చేనేతకు ఆ'ధార'మేదీ..? | Sakshi
Sakshi News home page

చేనేతకు ఆ'ధార'మేదీ..?

Published Sat, Mar 16 2019 12:35 PM

TDP Government Not Supported To Handloom Industry - Sakshi

నిర్వీర్యమైన చేనేత రంగానికి పూర్వ వైభవం తెస్తామని అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం చేనేత రంగం పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తోంది. నాలుగేళ్ల క్రితం ఇచ్చిన చేనేత రుణమాఫీ సక్రమంగా నేటికీ చాలామందికి అమలు చేయకపోగా చివరకు ఆప్కోకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకుండా దగాకోరు విధానాన్ని అవలంబిస్తోంది. టీడీపీ ప్రభుత్వ తీరుతో చేనేతల పరిస్థితి దయనీయంగా మారింది.

సాక్షి, చీరాల(ప్రకాశం): చేనేతల స్థితిగతులు నానాటికీ దిగజారుతున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యంతో చేనేతల సంక్షేమం గాలిలో దీపంలా మారింది. జిల్లాలో 33,184 వేల మగ్గాల వరకు ఉండగా 24 వేల చేనేత కుటుంబాల వారు ఉన్నారు. చేనేత రంగంపై లక్షా అరవై వేల మంది చేనేతలు పరోక్షంగా ఆధారపడ్డారు. జిల్లాలో 70కి పైగా ఆప్కో సొసైటీలు ఉండగా ఒక్క చీరాలలోనే 50 వరకు ఈ సంఘాలు పని చేస్తున్నాయి. జిల్లాలో చేనేత వస్త్రాల ఉత్పత్తి నెలకు రూ.7 కోట్ల వరకు ఉన్నప్పటికీ అమ్మకాలు లేకపోవడంతో మాస్టర్‌ వీవర్ల వద్ద నిల్వలు భారీగా పేరుకుపోయాయి. ఒక్కో మాస్టర్‌వీవర్‌ వద్ద పది నుంచి ఇరవై లక్షలు విలువ చేసే చేనేత వస్త్రాలు నిల్వ ఉన్నాయని సమాచారం. వస్త్రాల ఉత్పత్తి పెరిగిపోతుండటం, కొనుగోళ్లు లేకపోవడం, ఆప్కో చేయూత అందించకపోవడంతో మాస్టర్‌వీవర్లు తమ వద్ద పనిచేసే చేనేత కార్మికులకు పని కూడా కల్పించక పూట గడుపుకోవడం కోసం అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సి వస్తుందని కార్మికులు వాపోతున్నారు.

కొరవడిన ప్రభుత్వ ప్రోత్సాహం
జిల్లాలో తయారయ్యే జరీకోట, గద్వాల్, అస్సాంపట్టు, కుప్పటం వంటి చేనేత వస్త్రాలకు రాష్ట్రంలోని విజయవాడ, హైదరాబాద్, గుంటూరు తదితర ప్రాంతాల్లో మంచి డిమాండ్‌ ఉంది. అందమైన చీరలను నేసేందుకు వినియోగించే పట్టు, జరీ తదితర నూలును ముంబాయి, సూరత్‌ నుంచి దిగుమతి చేసుకుంటారు. పెట్టుబడులు పెట్టి వస్త్రాలు తయారు చేయిస్తున్నప్పటికీ కొనుగోళ్లు లేక, ప్రభుత్వం ప్రోత్సాహకం ఇవ్వకపోవడం, ఆప్కో మాత్రం కనీస చర్యలు చేపట్టకపోవడంతో నేతన్నల పరిస్థితి కడు దయనీయంగా మారింది. చేనేతలను అన్ని విధాలా ఆదుకోవడంతో పాటు వారికి కావాల్సిన అన్ని రకాల ముడిసరుకులు, రంగు, నూలు, రసాయనాలు సబ్సిడీపై అందజేసి చేనేత వస్త్రాలను అమ్మకాలు చేసేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటామని హామీలు ఇచ్చిన టీడీపీ ప్రభుత్వ హామీలు బుట్ట దాఖలయ్యాయి. ఉత్పత్తిదారుల వద్ద నిల్వలు ఉన్న చేనేత వస్త్రాలను కొనుగోలు చేయాల్సిన ఆప్కో కనీసం ప్రత్యేక చర్యలను, కొనుగోళ్లకు సంబంధించి ఎటువంటి సూచనలు తీసుకోకపోవడం వల్ల నిల్వలు పేరుకుపోతూనే ఉన్నాయి.

