దోపిడీకి కొత్త ఎత్తుగడ | Sakshi
Sakshi News home page

దోపిడీకి కొత్త ఎత్తుగడ

Published Tue, Oct 31 2017 3:12 PM

tdp leaders corruption Lift Irrigation Scheme - Sakshi

సాక్షి ప్రతినిధి, ఏలూరు : చెరువు ఏర్పాటవుతుందో లేదో తెలియదు. ఆ చెరువులోకి నీరు వస్తుందో, రాదో స్పష్టత లేదు. ఇందుకు సంబంధించి అనుమతులు లేవు. కనీసం రాతపూర్వక ప్రతిపాదనలు కూడా లేవు. కానీ 40 ఎకరాల్లో చెరువును తవ్వించి అందులో నీటిని నింపి భవిష్యత్తులో పొలాలకు నీరు అందిస్తామంటున్న ఓ ప్రజాప్రతినిధి మాటలకు అక్కడి అధికారులు తందాన తాన అన్నారు. ఇంకేముంది పేద రైతులకు చెందిన భూములను నామమాత్రపు ధరకు తీసేసుకుని, చెరువు తవ్వకం పేరిట గ్రావెల్, మట్టిని పెద్ద ఎత్తున అమ్మేసుకుంటున్నారు. పది కోట్ల రూపాయలకు పైగా కొల్లగొట్టే పథకాన్ని అమలుపరుస్తున్న అ«ధికార పార్టీ నేతలను ఇదేంటని మాటమాత్రంగానైనా ప్రశ్నించే సాహసం చేయలేకపోతున్నారు సంబంధిత అధికారులు. వివరాల్లోకి వెళితే... దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం సూర్యారావుపేట గ్రామం పక్క నుంచి చింతలపూడి ఎత్తిపోతల పథకం కాల్వ వెళ్తోంది. 

అక్కడికి దగ్గరలో చుట్టుపక్కల నాలుగు గ్రామాలకు మధ్యలో ఓ కంకరగుట్ట ఉంది. గుట్టను తవ్వి చెరువుగా తయారుచేసి నీరు నిలబెడితే చుట్టుపక్కల భూగర్భజలాలు పెరుగుతాయని, అవసర సమయాల్లో చెరువు నీటిని సాగు కోసం వినియోగించుకోవచ్చని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ప్రతిపాదించారు. తొలుత ఆ ప్రాంత వాసులు ఒప్పుకోకపోయినా ఎమ్మెల్యే జిల్లా కలెక్టరు కాటంనేని భాస్కర్‌ను, జలవనరుల శాఖ అధికారులను వెంట పెట్టుకుని వెళ్లారు. పోలవరం కుడి కాలువ నుంచి గాని, చింతలపూడి కాల్వ నుంచి ఎత్తిపోతల ద్వారా పైపులు వేసి చెరువును నింపుతామని నమ్మబలికారు. ఏదైనా చెరువుకు నీరు తరలించాలంటే ఆ చెరువు విస్తీర్ణం కనీసం వంద ఎకరాలైనా ఉండాలి. అలా ఉంటేనే కాల్వ నుంచి అధికారికంగా  లిఫ్ట్‌ ద్వారా నీటిని తరలించడానికి వీలవుతుందని కలెక్టర్‌ తేల్చి చెప్పారు. ఆ తర్వాత సమావేశం నిర్వహించి చెరువు తవ్వడానికి గ్రామస్తులను చింతమనేని ఒప్పించారు. 

ప్రతిపాదనలు లేకున్నా... 
కంకరగుట్టతో పాటు అక్కడి భూములు తీసుకుంటేనే వంద ఎకరాలకు పైగా చెరువు రూపుదిద్దుకుంటుంది. ఇందుకు ఎలాంటి ప్రతిపాదనలు లేవు. కానీ చెరువు పేరిట సుమారు నలభై ఎకరాలను రైతుల నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించారు. గతంలో ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్థానికులైన పేదలకు డీ–ఫారం పట్టాలుగా ఇచ్చిన వాటిని చెరువు తవ్వకానికి ఇవ్వాల్సిందేనని ఎమ్మెల్యే గట్టిగా చెప్పడంతో రైతులు సమ్మతించక తప్పలేదు. ఎకరానికి రూ.ఆరు లక్షల చొప్పున ధర నిర్ణయించి తన అనుచరుడైన కిషోర్‌ ద్వారా ఒక్కొక్కరికి రూ.లక్ష  చొప్పున అడ్వాన్స్‌గా చింతమనేని చెల్లింపజేశారు. తక్కిన మొత్తాన్ని తర్వాత ఇప్పిస్తానని నమ్మబలికారు. రైతుల నుంచి తీసుకున్న భూముల్లో చెరువు తవ్వకం పనులు  రెండు వారాలుగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఐదు ఎకరాల విస్తీర్ణంలో గ్రావెల్, మట్టి తవ్వకం పనులు కొనసాగుతున్నాయి. 

రూ.10 కోట్లకు పైగా టార్గెట్‌... 
ఒక్కో టిప్పర్‌కు దూరాన్ని బట్టి రూ.2,500, ట్రాక్టర్‌కు రూ.500 చొప్పున వసూలు చేస్తున్నారు. రోజుకు వంద నుంచి 120 వరకూ టిప్పర్లు, ట్రాక్టర్లతో మట్టి తోలుతున్నారు. ఈ వ్యవహారాన్ని చింతమనేని అనుచరుడు కిషోర్‌ చేతుల మీదుగా నిర్వహిస్తున్నారు. పనులు మొదలైన తరువాత ఎమ్మెల్యే ఆ ప్రాంతం వైపు కూడా కన్నెత్తి చూడలేదు. రైతుల నుంచి తీసుకున్న 40 ఎకరాలలోని గ్రావెల్, మట్టి అమ్మకాల ద్వారానే పది కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వస్తుందని స్థానికులు అంచనాగా చెబుతున్నారు. తమ భూమికి నామమాత్రపు ధర చెల్లిస్తున్నారని పేద రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అనుమతులు ఇవ్వలేదు : ఈ చెరువు తవ్వకానికి ఎటువంటి అనుమతులు లేవు. కనీసం ప్రతిపాదనలు కూడా లేవు.

పెదవేగి తహíసీల్దార్‌తో ‘సాక్షి’ మాట్లాడగా అక్కడ ఎత్తిపోతల నుంచి లిఫ్ట్‌ ద్వారా చెరువుకు నీరు నింపే పనులు జరుగుతున్నాయని, ఇరిగేషన్‌ వారిని అడిగితే సమాచారం తెలుస్తుందని దాటవేశారు. ఎవరో పొలంలో చెరువు తవ్వుకుంటే తామేం చేయగలమని ఇరిగేషన్‌ అధికారులు ప్రశ్నించారు. తమ శాఖ నుంచి ఎటువంటి అనుమతులు లేవని, పైపులైన్‌ ద్వారా చెరువు నింపడానికి కూడా ప్రతిపాదనలు లేవన్నారు. ఈ భూమిని ఇరిగేషన్‌ శాఖ తీసుకుని చెరువు తవ్వే ప్రతిపాదనలు కూడా రాలేదని, భవిష్యత్‌లో కూడా చేయడానికి నిబంధనలు అంగీకరించబోవని వివరించారు. అయితే చెరువు తవ్వకానికి తమను సంప్రదించిన మాట వాస్తవమే  అయినప్పటికీ ఎటువంటి ప్రతిపాదనలు సిద్ధం కాలేదన్నారు. 

ఈ ప్రశ్నలకు బదులేది?
చెరువుకు పోలవరం, చింతలపూడి ఎత్తిపోతల ప్రధాన కాల్వల నుంచి నీటిని తరలించాలంటే వంద ఎకరాల విస్తీర్ణం ఉండాలని కలెక్టరే స్వయంగా చెప్పారు. అసలు చెరువే లేకుండా, కంకర గుట్టను, చుట్టుపక్కల పొలాలను తవ్వి చెరువుగా రూపుదిద్దడమంటే పెద్ద ప్రహసనమే. ప్రతిపాదనలే లేకుండా చెరువు తవ్వుతామని చెప్పడమంటేనే గ్రావెల్, మట్టి కొల్లగొట్టడానికే అని స్థానికులు ఆరోపిస్తున్నారు. రైతులకు పూర్తిగా డబ్బు చెల్లించకుండా తవ్వకం పనులు చేపట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. భవిష్యత్తులో డబ్బులు చెల్లించడానికి ఎవరు బాధ్యత తీసుకుంటారని వాపోతున్నారు. 

Advertisement
Advertisement