తెలుగు తమ్ముళ్ల ‘సంస్థాగత’ గోల | Sakshi
Sakshi News home page

తెలుగు తమ్ముళ్ల ‘సంస్థాగత’ గోల

Published Thu, Apr 23 2015 4:07 AM

తెలుగు తమ్ముళ్ల  ‘సంస్థాగత’ గోల - Sakshi

సంస్థాగత ఎన్నికల్లో రచ్చకెక్కిన విభేదాలు
దాదాపు 20 చోట్ల ఎన్నికలు వాయిదా
నారా లోకేష్ చెంతకు పలమనేరు నియోజకవర్గ పంచాయితీ
పీలేరులో సాగుతున్న కరపత్రాల యుద్ధం
మదనపల్లె, పుంగనూరులో పార్టీ కార్యకర్తల ధర్నా
రేణిగుంటలో తమ్ముళ్ల గొడవ
వర్గపోరుతో కుప్పంలో పూర్తి కాని ఎన్నికలు
తల పట్టుకుంటున్న చంద్రబాబు
మేలో జరిగే జిల్లా కమిటీ ఎన్నికలు ప్రశ్నార్థకం

 
సాక్షి, ప్రతినిధి తిరుపతి : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సొంత జిల్లాలో వర్గ విబేధాలు రచ్చకెక్కాయి. కొన్ని చోట్ల తెలుగు తమ్ముళ్లు రోడ్డెక్కి ధర్నాలు చేశారు. పీలేరులో కరపత్రాల యుద్ధం సాగింది. సాక్షాత్తూ సీఎం సొంత ఇలాకాలో రెండు చోట్ల కమిటీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. పలుచోట్ల నుంచి అధిష్టానానికి ఫిర్యాదులు వెల్లువలా వెళ్లాయి. చంద్రగిరిలో సైతం గల్లా అరుణకుమారి, సీఎం వర్గాలు కత్తులు దూసుకుంటూనే ఉన్నాయి. మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు ఏకంగా ముష్టి ఘాతాలకు దిగారు.

దీంతో జిల్లాలో 65 మండల కమిటీలు, 6 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్‌లకు జరిగిన సంస్థాగత ఎన్నికల్లో దాదాపు 20 చోట్ల ఎన్నికలు వాయిదాపడ్డాయి. ఈ పరిణామాలు చంద్రబాబుకు తలకు మించిన భారంగా మారాయి. దీనికితోడు పార్టీలో పలువురు నేతలు నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకోవడంతో పదవుల భర్తీ సైతం కత్తిమీద సాములా మారింది. జిల్లాలో కొంత మంది పార్టీ నేతలు బహిరంగంగా విమర్శలకు దిగుతున్నారు.

► పలమనేరులో టీడీపీ సీనియర్ నాయకులు నక్కనపల్లి శ్రీనివాసులురెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి సుభాష్ చంద్రబోస్ మధ్య అంత ర్గతపోరు సాగుతోంది. బెరైడ్డిపల్లె మండల కమిటీ ఎన్నికల్లో ఇరువర్గాల మధ్య పొత్తు కుదరకపోవడంతో  ఓ వర్గం ఎన్నిక బిహ ష్కరించి నారా లోకేష్‌కు ఫిర్యాదు చేసింది. న్యాయం జరగకపోతే తమదారి తాము చూసుకుంటామని హెచ్చరికలు జారీ చేసినట్టు సమాచారం.

► పీలేరులో నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ ఇక్బాల్ అహ్మద్, నియోజకవర్గ సమన్వయకర్త మల్లారపు రవిప్రకాష్‌నాయుడు వర్గాల మధ్య పోరు తీవ్రస్థాయికి చేరింది. ఇప్పటికే వీరు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కరపత్రాలను సైతం వేయించారు. పైరవీలు, బెదిరింపులకు భయపడి మండల కమిటీ వేశారంటూ ఓ వర్గం నేతలు బహిరంగంగానే విమర్శించడం గమనార్హం. రెండు వర్గాలతోనే సతమతమవుతున్న పార్టీలోకి తాజాగా మాజీ ఎమ్మెల్యే జీవీ శ్రీనాథరెడ్డి చేరడంతో వర్గాల మధ్య పోరు మరింత పెరిగింది.