కనీస వేతన చట్టానికీ కరువే...
కనీస వేతన చట్టం ప్రకారం ఒక కార్మికుడికి రోజుకు రూ.206 చెల్లించాల్సి ఉంటుంది. కానీ చేనేత కార్మికులకు కనీస వేతన చట్టం ప్రకారంగా కూడా కూలీలు అందడం లేదు. అయితే చేనేత మగ్గాలపై పీస్‌ వర్క్‌ చేస్తున్నారనే కారణంతో కూలీ ధరలు పరిగణించలేమని కార్మికశాఖ చేతులెత్తేసింది. దీంతో హోటల్‌లో పని చేసే స్వీపర్ల కంటే చేనేత కార్మికుడికి కూలీ తక్కువ. కనీస వేతన చట్టాన్ని అమలు చేసినా కార్మికులకు ప్రయోజనం ఉంటుంది. చేనేత “రిజర్వేషన్‌’కు చెల్లుచీటి: పరిశ్రమల ధాటికి ఈ రంగం కొట్టుకుపోయి, కార్మికులు రోడ్డున పడుతారన్న ఉద్దేశంతో 22 రకాల వస్త్రాలను చేనేత రంగానికి కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం చేసింది. పవర్‌లూమ్‌ పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం దానిని 1985లో 22 రకాలను కాస్త 11 రకాలకు కుదించింది. అయితే ఈ 11 రకాల వస్త్రాలు తయారు చేస్తే పూట గడుస్తుందని భావించిన కార్మికులు అందుకు అంగీకరించారు. చీరలు, లుంగీలు, పంచెలు, చేతిరూమాలు వంటివి తయారు చేస్తూ లక్షల మంది చేనేత రంగంపై ఆధారపడి ఉన్నారు. అయితే ప్రస్తుతం చేనేత రిజర్వేషన్‌ చట్టానికి పూర్తిగా తూట్లు పడటంతో మగ్గాలు మూలనపడుతున్నాయి. చేనేత రంగానికి కేటాయించిన 11 రకాల రిజర్వేషన్లను మరమగ్గాలపైనే తయారవుతున్నాయి. చేనేత వస్త్రాల మాటున జరుగుతున్న ఈ అక్రమ దందాను ఎవరూ అడ్డుకోలేకపోతున్నారు.

ఊహల్లోనే..ఉచిత విద్యుత్‌ హామీ
టీడీపీ ప్రభత్వుం ఇచ్చిన ఉచిత విద్యుత్‌ హామీ అమలైతే ఒక్కో చేనేత కుటుంబానికి నెలకు 100 యూనిట్లలోపు బిల్లు రూ.300 మినహాయింపు కలుగుతుంది. గృహ అవసరాలు, చేనేతలకు ఒకే శ్లాబు అమలులో ఉండగా వ్యాపార సముదాయాలు, బహుళ అంతస్తుల వారికి మరొక శ్లాబు ప్రకారం రేట్లను విద్యుత్‌శాఖ నిర్ణయించింది. అయితే జిల్లాలో కేవలం 7500 కుటుంబాలకు మాత్రమే ఉచిత విద్యుత్‌ అర్హులుగా చేసేలా చేనేతశాఖ అధికారులు సర్వే పూర్తిచేసి నివేదికలను ప్రభుత్వానికి అందించారు. కానీ పథకం మాత్రం అమలుకాకపోవడంపై నేతన్నలు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు.

చెయ్యిచ్చిన బాబు..చేయూత నిచ్చిన మహానేత వైఎస్‌ఆర్‌
సంక్షోభంలో చిక్కుకుని విలవిల్లాడుతున్న చేనేత రంగానికి 9 ఏళ్లు పరిపాలించిన చంద్రబాబు చేయూతనివ్వకపోగా చేతివృత్తులకు కాలం చెల్లిందని, ఆ వృత్తిని వదలి మరమగ్గాలవైపు వెళ్లండని ఉచిత సలహా ఒకటి పడేశారు. రాష్ట్రంలో ఉన్న నూలు మిల్లులు అన్నీ మూసివేశారు. కార్మికులకు ఉపాధి దెబ్బతినడంతో పాటు, చేనేత కార్మికులు ఇతర రాష్ట్రాల నుంచి నూలు కొనుగోలు చేయాల్సిరావడం ప్రస్తుతం పెను భారంగా మారింది. చంద్రబాబు పాలనలో వందల సంఖ్యలో చేనేత ఆత్మహత్యలు జరిగాయంటే చేనేత కార్మికుల పరిస్థితి ఏస్థాయికి వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు.

అదే వైఎస్సార్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత చేనేత రంగానికి చేయూతనిచ్చారు. రైతులకు మాదిరిగా చేనేతలకు రూ.312 కోట్లు రుణమాఫీ చేశారు. అప్పటి వరకు చిలపనూలుపై ఉన్న 9.25 ఎక్సైజ్‌ సుంకాన్ని రద్దు చేసి కార్మికులపై భారాన్ని తగ్గించారు. రంగు, రసాయనాలు, చిలపనూలుపై 10 శాతం సబ్సిడీ అవకాశం కల్పించారు. ఏరాష్ట్రంలో లేని విధంగా చేనేత కార్మికులకు 50 సంవత్సరాలకే పింఛన్‌ సౌకర్యం కల్పించారు. బలహీనంగా ఉన్న ఆప్కోకు నిధులు కేటాయించి పటిష్టపరిచారు. ఇదిలా ఉంటే మూడున్నరేళ్లపాటు ముఖ్యమంత్రిగా పాలించిన కిరణ్‌ చేనేతలకు ప్రత్యేక పరపతి బ్యాంకు ఏర్పాటు చేస్తానని ఇచ్చిన హామీని నెరవేర్చకుండానే పదవి నుంచి దిగివెళ్లారు.

రుణాలకు మొండికేస్తున్న బ్యాంకర్లు
చేనేతలకు రుణాలు మంజూరు చేసేందుకు బ్యాంకర్లు ససేమిరా అంటున్నారు. చీరాల ప్రాంతంలో కార్మికులకు ప్రభుత్వం ఎనిమిది వందల మందికి పైగా అర్టిజన్‌ క్రెడిట్‌ కార్డులను మంజూరు చేసింది. కానీ వాటి ద్వారా బ్యాంకర్లు రుణాలు ఇవ్వడంలేదు. వ్యక్తిగత రుణాలు తిరిగి చెల్లించరనే ఉద్దేశంతో బ్యాంకర్లు కార్మికులకు రుణాలు ఇవ్వడంలేదు. ఈ కార్డుల ద్వారా రుణాలు తీసుకున్నట్లయితే ప్రభుత్వం నాలుగు శాతం రాయితీ ఇస్తుంది. బ్యాంకర్ల మొండి వైఖరి కారణంగా చేనేత రుణాలు అందని ద్రాక్షపండులా మారాయి.

చేనేతలను ఆదుకోవాలి
జిల్లాలో రోజురోజుకూ పేరుకుపోతున్న చేనేత వస్త్రాలను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. కోట్ల రూపాయల చేనేత వస్త్రాల నిల్వలను దశల వారీగానైనా ఆప్కో కొనుగోలు చేసేలా ప్రభుత్వం కృషి చేయాలి. కొనుగోళ్లు నిలిచిపోవడంతో కార్మికులకు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి. చేనేతలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తేనే నేతన్నల అభివృద్ధి.
- పడవల లక్ష్మణస్వామి, చేనేత కాంగ్రెస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు

1/1

కొనుగోళ్లు లేక పేరుకుపోయిన చేనేత వస్త్రాలు

Advertisement
Advertisement