మాఫీకి మరిన్ని ఆంక్షలు..! | Sakshi
Sakshi News home page

మాఫీకి మరిన్ని ఆంక్షలు..!

Published Tue, Aug 26 2014 3:09 AM

TDP government ready to make more restrictions on Loan waiver scheme

* ఈ ఏడాది జనవరి నుంచి మార్చిలోగా రుణాలు చెల్లించినవారికి మాఫీ వర్తించదు
* సహకార బ్యాంకుల్లో రుణాలు రెన్యువల్ చేసుకున్న 16.55 లక్షల రైతులకూ మొండిచేయి

 
సాక్షి, హైదరాబాద్: రుణమాఫీ భారాన్ని తగ్గించుకునేందుకు చంద్రబాబునాయుడు ప్రభుత్వం అన్నివిధాలా ప్రయత్నిస్తోంది. ఎక్కడికక్కడ కోతలు విధించిడం ద్వారా వీలైనంతమంది రైతుల్ని మాఫీ పరిధి నుంచి తప్పించేలా నిబంధనలు విధిస్తోంది. ఎన్నికల హామీ సందర్భంగా ఎటువంటి ఆంక్షలు విధంచకుండా మాఫీ చేస్తానని పేర్కొన్న చంద్రబాబు.. ఇప్పటికే కుటుంబానికి లక్షన్నర వరకు మాత్రమే మాఫీ అంటూ పరిమితి విధించారు. తర్వాత మరో అడుగు ముందుకేసి గత ఏడాది డిసెంబర్ వరకు తీసుకున్న రుణాలకే మాఫీ అన్నారు. ఈ ఏడాది మార్చి వరకు వడ్డీని మాత్రమే మాఫీ పరిధిలోకి తీసుకుంటామనే నిబంధన కూడా విధించారు.
 
 ఇంతటితో ఆగకుండా తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించిన రైతులకు, అలాగే సహకార బ్యాంకుల్లో రుణాలు తీసుకుని ఆ రుణాలను రెన్యువల్ చేసుకున్న రైతులకు మాఫీలో మొండిచేయి చూపించారు. రుణ మాఫీ మార్గదర్శకాల్లో ప్రభుత్వం పెట్టిన ఈ మెలిక ను చూస్తే.. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి నెలాఖరులోగా రుణాలు చెల్లించిన వారికి, అలాగే ఆ మధ్య కాలంలో రుణాలను రీ షెడ్యూల్ చేసుకున్న రైతులకు రుణ మాఫీ వర్తించదనే విషయం స్పష్టమైంది. ముఖ్యంగా ఈ నిబంధన సహకార బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న రైతుల పాలిట శాపంగా మారింది.
 
  సహకార బ్యాంకుల్లో రుణాలను రైతులు జనవరి నుంచి మార్చి నెల మధ్య కాలంలోనే రెన్యువల్ చేసుకున్నారని, అయితే ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్ వరకు గల రుణాలే మాఫీ పరిధిలోకి వస్తాయని పేర్కొనడంతో సహకార సంఘాల్లో రుణాలు తీసుకున్న 16,55,665 మంది రైతులకు చెందిన రూ.6,172 కోట్లు ఇప్పుడు మాఫీ పరిధిలోకి రావడం లేదని ఆప్కాబ్ అధికారులు తెలిపారు. గ్రామాల్లోని సహకార బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న రైతులకు మాఫీ వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని చెప్పారు. ఈ రైతులు తమ రుణాలను రెన్యువల్ చేసుకున్నందున జనవరి తర్వాత తీసుకున్న కొత్త రుణాలుగా మారిపోయాయని వివరించారు.

మరోపక్క వాణిజ్య బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న రైతులు జనవరి నుంచి మార్చి మధ్యకాలంలో రుణాలు చెల్లించేసి కొత్త రుణాలు తీసుకున్నారని, అలాంటి క్రమశిక్షణ కలిగిన రైతులు వేల సంఖ్యలో ఉంటారని, వారికి మాఫీ వర్తింప చేయకపోవడం అంటే క్రమశిక్షణను నిరుత్సాహపరచడమే అవుతుందని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. దీనిపై ప్రభుత్వం స్పందిస్తూ.. జనవరి నుంచి మార్చి మధ్యకాలంలో అనేక బ్యాంకులు ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధిక మొత్తంలో రైతులకు బంగారంపై వ్యవసాయ రుణాలను మంజూరు చేసిందని, ఈ నేపథ్యంలోనే ఆ కాలంలో రుణాలకు మాఫీ వర్తింప చేయడం లేదని పేర్కొంది. అయితే బంగారం రుణాలను మినహాయించి మిగతా పంట రుణాలు చెల్లించిన వారికి మాఫీ వర్తింప చేయూలని ఎస్‌ఎల్‌బీసీ కోరింది. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదని బ్యాంకర్లు తెలిపారు. రుణ మాఫీ సాధ్యమా కాదా అనే ఆలోచన లేకుండా హామీ ఇచ్చి ఇప్పుడు బ్యాంకర్లపై నిందలు మోపేలా ప్రభుత్వంలోని కొంతమంది వ్యవహరించడం శోచనీయమని వారు వ్యాఖ్యానిస్తున్నారు.

Advertisement
Advertisement