కిలోమీటర్‌కు 17.23 కోట్లు! | Sakshi
Sakshi News home page

కిలోమీటర్‌కు 17.23 కోట్లు!

Published Fri, Sep 1 2017 1:47 AM

కిలోమీటర్‌కు 17.23 కోట్లు! - Sakshi

రాజధాని రహదారుల నిర్మాణంలో సర్కార్‌ మరో మాయాజాలం
98 కిలోమీటర్ల నాలుగు లేన్ల రహదారుల అంచనా వ్యయం రూ.1520.28 కోట్లు
రూ.3 కోట్ల ఖర్చుతో కిలోమీటర్‌ మేర జాతీయ రహదారి నిర్మాణం
వర్షం నీటి పైపులు, విద్యుత్‌ కేబుల్‌ పనుల ఖర్చు కలిపినా రూ.5 కోట్లు దాటదంటున్న నిపుణులు
అమరావతిలో మాత్రం సప‘రేటు’పై అధికారుల విస్మయం
ఈపీసీ విధానంలో టెండర్లను ఆహ్వానించిన ఏడీసీ


సాక్షి, అమరావతి: నూతన రాజధాని ముసుగులో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఏ పనులకైనా చుక్కలనంటేలా భారీ అంచనాలను రూపొందిస్తోంది. తాత్కాలిక రాజధాని నిర్మాణంలో చదరపు అడుగుకు 6,020 రూపాయల వ్యయం చేసిన సర్కారు.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్‌ల నివాస ప్లాట్లకు ఏకంగా ఒక్కో ప్లాట్‌కు 1.40 కోట్ల రూపాయలను అంచనాగా పేర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా తాత్కాలిక సచివాలయం నుంచి ప్రభుత్వ భవనాల శాశ్వత నిర్మాణాల వరకు సబ్‌ ఆర్టీరియల్‌ (ఎక్కువ ట్రాఫిక్‌ సామర్థ్యం) రహదారుల నిర్మాణాలకు అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏడీసీ) అదే రీతిలో అంచనాలు తయారు చేసింది. వర్షం నీరు, విద్యుత్‌ కేబుల్, మంచినీటి పైపులతో సహా 98.77 కిలో మీటర్ల మేర నాలుగు లేన్ల రహదారుల నిర్మాణానికి ఏకంగా రూ.1520.28 కోట్ల అంచనాగా రూపొందించింది.

మూడు ప్యాకేజీలుగా ఈ రహదారుల నిర్మాణాలకు ఇంజినీరింగ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌ (ఈపీసీ)లో టెండర్లను ఆహ్వానించింది. ఈ రహదారుల అంచనాలను చూసి అధికార వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. సాధారణంగా నాలుగు లేన్ల జాతీయ రహదారులకు కిలో మీటర్‌కు (సర్వీసు రోడ్లతో సహా) మూడు కోట్ల రూపాయల వ్యయం అవుతుందని ఇంజనీరింగ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. వర్షం నీరు, మంచి నీరు, విద్యుత్‌ కోసం వేర్వేరుగా పైప్‌లైన్లు, కేబుల్‌ వేసినప్పటికీ కిలో మీటర్‌కు 5 కోట్ల రూపాయలకు మించి వ్యయం కాదని చెబుతున్నారు. అలాంటిది సగటున కిలో మీటర్‌కు 17.23 కోట్ల రూపాయల మేర అంచనాలను రూపొందించడం పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

ప్యాకేజీ నంబర్‌ 8 :  
22.93 కిలోమీటర్ల మేర నాలుగు లేన్ల సబ్‌ ఆర్టీరియల్‌ రహదారి అంచనా వ్యయం (ఇంటర్నల్‌ బెంచ్‌ మార్క్‌) రూ.435.20 కోట్లు. అంటే ఒక్కో కిలోమీటర్‌కు రూ.18.97 కోట్లు.

ప్యాకేజీ నంబర్‌ 9 :
40.23 కిలోమీటర్ల మేర నాలుగు లేన్ల సబ్‌ ఆర్టీరియల్‌ రహదారి అంచనా వ్యయం రూ.514.28 కోట్లు. అంటే కిలోమీటర్‌ రహదారి నిర్మాణానికి రూ.12.18 కోట్లు.

ప్యాకేజీ నంబర్‌ 10 :
28.60 కిలో మీటర్ల మేర నాలుగు లేన్ల సబ్‌ ఆర్టీరియల్‌ రహదారి అంచనా వ్యయం రూ.570.80 కోట్లు. అంటే ఒక్కో కిలో మీటర్‌ నిర్మాణానికి రూ.19.95 కోట్లు. (మూడు ప్యాకేజీల పరిధిలో 7 కిలోమీటర్ల మేర లింకు రోడ్లతో కలిపి)

ప్రతి పనిలోనూ ఇదే తంతు!
రాష్ట్ర ప్రభుత్వం ఏ పని చేపట్టినా అంతిమ లక్ష్యం కమీషన్లే. అందువల్లే అదిరిపోయే ధరలను ఖరారు చేస్తోంది. ఇష్టానుసారం పనుల అంచనాలను పెంచేస్తూ.. కావాల్సిన సంస్థలకు ఆ పనులు వచ్చేలా టెండర్ల నిబంధనలను రూపొందిస్తోంది. ఆ తర్వాత ఆ పనులు దక్కించుకున్న సంస్థలు ముందే చేసుకున్న ఒప్పందం మేరకు ‘ముఖ్య’ నేతకు కమీషన్లు అంద జేస్తాయి. దాదాపు ప్రతి పనిలోనూ ఇదే తంతు. తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి చదరపు అడుగుకు 6,020 రూపాయలను వ్యయం చేసినప్పటికీ ఎక్కడా నాణ్యత లేదని, ఆ భవనాల నుంచి వర్షం నీరు కారు తుండటంతో ఇప్పుడు మళ్లీ మరమ్మతులు చేస్తుండటం ప్రత్యక్ష ఉదాహరణ అని ఓ అధికారి వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement