాలనే ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు సర్కారు జిల్లా పరిషత్‌కు మూలస్థంభంగా ఉన్న ఇసుక సీనరేజీలను రద్దు చేసి తెలుగుదేశం నాయకుల కోసం ఇసుకను ఉచితం చేశారు. తద్వారా ఇసుక దోచుకున్న తెలుగుదేశం నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు అపర కోటీశ్వరులు అయ్యారు. ఈ సమయంలో జిల్లా పరిషత్‌కు రూపాయి ఆదాయం లేకుండా పోయింది. ఈ విధంగా తమ స్వప్రయోజనాల కోసం జిల్లా పరిషత్‌ పూర్తి పాలనపై పచ్చనేతలు ప్రతాపం చూపారు.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ...
ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో దేశం నేతల అధిక ఖర్చులకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. జిల్లా కేంద్రమైన ఏలూరులో జిల్లా పరిషత్‌ కార్యాలయం ఆవరణలో ఖాళీ ప్రదేశం ఉందని, ఆ ప్రదేశాన్ని ఉపయోగించుకోవాలని, ఇది జిల్లా పరిషత్‌కు ఆదాయం తీసుకొస్తుందని చెప్పుకొస్తూ 7 షాపింగ్‌ మాల్స్‌ను ఏర్పాటు చేశారు. వీటికి సుమారు రూ. 2 కోట్లకు పైబడి నిధులు వెచ్చించి వీటి నిర్మాణాలు పూర్తి చేశారు. ఎన్నికల కోడ్‌ సమీపిస్తుందని భావించి ఎక్కడికక్కడ అందిన కాడికి దుబారా చేశారు.

ఎల్‌ఈడీ లైట్లకే లక్షలు
జిల్లా పరిషత్‌లో ఏర్పాటు చేసిన కాంప్లెక్స్‌ల వద్ద ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ బల్బుల కోసం రూ.1.50 లక్షలు ఖర్చు చేశారు. అంతే కాకుండా పసుపు రంగు కోసం సుమారు రూ.2 లక్షలు ఖర్చు చేశారు. ఈ విధంగా అందిన కాడికి దోచుకుంటూ... పచ్చపార్టీ తమ అవసరతల కోసం జిల్లా పరిషత్‌ను అడ్డదిడ్డంగా ఉపయోగించుకుని జనరల్‌ ఫండ్స్‌ను ఖర్చు చేసింది.

పింఛన్లు రాక 300 మంది అవస్థలు
జిల్లా పరిషత్‌లో నాన్‌ ప్రొవిన్స్‌ లైస్డ్‌ సిబ్బందిగా ట్యాంక్‌ వాచర్లుగా విధులు నిర్వహించే 300 మంది సిబ్బందికి జనరల్‌ ఫండ్స్‌ నుంచి చెల్లించాల్సిన నిధులను ప్రతి నెలా చెల్లించలేని దుస్థితికి పచ్చనేతలు దిగజార్చారు. దీంతో ప్రతి నెలా పెన్షన్లు రాక 300 మంది సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇన్ని లోటులు కనిపిస్తున్నా పచ్చనేతలు మాత్రం తమ పార్టీల రంగులకు, పచ్చరాతలకు కోట్లాది రూపాయలు నిధులను దుర్వినియోగం చేసేశారు.

టీడీపీ సొత్తా?
అన్న క్యాంటీన్‌లకు ఆధునిక హంగులు జోడించారు. ముఖ్యమంత్రి మారినా క్యాంటీన్‌లో చిత్రాలను మాత్రం నేటికీ మార్చకుండా అదే విధంగా ఉంచేశారు. అన్నక్యాంటీన్‌లు ప్రభుత్వ ఆస్తులా.. లేక తెలుగుదేశం పార్టీ అడ్డానో అర్థం కావడం లేదు.

ఇచ్చింది గోరంత.. దోచేసింది కొండంత
పేరుకు మాత్రం దాతలు సమకూర్చారంటూ గొప్పలు చెప్పుకున్న పచ్చనేతలు జిల్లా పరిషత్‌ను పీల్చిపిప్పి చేసేశారు. దాతలు బెంచీలు సమకూరుస్తున్నారంటూ గొప్పలు చెప్పిన నేతలు వారి పేరు చెప్పుకుంటూ జిల్లా పరిషత్‌ నిధులను పక్కదోవ పట్టించారు. దాతలు ఇచ్చింది గోరంత అయితే వాటి పేరుతో కొండంత దోచేశారు. ఈ విధంగా పచ్చనేతలు జిల్లా పరిషత్‌ను దోచుకుతిన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement