టీడీపీలో మొదలైన అసంతృప్తి, అలకలు | Sakshi
Sakshi News home page

టీడీపీలో మొదలైన అసంతృప్తి, అలకలు

Published Wed, Jan 7 2015 2:24 AM

టీడీపీలో మొదలైన అసంతృప్తి, అలకలు - Sakshi

సాక్షి ప్రతినిధి, విజయనగరం : టీడీపీలో నామినేటేడ్ పదవుల పందేరం చివరి దశకొచ్చింది. జిల్లా నుంచి జాబితాలు పంపించాలని ఆదేశించడంతో  సిఫార్సులు, పైరవీలు ఊపందుకున్నాయి. ఇప్పుడిది కీలక నేతలకు తలనొప్పిగా మారింది. సర్దుబాటు చేయలేక ఇబ్బందు లు పడుతున్నారు. అధిష్టానం ఆశీస్సులు ఎవరికి ఉంటాయో అంతుచిక్కక ఆశావ హులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే కొన్ని పదవులకు సూచనప్రాయ సంకేతాలందడంతో ఇప్పటికే కొందరు అలక బూనుతున్నారు. మరికొందరు కారా లు, మిరియాలు నూరుతున్నారు. ఇంకొం దరు సమయం   వచ్చినప్పుడు చూపిస్తామని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం టీడీపీలో నేతలు నివురుగప్పిన నిప్పులా ఉన్నారు. పదవులు ఖరారు అయ్యాక లుకలుకలు బయటపడనున్నాయి. అసంతృప్తివాదులు రోడ్డెక్కే అవకాశం ఉంది. దీన్ని గమనించిన నేతలు ఇప్పటికే బుజ్జగింపులకు దిగుతున్నారు.
 
  ఎమ్మెల్సీ పదవి కోసం ...
 ఎమ్మెల్సీ పదవి కోసం టీడీపీ నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసిన వారితో పాటు పార్టీ పదవులు చేపడుతున్న నేతలు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ఈ పదవిని ఆశిస్తున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు, సాలూరు  నియోజకవర్గ నేత గుమ్మడి సంధ్యారాణి, మాజీ ఎమ్మెల్యేలు తెంటు లక్ష్మునాయుడు, ఆర్‌పీ భంజ్‌దేవ్, శోభా హైమావతి, చీపురుపల్లి నియోజకవర్గ నేత కె. త్రిమూర్తులరాజు, పూసపాటిరేగ ఎంపీపీ మహంతి చిన్నంనాయుడు, డాక్టర్ వీఎస్ ప్రసాద్ రేసులో ఉన్నారు. సామాజికవర్గ కోటాలో, డివిజన్ కోటాలో, స్థానిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, మొన్నటి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలంటూ ఒక్కొక్కరు ఒక్కో నినాదంతో కోరుతున్నారు. ఎవరికి వారు పైరవీలు చేసుకుంటున్నారు. రాష్ట్ర పార్టీలో పట్టు ఉన్న నేతలతో ప్రయత్నాలు సాగిస్తున్నారు. కొందరైతే ఎంతైనా ముట్టజెప్పేందుకు సిద్ధమవుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో పార్టీ కోసం కష్ట పడి పనిచేశామని, అప్పుడిచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అధినేత చంద్రబా బునాయుడ్ని కోరుతున్నారు. ఆశావహులంతా ఇప్పటికే తమ బయోడేటాలందజేశారు. నేతలంతా బయటకు కలిసి మెలిసి ఉన్నట్టు కనిపిస్తున్నా  లో లోపల ఎవరికి వారు ఎదుటి వారిని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు.  
 
 ఏఎంసీ చైర్మన్ పదవుల కోసం...
 జిల్లాలో తొమ్మిది ఏఎంసీలుండగా అందులో ఇప్పటికే ఒకటి తేలిపోయింది. సాలూరు ఏఎంసీ చైర్మన్‌గా విక్రం సుదర్శనరావు దాదాపు ఖరారయ్యారు. అధికారిక ఉత్తర్వులు రావల్సి ఉంది. దీంతో మిగతా ఎనిమిది చోట్ల తీవ్ర పోటీ నెలకొంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ల సిఫారసులతో ప్రయత్నిస్తున్నారు. విజయనగరం ఏఎంసీ చైర్మన్ పదవి కోసం సైలాడ త్రినాథరావు, కర్రోతు వెంకట నర్సింగరావు, మన్యాల కృష్ణ, నడిపిల్లి రవి  కుమార్ ఆశిస్తున్నా... ప్రధాన పోటీ సైలాడ త్రినాథరావు, కర్రోతు మధ్యే ఉంది. ఇందులో ఒకరికి ఎమ్మెల్యే మీసాల గీత, అశోక్ బంగ్లా కోటరీ నేతలు     మద్దతు పలకగా, ఇంకొకరు ఆశోక్‌పైనే ఆశలు పెట్టుకున్నారు. ఈ పదవి ఖరారయ్యాక ఇక్కడ తప్పనిసరిగా విభేదాలు పొడచూపడమే కాకుండా, కొందరు నేతల తీరుపై రోడ్డెక్కే అవకాశం ఉంది.
 
