యల్లమందలో టీడీపీ దాష్టీకం | Sakshi
Sakshi News home page

యల్లమందలో టీడీపీ దాష్టీకం

Published Tue, Aug 19 2014 12:29 AM

యల్లమందలో టీడీపీ దాష్టీకం - Sakshi

యల్లమంద (నరసరావుపేట రూరల్) : అధికార తెలుగుదేశం  పార్టీ నాయకుల ఆగడాలకు అంతేలేకుండాపోతోంది. అదను దొరికితే వైఎస్సార్ సీపీ నాయకులపై అకారణంగా దాడులకు దిగుతూ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఎన్నికలు ముగిసి మూడు నెలలవుతున్నా టీడీపీ వర్గీయులు అకారణంగా వైఎస్సార్ సీపీ శ్రేణులపై దాడులకు తెగబడుతూనే ఉన్నారు. తాజాగా  అధికార టీడీపీ నాయకులు మారణాయుధాలు, గొడ్డళ్లతో వైఎస్సార్ సీపీ నాయకులపై దాడికి పాల్పడిన ఘటన యల్లమంద గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు వైఎస్సార్ సీపీ నాయకులు గాయపడ్డారు.
 
సేకరించిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకులు ముప్పాళ్ళ కృష్ణారావు, ముప్పాళ్ళ లక్ష్మయ్య, చల్లా వెంకటేశ్వర్లు తమ బంధువు ములసా వెంకటేశ్వర్లు ఇంట్లో జరిగే శుభకార్యానికి ద్విచక్ర వాహనంపై గ్రామంలోని తూర్పుబజారుకు బయలుదేరారు. మార్గంమధ్యలో టీడీపీ నాయకుడు ఉప్పుటూరి శంకరయ్య ఇంటి వద్దకు వెళ్లేసరికి శంకరయ్యతోపాటు ఆ పార్టీ నాయకులు పాములపాటి వాసు, కడియాల శ్రీను, మానుకొండ నిరంజన్, మానుకొండ రామకృష్ణ, చుండూరి రాజు, మానుకొండ కోటయ్య, కొల్లా కిషోర్‌లు మూకుమ్మడిగా పరుష పదజాలంతో వారిని దూషించారు.
 
‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మీరు నాయకులా.. మొన్న అసెంబ్లీ ఎన్నికలప్పుడు రిగ్గింగ్ చేయకుండా అడ్డుకుంటారా.. మీ అంతు చూస్తామంటూ మారణాయుధాలతో దౌర్జన్యానికి దిగారు. వారిలో ఒకరు గడ్డపలుగు తీసుకుని కృష్ణారావు మీదకు వెళ్లగా ఆయన ప్రాణభయంతో పరుగుపెట్టాడు. టీడీపీ నాయకులు వెంటపడి గొడ్డలితో కృష్ణారావు ఎడమకాలుపై నరికారు. ఇనుపరాడ్లతో ఇష్టారాజ్యంగా కొట్టారు. అడ్డుకోబోయిన లక్ష్మయ్య, వెంకటేశ్వర్లుపైనా దాడికి దిగారు. కృష్ణారావు తీవ్రంగా, మిగిలిన ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న రూరల్ ఎస్‌ఐ రమేష్ సిబ్బందితో యల్లమంద గ్రామానికి వెళ్లి బందోబస్తు నిర్వహించారు. బాధితుల ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
బాధితులకు వైఎస్సార్ సీపీ నాయకుల పరామర్శ

యల్లమంద గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ వర్గీయులపై దాడి జరిగిందన్న సమాచారం మేరకు ఎంపీపీ కొమ్మాలపాటి ప్రభాకరరావు, ఇక్కుర్రు గ్రామ సర్పంచ్ పదముత్తం చిట్టిబాబు, వైఎస్సార్ సీపీ నాయకులు మూరె రవీంద్రారెడ్డి, షేక్ పొదిలిఖాజా, జగన్‌మోహన్‌రెడ్డి, ముప్పాళ్ళ నాగేశ్వరరావు తదితరులు ఏరియా వైద్యశాలకు చేరుకున్నారు. బాధితులను పరామర్శించిన అనంతరం ఎంపీపీ ప్రభాకరరావు మాట్లాడుతూ టీడీపీ వర్గీయుల దౌర్జన్యానికి ఇలాంటి సంఘటనలు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తాయన్నారు. అధికారం ఉందన్న అహంకారంతో వైఎస్సార్ సీపీ శ్రేణులపై దాడులు చేయడం దారుణమన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని  డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement