దళితులపై విషం చిమ్మారు | Sakshi
Sakshi News home page

దళితులపై విషం చిమ్మారు

Published Tue, Apr 9 2019 11:45 AM

TDP Government Not Implemented Welfare Schemes Properly - Sakshi

ఒంగోలు టూటౌన్‌: రాష్ట్రంలో 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల సంక్షేమం కాగితాలకే పరిమితమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని విధాలుగా దళితులను దగా చేశారు. అంతటితో ఆగకుండా అడుగడుగునా అవమానించారు. ‘ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు’ అంటూ స్వయంగా చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించగా, ‘మాదిగ నా....లు అసలు చదవరు’ అంటూ టీడీపీ నాయకుడు, ఆర్టీసీ చైర్మన్‌ వర్ల రామయ్య మాట్లాడి వారి మనోభావాలను దెబ్బ తీశారు. ఇంకా రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాం తాల్లో దళితులపై దాడులు చేశారు. వారి సంక్షేమానికి చెందిన పథకాలన్నింటినీ నిర్వీ ర్యం చేశారు. ఇవన్నీ వెరసి ఐదేళ్లుగా దళితుల అభివృద్ధిపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపాయి.

ఉచిత వ్యవసాయ బోర్ల పథకం అమలైతే ఒట్టు..!
జిల్లాలో వ్యవసాయ భూమి ఉన్న ఎస్సీ రైతులకు ఉచితంగా వ్యవసాయ బోరుతో పాటు విద్యుత్‌ సౌకర్యం కల్పించాలి. ఉచిత వ్యవసాయ బోర్ల పథకం ఎప్పటి నుంచో అమలవుతోంది. కానీ, టీడీపీ హయాంలో ఈ పథకంపై ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో ప్రచారం కూడా లేదు. చాలా మంది రైతులకు దరఖాస్తు ఎలా చేసుకోవాలో కూడా తెలీదు. ఈ పథకం కార్పొరేషన్‌ కార్యాలయం గడపదాటిన దాఖలాలు లేవు. ఫలితంగా పేదలకు ప్రవేశపెట్టిన ఈ పథకం కొన్నేళ్లుగా కాగితాలకే పరిమితమైంది.

కాగితాలకే పరిమితమైన భూమి కొనుగోలు పథకం...
దళితులలో సొంత వ్యవసాయ భూమి లేని పేదలకు భూమి కొనుగోలు చేసి ఇచ్చే పథకం ఎంతో కాలంగా కొనసాగుతోంది. అయితే, ఈ పథకం కింద ప్రభుత్వం నిధులు కేటాయించిందని చెబుతోంది. భూమి లేని పేదలు వందల సంఖ్యలో దరఖాస్తు కూడా చేసుకున్నారు. కానీ, గడిచిన ఐదేళ్లలో ఎంతమంది పేదలకు భూమి కొనిచ్చారో కూడా చెప్పలేని పరిస్థితి టీడీపీ ప్రభుత్వానిది. అధికారులు మాత్రం భూమి కొనుగోలు పథకం కింద అక్కడక్కడా రైతులు అమ్ముతామన్న భూమిని పరిశీలించినట్లు చెప్పుకొస్తున్నారు మినహా కొనుగోలు చేసి దళితులకు పంచామని చెప్పిన దాఖలాలు లేవు.

