‘పవన్‌కు తప్పుడు సలహాలు ఇస్తున్నారు’ | Sakshi
Sakshi News home page

పవన్‌ కల్యాణ్‌ పై టీడీపీ ఎదురుదాడి..

Published Mon, May 8 2017 1:21 PM

‘పవన్‌కు తప్పుడు సలహాలు ఇస్తున్నారు’ - Sakshi

అమరావతి: టీటీడీ ఈవో నియామకంపై జనసేన అధ్యక్షుడు, హీరో పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలను టీడీపీ నేత రాజేంద్ర ప్రసాద్‌ తప్పుబట్టారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ ఐఏఎస్‌ అధికారులకు కులాలు, మతాలు ఉండవన్నారు. పవన్‌ కల్యాణ్‌కు ఎవరో తప్పుడు సలహాలు ఇస్తున్నారని రాజేంద్రప్రసాద్‌ అన్నారు. ఆయన ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదని హితవు పలికారు. మాట్లాడేముందు పవన్‌ స్టడీ చేయాలంటూ రాజేంద్రప్రసాద్‌ వ్యాఖ్యానించారు. తన వ్యాఖ్యలపై పవన్‌ పునరాలోచించుకోవాలని డిమాండ్‌ చేశారు.  

అలాగే టీడీపీ నేత వర్ల రామయ్య కూడా పవన్‌ ట్విట్‌పై తీవ్రస్థాయిలో స్పందించారు. ఉత్తరాది, దక్షిణాది అని విడదీయడం మంచి పద్ధతి కాదన్నారు. మీడియాలో ప్రచారం కోసమే మాట్లాడటం సరికాదని, ఉత్తరాది అధికారులను ఈవోగా నియమించకూడదని, దక్షిణాది అధికారులకే ఆ పదవి అని ఏ చట్టంలోనూ రాసిలేదని అన్నారు. మేధావి అయిన పవన్‌ తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని వర్ల రామయ్య అన్నారు.

మరోవైపు ఇదే అంశంపై మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ...భక్తి భావం ఉన్న ఎవరైనా స్వామివారికి సేవ చెయ్యొచ్చని, ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టడం సరికాదని అన్నారు. సేవ చేసే ఏ వ్యక్తి అయినా ఈవోగా పని చేసే అర్హత ఉంటుందన్నారు. కాగా ఉత్తరాదికి చెందిన ఐఏఎస్‌ అధికారి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ను ఏపీ ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. దీనిపై పవన్‌ కల్యాణ్‌ స్పందిస్తూ ఈవో నియామకంపై టీడీపీతో పాటు, చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలంటూ ట్విట్‌ చేసిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement