దేశంలో సిగపట్లు | Sakshi
Sakshi News home page

దేశంలో సిగపట్లు

Published Sun, Feb 2 2014 2:07 AM

దేశంలో సిగపట్లు - Sakshi

  సాక్షి ప్రతినిధి, గుంటూరు :జిల్లా దేశంలో నేతల మధ్య అంతర్గత పోరు పెచ్చుమీరుతోంది. ఎవరికి వారే తమ ఆధిపత్యాన్ని పెంచుకునేందుకు పావులు కదుపుతూ కార్యకర్తలను గందరగోళ స్థితికి నెట్టేస్తున్నారు. కాంగ్రెస్ నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తూ బాబు ద్వారా సీట్లు కేటాయిస్తామంటూ ఆశలు రేపుతున్నారు. జిల్లాలో దాదాపు ఐదారు నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఎదురవుతుండటంతో అక్కడి ఆశావహుల్లో అలజడి రేగుతోంది. చిలకలూరిపేటనుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావుకు పోటీగా కాంగ్రెస్ తరఫున గుంటూరు చందనాస్ ఆస్పత్రి అధినేత డాక్టర్ అలపర్తి లక్ష్మయ్య, సత్తెనపల్లినుంచి గత ఎన్నికల్లో పీఆర్‌పీ తరఫున పోటీ చేసి ఓటమిపాలైన బైరా దిలీప్‌చక్రవర్తితోపాటు మరికొందరి పేర్లు వినబడుతున్నాయి. 
 
 దిలీప్ బరిలో నిలిస్తే తనకు నష్టం తప్పదని గ్రహించిన ప్రత్తిపాటి ‘బాబు’ వద్ద తన పలుకుబడిని ఉపయోగించి బైరా దిలీప్‌కు సత్తెనపల్లి, చిలకలూరిపేట నియోజకవర్గాల్లో ఎక్కడో ఒక చోట సీటు ఇప్పించే యత్నాలు చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. ఈ విధంగా మాజీ మంత్రి కోడెల శివప్రసాద్‌కు చెక్ పెట్టాలని ఆయన భావిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ తరఫున చిలకలూరిపేట నుంచి పోటీ చేస్తానని చెప్పిన దిలీప్ ఇప్పుడు ఆ ఆలోచన విరమించుకున్నానని సత్తెనపల్లి నుంచి టీడీపీ తరఫున పోటీ చేస్తానని సన్నిహితులకు చెబుతున్నారు. దీనిపై సాక్షి ప్రతినిధి ఆయనతో మాట్లాడగా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చిలకలూరిపేట సీటుపై హామీ ఇచ్చినా పోటీ చేసే ఆలోచన లేదని చెప్పినట్టు తేల్చి చెప్పారు.
 
 ఈ వ్యవహారంతో సత్తెనపల్లిపై ఆశలు పెట్టుకున్న నియోజకవర్గ దేశం ఇన్‌చార్జి నిమ్మకాయల రాజనారాయణ, మాజీ మంత్రి కోడెల శివప్రసాద్, ఎమ్మెల్యే వై.వి.ఆంజనేయులు, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు మన్నెం శివనాగమల్లేశ్వరరావుల్లో ఆందోళన మొదలైంది. రేపల్లె నియోజకవర్గ దేశం ఇన్‌ఛార్జి అనగాని సత్యప్రసాద్ అక్కడ చురుకుగా పనిచేస్తున్నా సినీనటుడు సుమన్‌ను బరిలోకి దింపేందుకు పలువురు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. సినీనటుడు బాలకృష్ణతోపాటు పార్టీ నాయకుడు కేశన శంకరరావు సైతం సుమన్ కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక రాజ్యసభ సభ్యుడైన సుజనా చౌదరి మాత్రం ఈ స్థానాన్ని కమ్మ సామాజికవర్గానికి చెందిన దేవినేని మల్లిఖార్జునరావుకు కేటాయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.
 
  తాడికొండ నియోజకవర్గం నుంచి గతంలో పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైన శ్రావణ్‌కుమార్‌కు వ్యతిరేకంగా అక్కడి సీనియర్లు కొందరు పావులు కదుపుతున్నారు. ఆయనకు ఎట్టిపరిస్థితుల్లోనూ టికెట్ ఇవ్వవద్దని మాజీ మంత్రి పుష్పరాజ్ వర్గం అధినేతపై ఒత్తిడి తీసుకువస్తోంది. తమ నాయకుడు పుష్పరాజ్‌కే ఇవ్వాలని పట్టుపడుతోంది. దీనిపై వారంతా ఇటీవల గుంటూరులో సమావేశంలో నిర్ణయించుకున్నారు కూడా. పార్టీలోని సీనియర్లు చెరో వర్గానికి మద్దతుగా నిలవడంతో చంద్రబాబు వద్ద సెక్యూరిటీ అధికారి సమీప బంధువైన రవికిషోర్‌కు సీటు ఇప్పించేందుకు పార్టీ రాష్ట్ర కార్యాలయంలోని కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. 
 
  గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో అనేక మంది సీనియర్లు పార్టీ కోసం పనిచేస్తుంటే, కొందరు సీనియర్లు వారిని కాకుండా ఆర్థికవనరులు పుష్కలంగా ఉన్నవారిని తెరపైకి తీసుకువస్తున్నారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన హకీంకు తూర్పు సీటు ఖరారు కానుందని ఆయన్ను భుజాన వేసుకున్న కొందరు నేతలు చెబుతుంటే మరికొందరు వైశ్య సామాజికవర్గానికి చెందిన దేవరశెట్టి సుబ్బారావు పేరును తెరపైకి తీసుకువచ్చారు. బాపట్ల, మంగళగిరి నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితులు కనపడుతుండటంతో కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు.
 

Advertisement
Advertisement