కలకలం రేపిన సర్వే | Sakshi
Sakshi News home page

కలకలం రేపిన సర్వే

Published Mon, Dec 24 2018 1:14 PM

TDP Leaders Public Survey Gang Caught in Anantapur - Sakshi

అనంతపురం,నల్లమాడ: ప్రైవేటు సంస్థలు చేస్తున్న రాజకీయ సర్వే కలకలం రేపుతోంది. వంకరకుంట గ్రామంలో నలుగురు యువకులు పబ్లిక్‌ పాలసీ రీసర్చ్‌ గ్రూప్‌ పేరుతో ఆదివారం సర్వే చేపట్టారు. పోలింగ్‌ బూత్‌ నంబర్, ఓటరు గుర్తింపు కార్డు తదితర వివరాలు ఆరా తీస్తున్నారు. ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ఓట్ల తొలగింపు కోసమే ఈ సర్వే జరుగుతోందన్న అనుమానంతో ఆ పార్టీ నాయకులు ఓబిరెడ్డి, నాగప్ప, మిలటరీ కుళ్లాయప్పలు అభ్యంతరం తెలిపారు.

సదరు యువకుల వద్ద ఎటువంటి గుర్తింపు కార్డులూ లేకపోవడంతో వారిని నేరుగా పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి అప్పగించారు. నిమిషాల వ్యవధిలో అధికార తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్‌ మైలే శివశంకర్, నాయకులు సూరి, మంజునాథ్‌రెడ్డి, సలాంఖాన్, మరికొంతమంది స్టేషన్‌కు చేరుకుని, సర్వే కోసం వచ్చిన యువకులకు మద్దతుగా నిలిచారు. ఈ సర్వే వెనుక రాజకీయ కుట్ర ఉందని ప్రతిపక్ష పార్టీ నాయకులు నిలదీశారు. వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి దుద్దుకుంట సుధాకర్‌రెడ్డి, మండల కన్వీనర్‌ పొరకల రామాంజనేయులుకు టీడీపీ నాయకులకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. సర్వే చేస్తున్న యువకులను ఎస్‌ఐ సత్యనారాయణ విచారణ చేశారు.

అడ్డదారుల్లో గెలిచేందుకే..
ప్రజల విశ్వాసం కోల్పోయిన టీడీపీ నాయకులు ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలన్న ఉద్దేశ్యంతో సర్వే ముసుగులో ప్రతిపక్ష పార్టీకి చెందిన వారి ఓట్లను తొలగించేందుకు కుట్ర పన్నారని వైఎస్సార్‌సీపీ పుట్టపర్తి నియోజకవర్గ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ధ్వజమెత్తారు. సర్వేల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వీటిపై ఎన్నికల అధికారులు, పోలీసులు తగు చర్యలు తీసుకోవాలని కోరారు.  

దాడులు తగవు
సర్వే కోసం గ్రామాలకు వచ్చే వారిపై దాడులు చేయడం తగదని సీఐ నరసింహరావు, ఎస్‌ఐ సత్యనారాయణ విలేకరుల సమావేశంలో తెలిపారు. సర్వే పేరుతో ప్రజల అభిప్రాయం తెలుసుకునే హక్కు ఎవరికైనా ఉంటుందన్నారు. సర్వేలపై అనుమానాలుంటే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

Advertisement
Advertisement