 కొత్తవలస ఏఎంసీకి  పి.సులోచన, తిక్కాన చిన దేముడు, గొంప వెంకటరావు పోటీ పడుతున్నారు, పార్వతీపురానికి రెడ్డి శ్రీను, డి.మోహన్, బొబ్బిలికి  పువ్వల శ్రీనివాసరావు, రమేష్‌నాయుడు, గజపతినగరానికి చంటిరాజు, చొప్ప చంద్రశేఖర్, ఎం. గౌరీనాయుడు, జి.అప్పలనాయుడు, ఎం.వెంకటరమణ పోటీ పడుతున్నారు. కురుపాం ఏఎంసీ చైర్మన్ పదవిని గుంటముక్కల వెంకటరమణమూర్తి, అంధవరపు కోటేశ్వరరావు, పల్ల రాంబాబు, బాబూల్ పాత్రుడు ఆశిస్తున్నారు. పూసపాటిరేగ ఏఎంసీకి దంతులూరి సూర్యనారాయణ రాజు, గేదెల రాజారావు, కర్రోతు సత్యనారాయణ, దల్లి ముత్యాలరెడ్డి, బొంతు అప్పలనాయుడు ఆశిస్తుండగా దంతులూరి సూర్యనారాయణ రాజుకు పదవి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.  అలాగే, చీపురుపల్లి ఏఎంసీకి, ఆర్‌ఈసీఎస్ అధ్యక్ష పదవికీ దన్నాన రామచంద్రుడు, రెడ్డి గోవింద్, సీతారామరాజు పోటీ పడుతున్నారు. వీరి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇందులో ఒకరికి ఖరారైనా మిగతా వారి నుంచి నిరసన సెగ తాకనుంది. ఇప్పటికే తమను కాదని మరొ కర్ని సిఫార్సు చేస్తున్నారంటూ నియోజకవర్గ నేతలపై పలువురు ఆశావహులు మండిపడుతున్నారు. నామినేటేడ్ పదవుల విషయంలో జరుగుతున్న    వసూళ్ల పర్వం కూడా బయట పెట్టే అవకాశం ఉంది.
 
 గ్రంథాలయ అధ్యక్ష పదవికి..
 జిల్లా గ్రంథాలయ అధ్యక్ష పదవికి నువ్వా నేనా అన్న పోటీ నెలకొంది. ఈ పదవిని పార్టీ సీనియర్ నేత గొట్టాపు వెంకటనాయుడు, ఎయిమ్స్ అధినేత కడగల ఆనంద్‌కుమార్, గజపతినగరం నేత రావి శ్రీధర్, కొమరాడ నేతలు దేవకోటి వెంకటనాయుడు, సంగిరెడ్డి మధుసూధనరావు, పార్వతీపురం నేత బర్నాల సీతారామరావు ఆశిస్తున్నా, ప్రధాన పోటీ మాత్రం గొట్టాపు వెంకటనాయుడు, కడగల ఆనందకుమార్ మధ్యే ఉంది. కడగల ఆనందకుమార్ పేరును నెల్లిమర్ల ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామినాయుడు ప్రతిపాదిస్తుండగా, గొట్టాపు వెంకటనాయుడు పేరును పార్వతీపురం డివిజన్ నేతలు ప్రతిపాదిస్తున్నారు.
 
 ఈ మధ్య ఆనంద్‌కుమార్ పేరు ఖరారైందని పుకార్లు కూడా వచ్చాయి. దీంతో పార్వతీపురం డివిజన్ నేతలు ఆనంద్‌ను లక్ష్యంగా చేసుకుని పావులు కదుతుపున్నారు. ఏనాడు జెండా పట్టుకోని, ప్లెక్సీలు కట్టని, పార్టీ కోసం పనిచేయని నేతకు ఎలా ప్రాధాన్యమిస్తారని, దశాబ్దాలుగా పార్టీకి సేవలందించిన నేతల్ని కాదని ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నేతల అండదండలతో వ్యాపారం చేసుకునే వ్యక్తిని ఎలా పరిగణలోకి తీసుకుంటారన్న వాదనను తెరపైకి తెచ్చారు. పలు సందర్భాలలో మనసులో ఆవేదనను కూడా వ్యక్తం చేవారు. దీంతో ఆనందకుమార్ ఆశలపై  పార్వతీపురం డివిజన్ నేతలు కాస్త  నీళ్లు జల్లినట్టు అయింది. ఈ నేపథ్యంలో అశోక్ ఆశీస్సులు ఎవరికి ఉంటాయో, గ్రంథాలయ అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందోనన్న ఉత్కంఠ పార్టీలో కూడా నెలకొంది.  
 

Advertisement
Advertisement