అది బూర్జ..తమ్ముళ్లదే దర్జా!

24 Dec, 2014 01:38 IST|Sakshi
అది బూర్జ..తమ్ముళ్లదే దర్జా!

 అక్కడి ప్రజల సమస్యలపై చర్చించి పరిష్కారానికి తగిన నిర్ణయాలు తీసుకునేందుకు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఎంపీపీ ఉన్నారు. పాలకవర్గం ఉంది. అది తీసుకునే నిర్ణయాలను అమలు చేసేందుకు ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ఉన్నారు. కానీ వీరెవరి మాటలు చెల్లుబాటు కావడంలేదు. స్థానిక ప్రజలు తిరస్కరించిన టీడీపీ నేతలు రాష్ట్రంలో అధికారంలో ఉన్నామన్న దర్పంతో ఇక్కడా తమ మాటే వేదం కావాలని పంతం పట్టారు. అధికార యంత్రాంగంపై స్వారీ చేస్తూ.. బెదిరింపులకు పాల్పడుతూ తమ మాట నెగ్గించుకుంటున్నారు. ఫలితం..మండల పరిషత్ పాలన గాడి తప్పింది. ఏ పని చేయాలన్నా యంత్రాంగం భయపడుతోంది. ఈ ఒత్తిళ్లు తట్టుకోలేక పలువురు సెలవులపై వెళ్లిపోతున్నారు. బూర్జ మండల కార్యాలయంలో నెలకొన్న ఈ దుస్థితిపై ప్రజలూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
 బూర్జ: ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో పక్షపాతం, అనుచిత రాజకీయ జోక్యం పెరిగిపోయాయి. ఈ పరిస్థితికి భయపడి కార్యాలయంలో అధికారులు ఉండటం లేదు. తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ప్రజలు నిరసనబాట పట్టారు. మండలపరిషత్ కార్యాలయం వద్ద ధర్నా కూడా చేశారు. అధికార టీడీపీ ఆగడాలకు ఈ కార్యాలయం వేదికగా మారడమే ఈ దుస్థితి కారణమని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల్లో బూర్జ మండలంలో అత్యధిక ఎంపీటీసీ స్థానాలతోపాటు జెడ్పీటీసీ స్థానాన్ని వైఎస్‌ఆర్‌సీపీ చేజిక్కించుకుంది. ఎంపీటీసీల బలంలో ఎంపీపీ పదవి కూడా ఆ పార్టీకే దక్కింది. మండలంలో అధికారం పోయినా రాష్ట్రంలో అధికార పార్టీగా ఉన్న తెలుగుదేశం నేతలు ఎన్నికైన ప్రజాప్రతినిధులను కాదని.. తమ పెత్తనమే సాగేలా అధికారులపై నిరంతరం ఒత్తిడి తెస్తున్నారు.
 
 మండల పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ తాము చెప్పినట్లే అన్నీ జరగాలని పట్టుబట్టి మరీ చేయించుకుంటున్నారు. తాము చెప్పినట్లే చేయాలని.. లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అధికార యంత్రాంగం మెడపై కత్తి పెడుతున్నారు. తమ చేష్టలకు ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్ పేరును వాడుకుంటున్నారు. దీంతో మండల పాలకవర్గం తీసుకుంటున్న నిర్ణయాలు అమలు కావడంలేదు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికలో అర్హులకు అన్యాయం జరుగుతోందని ప్రజలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దినదిన గండంగా ఇక్కడ ఉద్యోగం చేయలేమని భావిస్తూ సెలవులు పెట్టేస్తున్నారు. ఇప్పటికే ఎంపీడీవో సీహెచ్ లక్ష్మీబాయి, జూనియర్ అసిస్టెంట్ వెంకటరమణ, టైపిస్టు కిశోర్ సెలవులు పెట్టేశారు.
 
 ఇన్‌చార్జి ఎంపీడీవో ఈవోఆర్డీ సుదర్శన్ కూడా సెలవు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. కాగా మద్యానికి బానిస అయిన సీనియర్ అసిస్టెంట్ ఎప్పుడు విధుల్లో ఉంటారో ఎవరికీ తెలియదు. సూపరింటెండెంట్ సత్యం ఒక్కరే పనులన్నీ చక్కబెట్టాల్సి వస్తోంది. దాంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. దీంతో ప్రజలు కార్యాలయానికి వచ్చి నిరాశతో వెనుదిరగాల్సి వస్తోంది.  ఇక పంచాయతీ కార్యదర్శుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. కార్యదర్శుల ప్రమేయం లేకుండానే పింఛన్ల మంజూరు, తొలగింపు వంటివన్నీ టీడీపీ కార్యకర్తలే చేసేస్తున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. అర్హులైన లబ్ధిదారులు నిలదీస్తూ, శాపనార్థాలు పెడుతున్నా వారికి సమాధానం చెప్పలేకపోతున్నారు. ఇటీవల ఇక్కడికి వచ్చిన జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో రవీంద్రకు ఇదే విషయమై రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఇటీవల జరిగిన మండల పరిషత్ సమావేశానికి హాజరైన ప్రభుత్వ విప్‌కు జెడ్పీటీసీ ఆనెపు రామక్రిష్ణ జరుగుతున్న తంతును వివరించారు. మీ పేరు వాడుకుంటూ టీడీపీ కార్యకర్తలు అరాచకాలు చేస్తున్నారని  సభలో అందరి సమక్షంలోనే ఫిర్యాదు చేసినా ఆయన స్పందించలేదు.
 
 అల్లకల్లోలం చేస్తున్నారు
 తెలుగుదేశం నాయకులు దౌర్జన్యం చేస్తున్నారు. ఏకపక్షంగా వ్యవహరిస్తూ మండల పరిషత్ కార్యాలయాన్ని అల్లకల్లోలం చేస్తున్నారు. అర్హులకు అన్యాయం జరుగుతోంది. ఉద్యోగులు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రజలు ఎన్నుకున్న ఎంపీపీనైన నాకు  ఎటువంటి విలువ, గౌరవం ఇవ్వటం లేదు. ఇక ప్రజలకు ఏం న్యాయం చేయగలం.
 
 -బొడ్డేపల్లి సూర్యారావు, ఎంపీపీ
 పనులేవీ జరగడం లేదు
 మండల పరిషత్ కార్యాలయం చుట్టూ గత వారం రోజులుగా తిరుగుతున్నా మా పనులు జరగటంలేదు. ఎప్పుడొచ్చినా ఎంపీడీవో సెలవులో ఉన్నారు, సిబ్బంది సెలవులో ఉన్నారని  చెబుతున్నారు. ఇలా అయితే మా పరిస్థితి ఏమిటి.
 -కొరగంజి శ్రీనివాసరావు, రైతు
 

మరిన్ని వార్తలు