వసూళ్లకు వారసుడొచ్చాడు! | Sakshi
Sakshi News home page

వసూళ్లకు వారసుడొచ్చాడు!

Published Sun, Dec 21 2014 12:23 AM

TDP government rehabilitation transformations New look

బదిలీల జాతరకు టీడీపీ సర్కారు కొత్తరూపు తీసుకువచ్చింది. చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా రాష్ర్ట ప్రభుత్వం బదిలీల షెడ్యూల్‌ను  ఏడుసార్లు పొడిగించింది. దాదాపు మూడు నెలలపాటు సాగిన బది‘లీలల్లో’ రూ.కోట్లు చేతులు మారాయనేది అటు ఉద్యోగులకు, ఇటు ప్రజాప్రతినిధులకు తెలిసిన సత్యమే. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా జరిగిన అవసరార్థ బదిలీల్లో చాలామంది ప్రజాప్రతినిధులు అందినకాడికి వసూళ్లు చేసేశారు. సచివుల కంటే కూడా జిల్లాలో ఎక్కువగా హడావుడి చేస్తున్న ఓ ప్రజాప్రతినిధి ప్రతి పోస్టుకు ఓ రేటు పెట్టి మరీ ఈ మూడు నెలల కాలంలోనే రూ.కోట్లు వెనకేసుకున్నారని అంటున్నారు. అన్ని శాఖల కంటే ట్రాన్స్‌కో ఉద్యోగుల బదిలీల్లోనే పెద్దమొత్తంలో సొమ్ము చేతులు మారాయని తెలుస్తోంది. ఆ శాఖ ఉన్నతాధికారుల్లో ఒకరు రూ.18 లక్షలు ఇచ్చి పోస్టింగ్ తెచ్చుకున్నారని ప్రచారం సాగుతుండగా, మండల స్థాయిలోని అధికారులు ఒక్కొక్కరు రూ.5 లక్షల చొప్పున ఇచ్చి కోరుకున్న చోటుకు బదిలీపై వెళ్లారని అంటున్నారు.
 
 ట్రాన్స్‌కోకు చెందిన షిఫ్ట్ ఆపరేటర్ల నియామకాలు కొందరు ప్రజాప్రతినిధులకు కాసుల వర్షం కురిపించాయని అంటున్నారు. భీమడోలులోని ఓ సబ్‌స్టేషన్‌లో షిఫ్ట్ ఆపరేటర్ పోస్టు కోరుకున్న దెందులూరుకు చెందిన ఓ అభ్యర్థి నుంచి ఏకంగా రూ.5.50 లక్షలను ఓ ప్రజాప్రతినిధి తీసుకున్నట్టు బాహాటంగానే చెబుతున్నారు. ట్రాన్స్‌కో సిబ్బంది బదిలీల విషయంలో ఇరువురు ప్రజాప్రతి నిధుల మధ్య విభేదాలు కూడా తలెత్తారుు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని అధికారుల బదిలీ విషయంలోనూ టీడీపీ సీనియర్ నేత జోక్యం చేసుకోవడంపై ఆ ప్రజాప్రతినిధి తీవ్ర అసహనం వ్యక్తం చేశారట. దీంతో ఆ నియోజకవర్గంలోని సబ్‌స్టేషన్లలో ఉన్న 24 షిఫ్ట్ ఆపరేటర్ పోస్టు లు భర్తీకాక ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయి.  తాజాగా ఇద్దరూ రాజీపడి చెరో 12 పోస్టులు పంచుకుని జాబితాను ఓకే చేసేందుకు సిద్ధమైనట్టు భోగట్టా.
 
 ఇక బదిలీల పర్వంలో ఓ సీనియర్ ప్రజాప్రతినిధి కుమారుడు అందినకాడికి వసూళ్లు చేసినట్టు అధికారపార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. దశాబ్దాల కాలంగా రాజకీయాల్లో కొనసాగుతున్న సదరు టీడీపీ సీనియర్ నేత కుటుంబంపై వాస్తవానికి వసూళ్ల మచ్చ ఇప్పటివరకు లేదు. అధికారం దన్ను తో వ్యాపారాల విస్తరణపైనే దృష్టి సారించే కుటుం బంగా వారికి పేరుంది. మారిన రాజకీయ పరిస్థితులో లేక ఆర్థికపరమైన ఒత్తిళ్లో తెలీదుకానీ ఆ కుటుంబం నుంచి రాజకీయ వారసుడిగా హడావుడి చేస్తున్న ప్రజాప్రతినిధి కుమారుడు మాత్రం వసూళ్లకు దిగుతున్నాడట. నయా వసూల్ రాజా దూకుడు చూసి.. రాజకీయాలకేమో గానీ వసూళ్లకు మాత్రం కొత్తగా వారసుడొచ్చాడు అని సదరు నేత అనుచరులే వ్యాఖ్యానిస్తున్నారట.
 
 ఐఏఎస్‌లపై యుద్ధానికి సై.. మరి పాలకులపై...
 ‘ఏయ్.. నువ్వు చెబితే మేం తెలుసుకోవాలా. నువ్వేంటి. మాకు చెప్పకుండా ఎలా సెలవు తీసుకుంటావ్. ఏంటిది’ ఇవేవో భూస్వాములు తమ వద్ద చేస్తున్న పాలేర్లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కాదు. జిల్లాలోని వివిధ శాఖల ఉన్నతాధికారులపై అధికారిక, అనధికారిక సమావేశాల్లో టీడీపీ ప్రజాప్రతినిధులు నోరుపారేసుకుంటున్న తీరిది. కొన్ని సందర్భాల్లో అధికారులను కనీసం కూర్చోమని కూడా అనకుండా నిలబెట్టే  సమీక్షలు చేస్తున్నా ఎవరూ నోరుమెదపలేని పరిస్థితి నెలకొంది. ఇటీవల జరిగిన అధికారిక సమావేశంలో ఓ ప్రజాప్రతినిధి అధికారులను ఉద్దేశించి ‘మీలో చాలామంది కొత్తగా వచ్చారు. మమ్మల్ని కలవాలన్న జ్ఞానం కూడా లేదా. ఏం..’ అని తన సహజ శైలిలో రెచ్చిపోయారు. సదరు ఎమ్మెల్యే నోటి దురుసుకు హడలెత్తిపోరుున  వ్యవసాయ శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి లేచి ‘సారీ సార్.. అందర్నీ కలవాలని నాకు తెలీదు. నియోజకవర్గాల వారీగా వ్యవసాయ ప్రణాళిక తయారు చేసుకుని మిమ్మల్ని కలవాలనుకున్నాను. ఇకముందు అందర్నీ వ్యక్తిగతంగా కలుస్తాను సార్’ అని వినమ్రంగా విన్నవించుకున్నారంటే జిల్లాలో అధికారులు, ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈనెల తొలినాళ్లలో జిల్లాలోని ఐఏఎస్‌లపై తిరుగుబాటుతో హల్‌చల్ చేసిన అధికారులు, ఉద్యోగులు ఇప్పుడు చీటికీ మాటికీ నోరు పారేసుకుంటున్న ప్రజాప్రతినిధులపైనా అదేస్థాయిలో ప్రతాపం చూపించగలరా లేక ‘అయ్యా.. ఎస్’ అంటూ కాలం వెళ్లదీసి సమయం కోసం వేచి చూస్తారా. ఏమో... కాలమే నిర్ణయించాలి మరి.
 - జి.ఉమాకాంత్, సాక్షి ప్రతినిధి, ఏలూరు
 

Advertisement
Advertisement