అస్తవ్యస్తంగా ఎస్సీ కార్పొరేషన్‌...
జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్‌ అస్తవ్యస్తంగా తయారైంది. గత ఐదేళ్లుగా ఒక్క రెగ్యులర్‌ ఈడీని కూడా ఇక్కడ నియమించలేదు. ఇన్‌చార్జిల పాలనలో కార్పొరేషన్‌ కార్యకలాపాలు పూర్తిగా గాడితప్పాయి. ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా ఏటా అమలు చేస్తున్న బ్యాంకు లింకేజీ రుణాలలో గతేడాది యూనిట్లలో కోత పెట్టారు. రూ.2 లక్షలున్న యూనిట్లను నిబంధనలకు విరుద్ధంగా లక్షకు కుదించారు. అంతేగాకుండా కుదించిన యూనిట్లకు సబ్సిడీ కూడా నేటికీ చాలామందికి బ్యాంకులో జమకాలేదు. యూనిట్లను కుదించడంతో ఎస్సీ లబ్ధిదారులు తీవ్రంగా నష్టపోయారు. దీనికితోడు ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ, ఎన్‌ఎస్‌కేఎఫ్‌డీసీ రుణాలకు ఇంటర్వ్యూలు నిర్వహించి లబ్ధిదారుల జాబితాను ప్రకటించకుండా కాలయాపన చేశారు. దీంతో మూడు నెలలుగా రుణాల కోసం ఎదురు చూసిన లబ్ధిదారులు చివరకు ఆశలు వదిలేసుకున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ రావడంతో లబ్ధిదారుల జాబితాను ప్రకటించకుండా పక్కన పడేశారు.

ఆడిటోరియం నిర్మాణాన్ని అడ్డుకున్న ఎమ్మెల్యే దామచర్ల...
ఒంగోలు నగరంలో దళిత సంఘాలు పోరాడి సాధించుకున్న ఆడిటోరియాన్ని నిర్మించకుండా స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ అడ్డుకోవడాన్ని ఇప్పటికీ దళితులు జీర్ణించుకోలేకపోతున్నారు. స్థానిక డీఆర్‌ఆర్‌ఎం హైస్కూల్‌ వెనుక భాగంలో ఉన్న స్థలాన్ని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ పేరుపై ఆడిటోరియం నిర్మాణానికి కాంగ్రెస్‌ ప్రభుత్వ హయంలో కేటాయించారు. నిధులు కూడా ఇవ్వడంతో దాని నిర్మాణానికి అప్పటి కలెక్టర్‌ విజయకుమార్, సాంఘిక సంక్షేమ శాఖామంత్రి రావెల కిషోర్, తదితరులు శంకుస్థాపన కూడా చేయబోయారు. కానీ, ఒంగోలు ఎమ్మెల్యే అక్కడకు చేరుకుని మంత్రిని బెదిరించి ఆడిటోరియం శంకుస్థాపనను అడ్డుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాని జోలికి ఎవరూ వెళ్లలేదు. స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌కు దళితులంటే ఎంత చులకనో దీన్నిబట్టే అర్థమవుతోందని దళిత సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.

ఎస్సీ హాస్టల్‌ విద్యార్థులకు గూడు కరువు...

ఎస్సీ కార్పొరేషన్‌ కార్యాలయం

గత 25 సంవత్సరాలుగా జిల్లా కేంద్రంలోని ఓ ఎస్సీ కళాశాల హాస్టల్‌కు సొంత భవనం లేదు. ఏళ్ల తరబడి అద్దె భవనంలో పేదపిల్లలు పడరాని పాట్లు పడుతున్నారు. అద్దె భవనంలో కనీస సదుపాయలు కూడా లేవు. కానీ, స్థానిక ఎమ్మెల్యేగానీ, కలెక్టర్‌గానీ పట్టించుకున్న దాఖలాలు లేవు.

దళిత, గిరిజనులపై పెరిగిన దాడులు...
తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులు, గిరిజనులపై దాడులు హెచ్చుమీరాయి. పశ్చిమ గోదావరి జిల్లా గరగపర్రులో ఊరి మధ్యలో అంబేడ్కర్‌ విగ్రహం పెట్టినందుకు దళితులను సామాజికంగా వెలివేశారు. మన జిల్లాలోని దేవరపల్లిలో నీరు–చెట్టు పేరుతో దళితుల భూములను లాక్కుని తిరిగి వారిపైనే దాడులకు తెగబడ్డారు. తూర్పుగోదావరి జిల్లా పాత తుంగపాడు గ్రామానికి చెందిన పేద దళితుడి భూమిని టీడీపీ నాయకులు కబ్జా చేసి అతని మృతికి కారణమయ్యారు. దొమ్మేరులో అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు వివాదమైంది. రాజమండ్రిలో క్రిస్టియన్ల సమాధుల విషయంలోనూ దళితులపై దాడులు జరిగాయి. విశాఖ జిల్లాలోని జెర్రిపోతులపాలెంలో దళిత మహిళను వివస్త్రను చేసి కొట్టిన సంఘటన ఆందోళన కలిగించింది.

