అక్రమార్కులపై అధికారి ప్రేమ | Sakshi
Sakshi News home page

అక్రమార్కులపై అధికారి ప్రేమ

Published Sat, Sep 21 2019 10:47 AM

TDP leaders illegal constructions in chittoor district - Sakshi

సాక్షి,చిత్తూరు, తిరుపతి : కొంక చెన్నాయిగుంటలో ఆక్రమణదారులపై రెవెన్యూ అధికారులు ఇద్దరు ఎనలేని ప్రేమను కురిపిస్తున్నారు. ఆక్రమణల పై పత్రికల్లో వార్తలు వస్తే, వెంటనే రెవెన్యూ అధికారులు హడావుడి చేస్తారు. రెండు, మూడు తాత్కాలిక కట్టడాలు పడగొట్టి వెళ్తున్నారు. రెండు రోజుల తరువాత తిరిగి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ ఆక్రమణలపై రెవెన్యూ అధికారులకు తెలిసినా, చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా ఆ ఆక్రమణల జోలికి ఎవ్వరూ రాకుండా ఉండేం దుకు అక్రమార్కులకు సలహాలు సూచనలు ఇస్తున్నారు. తిరుపతికి కూతవేటు దూరంలో అక్కారంపల్లి పరిధిలోని కొంక చెన్నాయిగుంట సర్వే నంబర్‌ 173/3లో 2.50 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. సుమారు రూ.15 కోట్లు విలువచేసే ఈ భూమిని గతంలో ఆరుగురు స్వాతంత్య్ర సమరయోధులకు పట్టాలు ఇచ్చినట్లు, వారి నుంచి కొనుగోలు చేసినట్లు టీడీపీ శ్రేణులు రికార్డులు సృష్టించినట్లు సమాచారం. ఇందుకు ఇద్దరు రెవెన్యూ అధికారులకు కొంత నగదు ముట్టజెప్పారు. వాటి ఆధారంగా టీడీపీ శ్రేణులు ఆక్రమణలకు బరితెగిస్తున్నారు. ఎన్నికలకు ముందు, ఆ తరువాత ఇదే భూమిని ఆక్రమించి తాత్కాలిక నిర్మాణాలు చేపట్టారు. ఈ ఆక్రమణలపై స్థానికుల ఆరోపణలు వెల్లువెత్తటంతో పత్రికల్లో కథనాలు వచ్చాయి. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు ప్రవేశించి నిర్మాణాలను పడగొట్టారు. కొద్దిరోజులు ఆగాక మళ్లీ నిర్మాణాలు మొదలు పెట్టారు. దీనిపై పత్రికల్లో మళ్లీ కథనాలు వచ్చాయి. రెవెన్యూ అధికారులు స్పందించి మూడు తాత్కాలిక నిర్మాణాలను కూలదోశారు.

టీడీపీ వ్యతిరేకుల ఇళ్ల కూల్చివేత
అక్రమ కట్టడాలు చేపట్టిన టీడీపీ శ్రేణులకు సంబంధించిన నివాసాలను మాత్రం పడగొట్టలేదు. వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా మాట్లాడేవారి నివాసాలను మాత్రం గుర్తించి పడగొడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతుంటే,  రెవెన్యూ అధికారులు కొందరు టీడీపీ నేతలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. తాత్కాలిక షెడ్లు పడగొట్టినప్పటికీ, ఆ స్థలాలను టీడీపీ శ్రేణులు వారం తరువాత మరొకరికి విక్రయించి సొమ్ముచేసుకుంటున్నారు. కొంక చెన్నాయిగుంట స్థలాలు అక్రమమని తెలియటంతో కొందరు టీటీడీ శ్రేణులకు చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇవ్వమని డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో వారి నుంచి కొంత సమయం తీసుకుని అదే స్థలాన్ని వేరొకరికి విక్రయిస్తున్నారు. ఎన్నికల ముందు ఒక ఇంటి స్థలం రూ.2 లక్షలకు విక్రయిస్తే... ఎన్నికల తరువాత అదే స్థలాన్ని రూ.5 లక్షలకు విక్రయిస్తున్నారు. కుంట పోరంబోకు స్థలం అని తెలియక కొనుగోలు చేసి మోసపోతున్న వారు టీడీపీ శ్రేణులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓపిక పడితే ఇచ్చిన సొమ్ము కొంత ఇస్తామని, లేదంటే ఇచ్చేది లేదు పొండి అంటూ ఎదురు తిరుగుతున్నారు. ఆక్రమణలపై ఎవరైనా ప్రశ్నిస్తే డబ్బులు అడుగుతున్నారని టీడీపీ నాయకులు అసత్య ప్రచారం చెయ్యడం ప్రారంభించారు. ఈ ఆక్రమణలపై రెవెన్యూ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

Advertisement
Advertisement