డిపోలపై తమ్ముళ్ల దృష్టి! | Sakshi
Sakshi News home page

డిపోలపై తమ్ముళ్ల దృష్టి!

Published Sun, Feb 8 2015 2:50 AM

TDP Leaders focus on Ration Depot

పాలకొండ రూరల్:అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆర్థిక ప్రయోజనం కల్పించే అన్ని రకాల పదవుల, పోస్టులు దక్కించుకునేందుకు పోటీ పడుతున్న తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు తాజాగా రేషన్ డిపోలను దక్కించుకోవడంపై దృష్టి సారించారు. త్వరలో  భర్తీ కానున్న డీలర్ పోస్టులను తమ అనుయాయులకు ఇప్పించుకునేందుకు ఆయా ప్రాంతాల నాయకులు పావులు కదుపుతున్నారు. జిల్లాలో పాలకొండ, శ్రీకాకుళం, టెక్కలి డివిజన్ల పరిధిలో 85 డీలర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో కొన్నింటిని కారుణ్య నియామకాల కింద గత డీలర్ కుటుంబ సభ్యులకు ఇవ్వాల్సి ఉంది. అవి పోగా మిగిలిన పోస్టుల నియామక ప్రక్రియను త్వరలో చేపట్టనున్నారు.
 
 టెక్కలి డివిజన్ పరిధిలో ఉన్న రెండు రెగ్యులర్ ఖాళీలకు సంబంధించి ఇప్పటికే ఇంటర్వ్యూలు పూర్తయ్యాయి. వాటిని దక్కించుకునేందుకు స్థానిక  టీడీపీ నేతలు అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చారని తెలిసింది. శ్రీకాకుళం డివిజన్‌లో రోస్టరైజేషన్ పూర్తి చేసి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. పాలకొండ డివిజన్‌కు సంబంధించి రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ వెలువడనున్నట్లు పౌరసరఫరా శాఖ వర్గాలు పేర్కొన్నాయి. వీటిని తమ వారికి కట్టబెట్టేందుకు ఇప్పటికే స్థానిక చోటా నాయకులు మొదలుకుని బడా నేతలు వరకు పైరవీలు మొదలుపెట్టారు.
 
 కొత్త డిపోలకు అవకాశం
 ఇదిలా ఉండగా 300 నుంచి 400 కార్డులున్న ప్రాంతాన్ని ఒక యూనిట్‌గా నిర్థారించి కొత్త రేషన్ డిపోల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతుంది. ఆ ప్రకారం జిల్లాలో ప్రస్తుతం ఉన్న 1989 డిపోలకు తోడు మరో 500  డిపోలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఇది కూడా టీడీపీ నేతల అవకాశాలను పెంచనుంది. కాగా ప్రస్తుతం ఖాళీగా ఉన్న డిపోలను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్న నేతలు కొన్ని ప్రాంతాల్లో వీటికి రేట్లు కూడా నిర్ణయించేశారని తెలిసింది.  
 
 11న ఉప ముఖ్యమంత్రి జిల్లాకు రాక శ్రీకాకుళం పాతబస్టాండ్:
 రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఈ నెల 11వ తేదీన జిల్లాకు రానున్నారని కలెక్టర్ పి.లక్ష్మీనరసింహం శనివారం తెలిపారు. ఆ రోజు ఉదయం తొమ్మిది గంటలకు జిల్లాకు చేరుకొని అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామిని దర్శించుకుంటారు. 10 గంటలకు శ్రీకాకుళం నుంచి బయలుదేరి ఎచ్చెర్ల ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు తనయుని వివాహ కార్యక్రమంలో పాల్గొంటారు.
 

Advertisement
Advertisement