రాజకీయ కిడ్నాప్‌ | Sakshi
Sakshi News home page

రాజకీయ కిడ్నాప్‌

Published Tue, Mar 7 2017 3:20 PM

tdp leaders kidnapped mptc son

కొత్త సంస్కృతి... పోరుమామిళ్ల ప్రాంతానికి పూర్తిగా తెలియనిది. ఫ్యాక్షన్‌ సంస్కృతిలో అది ఓ భాగం. మూడు కార్లల్లో వచ్చిన వారు  ఓ యువకుడిని అడ్డగించి, దాడి చేసి బలవంతంగా కారులో ఎక్కించుకుని పోవడం పట్టణంలో సంచలనమైంది. ఇలాంటి ఘటనలు ఫ్యాక్షన్‌ ఉన్న జమ్మలమడుగు, కమలాపురం ప్రాంతాల్లో జరగడం తెలిసిందే. అలాంటి సంస్కృతి పోరుమామిళ్లకు పాకడం స్థానికంగా అందరినీ
నివ్వెరపరచింది.


► పోరుమామిళ్లలో కలకలం
► ఎంపీటీసీ కుమారుడి కిడ్నాప్‌
► 24 గంటల్లో తేల్చకపోతే ఆమరణదీక్ష చేస్తా    
► పోలీసులకు ఎంపీ అవినాష్‌రెడ్డి హెచ్చరిక  


పోరుమామిళ్ల : పోరుమామిళ్ల పట్టణంలోని గాజుల్లా టీ బంక్‌ దగ్గర స్థానిక ఎంపీటీసీ సభ్యుడు డాక్టర్‌ గౌస్‌పీర్‌ కుమారుడు ముర్తుజాహుస్సేన్‌ను గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో కిడ్నాప్‌ చేశారు. సినిమాకు వెళుతుండగా అడ్డగించి, కొట్టి కారులో ఎత్తుకెళ్లారు. ఈ ఘటన పోరుమామిళ్లలో కలకలం సృష్టించింది. విషయం తెలిసిన ఎంపీ అవినాష్‌రెడ్డి, కడప మేయర్‌ సురేష్‌బాబు సోమవారం ఉదయం పోరుమామిళ్లకు చేరుకున్నారు.

ముందుగా పార్టీ కార్యాలయంలో స్థానిక నేతలతో మాట్లాడారు. ఎంపీ, మేయర్‌ వస్తున్నారని తెలిసి నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. అందరూ ర్యాలీగా పోలీస్‌స్టేషన్‌ వరకు నడుచుకుంటూ వెళ్లారు. అక్కడ సీఐ పద్మనాథన్, ఎస్సై పెద్ద ఓబన్నలతో మాట్లాడారు. పోరుమామిళ్ల నుంచి కార్లు మైదుకూరు రూట్‌లో వెళుతున్నట్లు సీసీ పుటేజ్‌లో స్పష్టంగా తెలుస్తున్నా అమగంపల్లె, మల్లెపల్లె, వనిపెంట చెక్‌పోస్టుల వద్ద ఎందుకు పట్టుకోలేకపోయారని ఎంపీ నిలదీశారు. కిడ్నాప్‌నకు వచ్చిన వారిలో ఒకరి సెల్‌ కిందపడితే మీకు అందజేసినా ఎందుకు ఆచూకీ తెలుసుకోలేకపోయారని ప్రశ్నించారు. ఆ సెల్‌ ఎవరిది? ఆ కార్లు ఎవరివి? యువకుడ్ని ఎక్కడకు తీసుకెళ్లారు? అంటూ ప్రశ్నించారు. సీఐ, ఎస్సై స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోయారు. తాము రాత్రి నుంచి గాలిస్తున్నామని, ఆచూకీ తెలియడం లేదన్నారు. స్థానికులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించి ఉంటే ఆచూకీ తెలిసి ఉండేదని, మీ విధులను సమర్థవంతంగా నిర్వహించక పోవడం వల్లనే ఇంతవరకు ఆచూకీ తెలియలేదని మండిపడ్డారు. 24 గంటల్లో ఎంపీటీసీ డాక్టర్‌ గౌస్‌పీర్‌ కుమారుడు ముర్తుజాహుసేన్‌ ఆచూకీ కనుగొని అతడిని వారి కుటుంబానికి అప్పజెప్పకపోతే రేపు ఉదయం ఇక్కడే పోలీస్‌స్టేషన్‌ దగ్గర ఆమరణ నిరాహారదీక్ష చేపడతానని ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి పోలీసులను హెచ్చరించారు.

ఎన్నడూలేని రాజకీయ కిడ్నాప్‌: ఎంపీ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఇలా రాజకీయ కిడ్నాప్‌లు ఎన్నడూ జరగలేదని, దీనికి స్థానికంగా కొంతమంది సహకరించి ఉంటారన్నారు. జమ్మలమడుగు, పులివెందుల నాయకుల హస్తం లేనిదే ఇలాంటి దారుణం జరగదని పేర్కొన్నారు. పక్కాప్లాన్‌తోనే రాత్రి మూడు కార్లల్లో వచ్చి డాక్టర్‌ గౌస్‌పీర్‌ కుమారుడ్ని ఎత్తుకెళ్లారని, ఇంతవరకు ఆచూకీ తెలుసుకోవడంలో  పోలీసులు విఫలమయ్యారన్నారు. ఈ వ్యవహారంలో స్థానిక తెలుగుదేశం నేతల సహకారం ఉన్నట్లు స్పష్టమవుతుందని తెలిపారు. ఇదే సమయంలో అక్కడకు వచ్చిన డాక్టర్‌ గౌస్‌పీర్‌ భార్య అప్సరున్నీసా, కోడలు రేష్మాలు ముర్తుజాహుస్సేన్‌ను కాపాడాలని విలపించారు. ఎంపీ, మేయర్‌ వారిని ఓదార్చారు.

Advertisement
Advertisement