Sakshi News home page

పచ్చనోట్ల ప్రవాహం

Published Sun, Jul 13 2014 2:02 AM

పచ్చనోట్ల ప్రవాహం - Sakshi

- కుర్చీ కోసం లక్షలు కుమ్మరింపు
- ఎంపీపీ ఎన్నికల్లో భారీగా చేతులు మారిన నగదు
- మండలాల నిధులతో  సమానంగా ఖర్చు
- నేడు ఆగిరిపల్లి ఎంపీపీ ఎన్నిక

మచిలీపట్నం : టీడీపీ నేతల అధికారదాహానికి పచ్చనోట్ల కట్టలు తెగాయి. తమకు బలం లేకపోయినా ఎంపీటీసీ సభ్యులను కొనుగోలుచేసి ఎంపీపీ పదవులను చేపట్టేందుకు బరితెగించారు. ఎంత ఖర్చు చేసైనా పదవులను చేపట్టేందుకు వెనుకాడలేదు. ప్రజాతీర్పును పరిహాసం చేస్తూ పచ్చనోట్లు కుమ్మరించారు. అధికారబలం చూపించారు. ఈ నెల నాలుగో తేదీన జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో తమకు మెజారిటీ లేని మండలాలను కూడా చేజిక్కించుకున్నారు. మండలాల్లో తమ పట్టు నిలుపుకొనేందుకు ముఖ్య నేతలు సైతం తమవంతు సాయం అందించారు. ఈ ప్రక్రియలో జిల్లావ్యాప్తంగా టీడీపీ నాయకులు కోటి రూపాయలకు పైగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. కొన్ని మండలాల వార్షిక బడ్జెట్ కన్నా ఎక్కువ మొత్తం ఖర్చు చేశారు. అసాధ్యమైన చోట అనవసర రాద్దాంతం చేసి అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి ఎన్నికలను వాయిదా వేయించారు.
   
- పెడన మండల ఆదాయం ఏడాదికి కేవలం రూ.9 లక్షలు. టీడీపీ మండల నాయకుడు దాదాపు రూ.10 లక్షలు ఖర్చు చేసి వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యురాలిని తమవైపునకు తిప్పుకున్నారని ప్రచారం జరుగుతోంది. వైఎస్సార్ సీపీ విప్ జారీచేస్తే అనర్హత వేటు పడినా మళ్లీ గెలిపించే బాధ్యత తమదని సదరు నాయకుడు భరోసా ఇచ్చినట్లు తెలిసింది.

- మొవ్వ మండలంలో సంవత్సర ఆదాయం రూ.9.5 లక్షలు. ఇక్కడ తమకు మెజారిటీ లేకపోయినా ఎంపీపీ పదవిని దక్చించుకునేందుకు టీడీపీ నేతలు రూ.5 లక్షలకు పైగా ఖర్చు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

- పెదపారుపూడి మండల సంవత్సర ఆదాయం కేవలం రూ.5 లక్షలు మాత్రమే. ఇక్కడ వైఎస్సార్ సీపీకి స్పష్టమైన మెజారిటీ ఉంది. కానీ ఎలాగైనా ఎంపీపీ పదవిని పొందాలని భావించిన టీడీపీ నాయకులు ముగ్గురు ఎంపీటీసీ సభ్యులకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షలు చొప్పున నగదు అందజేసినట్లు తెలిసింది.  

- అవనిగడ్డ మండలంలోనూ ముగ్గురు వైఎస్సార్ సీపీ సభ్యులను ఓ కీలక నేత మభ్యపెట్టి టీడీపీకి అనుకూలంగా ఓటువేసేలా చేశారు. ఈ వ్యవహారంలో పెద్దమొత్తంలో నగదు చేతులు మారినట్లు స్థానికులు చెబుతున్నారు.

- వీరులపాడు మండల సంవత్సర ఆదాయం రూ.10 లక్షలు. ఇక్కడ వైఎస్సార్ సీపీకి స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ టీడీపీ నేతలు భారీ మొత్తంలో ఖర్చుచేసి ఎంపీపీ పదవిని దక్కించుకున్నారు. ఎంపీపీగా ఎన్నికైన పాటిబండ్ల జయపాల్ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి దగ్గరి బంధువు. ఎలాగైనా ఎంపీపీ పదవిని దక్కించుకునేందుకు వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యురాలికి రూ.10 లక్షలకుగా ముట్టజెప్పి తమకు అనుకూలంగా ఓటు వేయించినట్లు స్థానికులు చెబుతున్నారు. టీడీపీకి మద్దతు ఇచ్చిన ఇండిపెండెంట్‌కు కూడా పెద్ద మొత్తంలో నగదు అందజేసినట్లు ప్రచారం జరుగుతోంది.

- బాపులపాడు మండల సంవత్సర ఆదాయం రూ.60 లక్షలు. ఈ మండలంలో ముగ్గురు ఎంపీటీసీ సభ్యులు పార్టీ ఫిరాయించేందుకు టీడీపీ నాయకులు ఖర్చు చేసిన నగదు దాదాపు రూ.45 లక్షలు. ముగ్గురు ఎంపీటీసీ సభ్యులు తమ పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేసినందుకు గానూ ఒక్కొక్కరికి రూ. 15 లక్షలు చొప్పున అందజేశారని సమాచారం. ఎమ్మెల్యే వంశీ మోహన్ ఈ వ్యవహారాన్ని దగ్గరుండి నడిపినట్లు సమాచారం.

Advertisement

What’s your opinion

Advertisement