పదవుల కోసం పరుగులు | Sakshi
Sakshi News home page

పదవుల కోసం పరుగులు

Published Tue, Feb 28 2017 5:48 PM

tdp leaders lobbying for nominated posts

► ఎమ్మెల్సీ కోసం కొందరు.. కార్పొరేషన్‌ పదవుల కోసం మరి కొందరు
► వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే సీట్ల కోసం ఇంకొందరు
► టీడీపీ నేతల వెంపర్లాట
► అందరికీ అన్నీ అంటూ బాబు మాయ
► నేతలు గోడ దూకకుండా కట్టడి చేసే యత్నం


సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఎమ్మెల్యేల కోటా, గవర్నర్‌ కోటాలో పెద్ద ఎత్తున ఎమ్మెల్సీ పదవులు కట్టబెడుతున్నామంటూ చంద్రబాబు సర్కారు హడావుడి చేయడంతో జిల్లాకు చెందిన అధికార పార్టీ నేతలు పదవుల కోసం పరుగులు పెడుతున్నారు. దీంతో అధికార పార్టీలో కోలాహలం నెలకొంది. ఎవరికి దొరికింది వారు అందుకోవాలన్న రీతిలో పచ్చనేతలు పైరవీలు మొదలుపెట్టారు. సీఎం చంద్రబాబు, ఇటు చినబాబు లోకేష్‌లు మొదలుకొని అందరినీ కలిసి పదవుల కోసం ప్రాధేయపడుతున్నారు. ఎమ్మెల్యేల కోటాలో ఇప్పటికే టీడీపీ సీనియర్‌ నేత ఒంగోలు మాజీ ఎంపీ కరణం బలరాంకు ఎమ్మెల్సీ పదవి ఖాయమైందని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ మేరకు ఇప్పటికే చంద్రబాబు కరణంకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

వచ్చే నెల 6, 7 తేదీల్లో కరణం ఎమ్మెల్సీ కోసం నామినేషన్‌ వేయనున్నట్లు కూడా సోమవారం జిల్లావ్యాప్తంగా ప్రచారం జరిగింది. మరోవైపు జిల్లాకు చెందిన జూపూడి ప్రభాకరరావు సైతం ఎమ్మెల్సీ పదవి కోసం పట్టుపట్టినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో జిల్లా నుంచి కరణంకు ఒక్కరికే ఎమ్మెల్సీ ఇస్తారా.. లేదా జూపూడికి కూడా ఎమ్మెల్సీ పదవి ఇస్తారా.. అన్న విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ఇద్దరికీ ఎమ్మెల్సీ ఇచ్చే పక్షంలో తమకు ఏదో ఒక పదవి ఇవ్వాలంటూ కందుకూరుకు చెందిన మాజీ ఎమ్మెల్యే దివి శివరాం, గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, చీరాల టీడీపీ నేత పోతుల సునీతలు సైతం ఇప్పటికే ముఖ్యమంత్రికి విన్నవించినట్లు తెలుస్తోంది.

ఎమ్మెల్సీ పదవి వీలుకాని పక్షంలో కనీసం ఏదో ఒక కార్పొరేషన్‌ పదవైనా ఇవ్వాలని వారు కోరుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి అసెంబ్లీ సీట్ల పెంపు ఖాయమని అందరికీ ఎమ్మెల్యే టికెట్లు ఇస్తానంటూ సీఎం సదరు నేతలను బుజ్జగిస్తున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వలేని పక్షంలో ఏదో ఒక కార్పొరేషన్‌ పదవీ ఇస్తానని ముఖ్యమంత్రి వారికి నచ్చజెబుతున్నట్లు తెలుస్తోంది. ఇదే తరహాలో కరణం బలరాం తనయుడు కరణం వెంకటేష్‌కు సైతం ముఖ్యమంత్రి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్‌ ఇస్తానంటూ ఇప్పటికే హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

బాబు మాయ..: ప్రతి సమావేశంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి అసెంబ్లీ సీట్లు పెరగడం ఖాయమని టీడీపీ నేతలు పదే పదే చెబుతున్నారు. సీట్లు పెరగడం సంగతి దేవుడెరుగు... ఫిరాయింపు ఎమ్మెల్యేల పుణ్యమా అని జిల్లా టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు ఇప్పటికే పతాకస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో అసంతృప్తితో ఉన్న కొందరు నేతలు పార్టీ ఫిరాయించకుండా ఉండేందుకే బాబు సీట్ల పెంపు వ్యవహారం తెరపైకి తెచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే ప్రచారంతో నేతలెవ్వరూ గోడ దూకకుండా కట్టుదిట్టం చేసేందుకు బాబు మాయ చేస్తున్నట్లు ఆ పార్టీకి చెందిన నేతలే పేర్కొంటుండటం గమనార్హం.

మాగుంటకు మంత్రి పదవి..?: ముఖ్యమంత్రి గతంలో హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి మంత్రి పదవీ ఖాయమైనట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. గతంలోనూ ఇదే ప్రచారం జరిగినా.. మంత్రివర్గ విస్తరణ ఆలస్యమైంది. తాజాగా అసెంబ్లీ సమావేశాలు ముగిసినా అనంతరమే మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా మాగుంటకు మంత్రి పదవి ఇవ్వడం ఖాయమని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి మాగుంటకు మంత్రి పదవి విషయం స్పష్టం చేసినట్లు అధికార పార్టీకి చెందిన ఓ నేత పేర్కొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement