శిరోభారం | Sakshi
Sakshi News home page

శిరోభారం

Published Fri, Jun 5 2015 2:54 AM

TDP leaders jitter about trip to The CM

 సాక్షి ప్రతినిధి, కడప : ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్న చందంగా ముఖ్యమంత్రి పర్యటన అంటేనే జిల్లాలో టీడీపీ నేతలు బెంబేలెత్తిపోతున్నారు. కార్యక్రమం విజయవంతం చేసేందుకు తలప్రాణం తోకకు వస్తోందని టీడీపీ ఇన్‌ఛార్జిలు వాపోతున్నారు. ఈ నెల 7వ తేదీన సీఎం ఖాజీపేట పర్యటన ఆ పార్టీ శ్రేణులను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఓ వైపు వర్గపోరుతో సతమతమవుతున్న తరుణంలో సీఎం పర్యటన వారికి తలనొప్పిగా మారింది. జిల్లాలో ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటుతో సరిపెట్టుకున్న ఆ పార్టీ ప్రత్యేక చొరవతో అభివృద్ధిని పరుగులు తీయిస్తూ ప్రజలను ఆకట్టుకోవాల్సిందిపోయి తద్భిన్నంగా వ్యవహరిస్తోంది.

జిల్లా అంటేనే పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారని ముఖ్యమంత్రి నుంచి కలెక్టర్ వరకూ విషప్రచారం చేస్తున్నారు. ఈ పరిణామాలు జిల్లావాసులను కలిచి వేస్తున్నాయి. ఏడాది కాలంగా చెప్పుకునేందుకు ఒక్కటంటే ఒక్క అభివృద్ధి పని కూడ ప్రభుత్వం చేసింది లేదు. అన్ని పనులు పూర్తి అయినా ఎయిర్‌పోర్టును ప్రారంభించకుండా వాయిదాల మీదా వాయిదాలు వేసుకుంటూ వచ్చారు. తీవ్ర నిరసనలు వ్యక్తమవుతుండటంతో ఎట్టకేలకు ఈనెల 7వ తేదిన ప్రారంభోత్సవానికి సన్నాహాలు చేస్తున్నారు.
 
 తీవ్రరూపం దాల్చిన వర్గ విభేదాలు
  మైదుకూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి పర్యటన నిర్వహించేందుకు టీడీపీ నేతల సూచన మేరకు యంత్రాంగం సన్నద్ధమైంది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల బలం ఉన్న ఖాజీపేట మండలాన్ని ఎంచుకున్నారు. ఈ క్రమంలో టీడీపీ మండల శాఖ అధ్యక్షుడు గుజ్జల రామకృష్ణ గురువారం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన కోడలు సుమలత మండల పరిషత్ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. జెడ్పీటీసీ సభ్యురాలు, సర్పంచ్ సైతం రాజీనామా చేయనున్నారని సమాచారం. నియోజకవర్గ ఇన్‌ఛార్జి పుట్టా సుధాకర్ యాదవ్‌తో అక్కడి నేతలకు ఉన్న ప్రత్యక్ష విభేదాలే ఇందుకు కారణమని తెలుస్తోంది.

రాజకీయాలకు కొత్త అయిన సుధాకర్ తొలిసారి టీడీపీ అభ్యర్థిగా మైదుకూరు బరిలో నిలిచారు. అప్పట్లో రాజకీయాల్లో తలపండిన మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి సైతం పుట్టాకు మద్దతుగా పనిచేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక పుట్టా సుధాకర్ హవా ప్రారంభమైంది. అందుకు కారణం ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుతో ఆయనకు ఉన్న బంధుత్వమే. దాంతో తన సామాజిక వర్గం మినహా ఇతర సామాజికవర్గ నాయకులను దూరంగా పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. మూడు దశాబ్ధాలుగా టీడీపీలో పని చేస్తున్న రెడ్యం సోదరులను సైతం దూరంగా పెడుతూ వస్తున్నట్లు తెలిసింది.

మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి పట్ల కూడ ఇదే వైఖరి కనబరుస్తున్నారని సమాచారం. మైదుకూరు నియోజకవర్గంలో అధికారులు సైతం తన సామాజిక వర్గానికి చెందిన వారే ఉండాలనే తలంపు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కీలకమైన ఇద్దరు సీఐలు, డీఎస్‌పి, మరికొందరు అధికారులను నియమించుకున్నట్లు సమాచారం. టీడీపీ మండల శాఖలల్లో సైతం అదే పాలసీతో వ్యవహరించినట్లు తెలుస్తోంది. గ్రామ స్థాయి నాయకులు వివిధ పనులపై ఎవరు వెళ్లినా అప్పటికప్పుడు వారికి అనుకూలంగా మాట్లాడటం, అనంతరం తన సామాజిక వర్గానికి చెందిన వారిని మాత్రమే ప్రోత్సహిస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామాలతో వర్గ విభేదాలు తీవ్రమైనట్లు తెలుస్తోంది.

 డీఎల్ అనుచరుల పట్ల అదే ధోరణి
  మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి గత ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేయక పోవడంతో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఎన్నికల్లో పనిచేశారు. ఇటీవల టీడీపీలో చేరేందుకు దువ్వూరు, ఖాజీపేట మండలాలకు చెందిన కొందరు మాజీ సర్పంచ్‌లు పుట్టా సుధాకర్‌ను కలిసినట్లు సమాచారం.   ఇంతకాలం మాజీ మంత్రి డీఎల్ అనుచరులుగా ఉన్న మీరు భవిష్యత్‌లో డీఎల్‌కు మద్దతు ఇవ్వరని గ్యారంటీ ఏమిటి అని ఆయన వారిని ప్రశ్నించినట్లు తెలిసింది. అదే విషయాన్ని వారంతా డీఎల్‌కు వివరించినట్లు సమాచారం.

ఇక ఉపేక్షించడం మంచిది కాదని భావించే మాజీ  డీఎల్ తెరవెనుక చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే పార్టీ ఖాజీపేట మండల శాఖ అధ్యక్ష పదవికి రామకృష్ణ రాజీనామా చేశారని తెలుస్తోంది. సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, ఎంపీపీలు సైతం డీఎల్ వర్గం కావడంతో సుధాకర్ యాదవ్ తలపట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొందని పలువురు విశ్లేషిస్తున్నారు. ఇంతకాలం తెరవెనుక వ్యతిరేకిస్తూ వచ్చిన రెడ్యం సోదరులే ఇపుడు ఏకైక దిక్కుగా నిలవాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. మొత్తానికి పుట్టాకు సీఎం పర్యటన శిరోభారంగా మారిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

 గత ఏడాది నవంబర్ 8న రైల్వేకోడూరులో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో సీఎం తొలిసారి పాల్గొన్నారు. నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా ఇటీవల కమలాపురంలో పర్యటించారు. మధ్యలో ప్రాజెక్టుల సందర్శన, శ్రీరామనవమి ఉత్సవాలల్లో సైతం పాల్గొన్నారు. రెండవ విడత జన్మభూమి కార్యక్రమంలో ఖాజీపేటలో పర్యటించనున్నారు.

Advertisement
Advertisement