దళితుల దరిచేరని ఉచిత బోర్ల పథకం
జిల్లాలో దళితులకు ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన ఉచిత వ్యవసాయ బోర్ల పథకం నిర్వీర్యమైంది. ఈ పథకం అసలు అమలవుతుందో.. లేదో కూడా ఎవ్వరికీ తెలీదు. పేదలైన దళితుల కోసం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని కార్యాలయానికే పరిమితం చేశారు. ఎవరైనా ఈ పథకం కింద దరఖాస్తు చేసుకుంటే లబ్ధిదారులు కార్యాలయం చుట్టూ తిరిగి వేసారి పోవాల్సిందే.
– డాక్టర్‌ నవీన్, ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ యూనిట్‌ లబ్ధిదారుడు

టీడీపీకి తగిన బుద్ధి చెప్పాలి
రాష్ట్రంలోని దళిత, గిరిజనులందరూ వైఎస్సార్‌ సీపీకి ఓట్లేసి టీడీపీకి బుద్ధి చెప్పాలి. చంద్రబాబుని ఇంటికి సాగనంపకపోతే రానున్న రోజుల్లో దళిత, గిరిజనులపై మరిన్ని దాడులు జరుగుతాయి. ఇంట్లో ఉన్నా రక్షణ ఉండదు. దళిత, గిరిజనులంతా ఓటేసే ముందు ఈ విషయంపై ఆలోచించాలి.
– చప్పిడి రవిశంకర్, దళిత హక్కుల పోరాట సంఘ జిల్లా అధ్యక్షుడు

ఎస్సీ కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేశారు
గడిచిన ఐదేళ్లలో జిల్లాలోని ఎస్సీ కార్పొరేషన్‌ అస్తవ్యస్తంగా తయారైంది. రెగ్యులర్‌ ఈడీని నియమించకుండా ఇతర శాఖల అధికారులను ఇన్‌చార్జిలుగా నియమించడంతో కార్పొరేషన్‌ కార్యాలయంలో పాలన గాడితప్పింది. దీంతో బ్యాంకు లింకేజీ రుణాలు, ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ, ఎన్‌ఎస్‌కేఎఫ్‌డీసీ రుణాల మంజూరులో అవకతవకలు జరిగాయి. ఒక ఇన్‌చార్జి ఈడీ సస్పెండ్‌ కూడా అయ్యారు.
– మిట్నసల బెంజిమెన్, అంబేడ్కర్‌ పీపుల్స్‌ జేఏసీ నాయకుడు

ఆడిటోరియం నిర్మాణాన్ని అడ్డుకున్నారు
డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆడిటోరియంకు కాంగ్రెస్‌ ప్రభుత్వ హయంలో రూ.7 కోట్ల నిధులతో పాటు స్థలం కూడా కేటాయించారు. కానీ, టీడీపీ వచ్చిన తర్వాత ఆడిటోరియం నిర్మించకుండా అడ్డుకున్నారు. జిల్లాలో గతంలో పనిచేసిన కలెక్టర్‌ విజయకుమార్, అప్పటి సాంఘీక సంక్షేమ శాఖామంత్రి రావెల కిషోర్‌బాబు ఆడిటోరియంకు శంకుస్థాపన చేస్తున్న సమయంలో ఒంగోలు ఎమ్మెల్యేదామచర్ల జనార్దన్‌ అడ్డుపడ్డారు. 
– ఎం.చైతన్యప్రసాద్, దళిత నాయకుడు 

Advertisement
Advertisement