కర్సయిపోయాం! | Sakshi
Sakshi News home page

కర్సయిపోయాం!

Published Thu, May 8 2014 11:52 PM

కర్సయిపోయాం! - Sakshi

  •      టీడీపీలో శ్మశాన వైరాగ్యం
  •      కోట్లు ఖర్చయినా ఓటమేనని విషాదం
  •      వైఎస్సార్‌సీపీకి ఓటెత్తిన మద్దతుపై అక్కసు
  •      విజయం దక్కదనితెలిసి కస్సుబుస్సు
  •  తమ్ముళ్లంతా ఇప్పుడు కోరస్‌గా విషాదరాగం పాడుకుంటున్నారు. జరగబోయే ‘సత్కారం’ తలచుకుని గుండెలు బాదుకుంటున్నారు. పైకి మేకపోతు గాంభీర్యం నటిస్తున్నా, లోలోపల బావురుమంటున్నారు. పచ్చచొక్కాల పెద్దలంతా పందేరాలు చేపట్టినా; నోట్లతో ఓట్లు కొనలేనందుకు కుమిలిపోతున్నారు. చేసేదేం లేక చేతులెత్తేస్తున్నారు. వైఎస్సార్‌సీపీకి మద్దతు ఓటెత్తిన తరుణంలో తమ పన్నాగాలు పారలేదన్న అక్కసుతో నోరు పారేసుకుంటున్నారు. నిరాశతో ఉసూరంటున్నారు.
     
    సాక్షి, విశాఖపట్నం : ‘సొమ్ములు పోయాయి.. పరువూ పోయింది.. పరాజయం మాత్రం పక్కాగా దక్కుతోంది.’ ఇదీ తమ్ముళ్ల స్వగతం. చెంపపెట్టులా జనం కొట్టిన ఓటు దెబ్బకు దిమ్మతిరిగి విస్తుపోయిన వైనం. ఇప్పుడు టీడీపీ నేతలు నైరాశ్యంలో నిండా మునిగారు. ఖర్చయిన కోట్లు తలచుకుని, మళ్లీ దక్కని అధికారాన్ని తలచుకుని కుమిలిపోతున్నారు. ఏకపక్షంగా జరిగిన పోలింగ్‌తో తమ పని అయిపోయిందని సతమతమవుతున్నారు.

    ఫ్యాన్‌గాలి జోరుతో తమకు ఎన్ని సీట్లొస్తాయో ఊహామాత్రంగా కూడా అంచనా వేయలేకపోతున్నారు. 15 నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీ జోరు కనిపిస్తూ ఉండడంతో దిగులు పడుతున్నారు. దాన్ని బయిటకు కనిపించనివ్వకుండా గంభీరంగా నీతులు వల్లె వేస్తున్నారు. నోట్లు వెదజల్లి, మద్యం విరజిమ్మి, ఓటరును మాయ చేద్దామనుకున్నా పాచిక పారక, సైకిల్ మూల పెట్టేయాల్సిందేనని నిశ్చయానికి వచ్చేశారు.
     
    ఇక అంతేనా...:జిల్లాలో బుధవారం జరిగిన పోలింగ్ తీరు టీడీపీ పెద్దలకు షాకి చ్చిందన్నది వాస్తవం. కనీసం తమకు గౌరవప్రదమైన సంఖ్యలో సీట్లయినా వస్తాయనుకుంటే అదీ ఎండమావేనని తేలడంతో వారు విస్తుపోతున్నారు. ఎక్కడికక్కడ గ్రామీణ ఓటర్లు, పట్టణ యువత వైఎస్సార్‌సీపీ వైపు మొగ్గుచూపినట్లు నిఖార్సుగా తేలడంతో తలపట్టుకుంటున్నారు. దీంతో బుధవారం సాయంత్రం నుంచే నిరాశలో మునిగిపోయారు. పోలింగ్   తర్వాత ఆపార్టీ అభ్యర్థులెవరూ కనీసం గెలుస్తామని కూడా నమ్మకంగా చెప్పలేకపోయారు. మరోవైపు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు మాత్రం సంబరాలు చేసుకున్నారు. టీడీపీ ఎన్ని కుయుక్తులు పన్నినా, ఎంత డబ్బు వెదజల్లినా ఓటర్లు ఫ్యాన్ మీట నొక్కడంతో జోష్‌తో ఉన్నారు.
     
    కోట్లే కోట్లు.. : అనకాపల్లిలో ఎలాగైనా గెలవాలన్న ధ్యేయంతో అక్కడి టీడీపీ అభ్యర్థి పీలాగోవింద్ రూ. 25 కోట్లకుపైగా ఖర్చుచేశారని ప్రచారం జరిగింది. గాజువాకలోనూ పీలావర్గం పచ్చ నోట్లు కుమ్మరించిందని గుప్పుమంటోంది. భీమిలిలో గంటా ఎన్ని కోట్లు ఖర్చుచేశారో కూడా అంచనావేయలేని పరిస్థితి ఉంది. విశాఖ తూర్పు, దక్షిణం, ఉత్తరం, పశ్చిమ నియోజకవర్గాల్లో అభ్యర్థులు విజయం కోసం అన్ని రకాలుగా ప్రలోభపెట్టడానికి ప్రయత్నించారు. దాదాపు టీడీపీ అభ్యర్థులంతా ఓటర్లను తమవైపునకు తిప్పుకోవడానికి కోట్లకు కోట్లు వెచ్చించారు.

    చివరకు పోలింగ్ రోజు ముందు రాత్రి జిల్లా అంతటా సుమారు రూ.40 కోట్ల వరకు ఖర్చు చేశారని అనుకుంటున్నారు. నియోజకవర్గానికి పార్టీ నుంచి వచ్చిన రూ.10 కోట్లనుసైతం పంచేశారు. ఇన్నిచేసినా టీడీపీకి మాత్రం ఓటర్లు షాక్ ఇవ్వడంతో తమ్ముళ్లు బిత్తరపోతున్నారు. ఎన్ని స్థానాలు వస్తాయని పైనుంచి అడుగుతున్నా జిల్లా నేతలు ఎవరికివారే తప్పించుకు తిరుగుతున్నారు.

    చివరకు పార్టీ గ్రామీణ అధ్యక్షుడు గవిరెడ్డిరామానాయుడు, నగర అధ్యక్షుడు వాసుపల్లి కూడా విజయంపై ఆశలు వదిలేసుకున్నట్టేనని సొంత పార్టీనేతలే విశ్లేషిస్తున్నారు. ఏజెన్సీలో పాడేరు,అరకులోనూ మూడోస్థానానాకి దిగజారిపోవడంతో అక్కడ టిక్కెట్‌రాని నేతలు పార్టీ దుస్థితిని చూసి నవ్వుకుంటున్నారు. చంద్రబాబు మరింతగా ప్రచారం చేసి ఉంటే సమైక్యాంధ్రకు ద్రోహం చేసినందుకు ఆపాటి ఓట్లు కూడా వచ్చేవి కావని కొందరు పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు.
     

Advertisement
Advertisement