► మదనపల్లెలో మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్, పార్టీ సీనియర్ నేత రామదాస్ చౌదరి మధ్య విబేధాలు రచ్చకెక్కాయి. మదనపల్లె నియోజకవర్గానికి పార్టీ తరపున ఇన్‌చార్జిని సైతం నియమించ లేని దుస్థితిలో అధిష్టానం ఉంది.
► చంద్రగిరి నియోజకవర్గంలో మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, ముఖ్యమంత్రి చంద్రబాబు వర్గాలకు పొసగడం లేదు. దీంతో అక్కడ పార్టీ కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు.
► పూతలపట్టు నియోజకవర్గంలో యాదమరి, పూతలపట్టు మండలాల్లో వర్గవిభేదాలు తారా స్థాయికి చేరడంతో అక్కడ ఎన్నికలు ఆగిపోయాయి..
► జీడీ నెల్లూరులో కార్వేటినగరం, వెదురుకుప్పం, ఎస్‌ఆర్‌పురం మండల కమిటీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. మొదటి నుంచి టీడీపీని నమ్ముకుని ఉన్న పార్టీ కార్యకర్తలకు, శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనుంచి  కొత్తగా చేరిన నాయకుల మధ్య అక్కడ ఆధిపత్య పోరు నడుస్తోంది.
► పుంగనూరు నియోజకవర్గంలో పుంగనూరు పట్ట ణం, సదుం మండలాల కమిటీ ఎన్నికలు ఆగిపోయాయి. అక్కడ తెలుగుయువత కార్యదర్శి మధుసూదన  నాయుడు వర్గం, పుంగనూరు నియోజకవర్గ ఇన్‌చార్జి వెంకటరమణ రాజుల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. దీంతో పుంగనూరులోని దేశం కార్యాలయం వద్ద ఓ వర్గం నాయకులు ఏకంగా ధర్నాకు దిగి, యువనేత లోకేష్‌కు ఫిర్యాదు చేశారు.

► ముఖ్యమంత్రి సొంత ఇలాకా కుప్పం నియోజకవర్గంలో సైతం నేతల మధ్య పోరుతో పూర్తిస్థాయిలో కమిటీలను వేయలేకపోయారు. నేతలు విద్యాసాగర్, గోపీనాథ్‌ల మధ్య విభేదాలతో ఏకంగా కుప్పం అర్బన్ కమిటీనే రద్దు చేశారు. శాంతిపురం మండలంలో సైతం అధ్యక్షపదవికి పలువురు పోటీపడడంతో ఎన్నికను వాయిదా వేయాల్సి వచ్చింది.
► మంత్రి బొజ్జల ప్రాతినిథ్యం వహిస్తున్న శ్రీకాళహస్తి నియోజకవర్గంలో సైతం మండల కమిటీ ఎన్నికలు సజావుగా సాగలేదు.  శ్రీకాళహస్తిలో రెండువర్గాల మధ్య గందరగోళం నెలకొంది. రేణిగుంటలో ఏకంగా తెలుగుతమ్ముళ్లు ముష్టియుద్ధాలకు దిగారు.

జిల్లా వ్యాప్తంగా పార్టీ సంస్థాగత ఎన్నికల్లో తీవ్ర విబేధాలు పొడచూపాయి. మేలో జరిగే జిల్లా కమిటీ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం వుంది. మొత్తం మీద జిల్లా దేశం పార్టీలో నెలకొన్న విబేధాలు ముఖ్యమంత్రి చంద్రబాబు తలకు బొప్పి కట్టిస్తున్నట్టు పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి. ఈ ప్రభావం రాష్ట్రంలో పార్టీపై ప్రభావం చూపుతుందని చంద్రబాబు జిల్లాలోని దేశం నేతలపై అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.

Advertisement
Advertisement